travelling charges
-
ఓటేయడానికి కిక్కిరిసిన రైళ్లు, బస్సులు
-
ఓటేయడానికి పోటెత్తారు!
సాక్షి, హైదరాబాద్: సొంతూళ్లో ఓటేసేందుకు నగరవాసులు మంగళవారం కూడా భారీగా పోటెత్తారు. పెద్దసంఖ్యలో తమ ఊళ్లకు పయనమయ్యారు. దీంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. రెగ్యులర్ రైళ్లతో పాటు వేసవి రద్దీ దృష్ట్యా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలోనూ రిజర్వేషన్లు నిండిపోవడంతో చాలామంది జనరల్ బోగీలను ఆశ్రయించారు. విజయవాడ, విశాఖ, కాకినాడ తదితర ప్రాంతాలకు బయల్దేరిన రైళ్లలో సాధారణ బోగీలు సామర్థ్యానికి మించిన ప్రయాణికులతో కిటకిటలాడాయి. మరోవైపు హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరే ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లోనూ ప్రయాణికులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఏపీఎస్ఆర్టీసీతో పాటు తెలంగాణ ఆర్టీసీకి చెందిన సుమారు 1500 బస్సులు ప్రతిరోజూ హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. రద్దీ నేపథ్యంలో మంగళవారం ఒక్కరోజే వందకు పైగా బస్సులను అదనంగా నడిపినట్లు అధికారులు తెలిపారు. అలాగే నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు వెయ్యి ప్రైవేట్ బస్సులు కూడా కిక్కిరిసిపోయాయి. ఈ రద్దీని సొమ్ము చేసుకొనేందుకు పలు ట్రావెల్స్ సంస్థలు యథావిధిగా తమ దోపిడీ కొనసాగించాయి. సాధారణ రోజుల్లో విధించే చార్జీలను రెట్టింపు చేశాయి. కొంతమంది ఆపరేటర్లు ఏకంగా రెండు రెట్లు పెంచేశారు. బస్సులు, రైళ్లతో పాటు కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాల్లోనూ జనం తరలి వెళ్లారు. ఏపీలోని సొంత ఊళ్లలో ఓటుహక్కు కలిగి ఉన్న నగరవాసులు దాదాపు 15 లక్షల మంది ఉంటారని అంచనా. వారిలో మంగళవారం ఒక్కరోజే వివిధ మార్గాల్లో దాదాపు 7 లక్షల మందికి పైగా వెళ్లినట్టు తెలుస్తోంది. (చదవండి: చలో ఆంధ్రా!) నేడు తెలంగాణ జిల్లాలకు.. మరోవైపు గురువారం జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా బుధవారం తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నగరంలో స్థిరపడినప్పటికీ, సొంత ఊళ్లోనే ఓటు హక్కు కలిగిన ఉన్న లక్షలాది మంది నగరవాసులు బుధ, గురువారాల్లో హైదరాబాద్ నుంచి తరలి వెళ్లనున్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, సంగారెడ్డి, తదితర ప్రాంతాలకు రద్దీకి అనుగుణంగా మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి, ఉప్పల్ రింగ్‌రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ వాహనాలకు గిరాకీ... రెగ్యులర్ రైళ్లలో బుకింగ్‌లు ఎప్పుడో నిలిచిపోగా, ప్రత్యేక రైళ్లలో వెయిటింగ్ లిస్టు భారీగా పెరిగింది. ఇక ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సుల్లోనూ డిమాండ్ విపరీతంగా ఉండడంతో చాలామంది ట్రావెల్స్ నుంచి కార్లు, మినీ బస్సులు తదితర వాహనాలను బుక్ చేసుకొని ఓటేయడానికి వెళుతున్నారు. నగరంలో ఉన్న ఓటర్లను ఊళ్లకు రప్పించేందుకు కొంతమంది నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సంస్థలకు అనుసంధానంగా నడిపే కారు డ్రైవర్లు సైతం తమ సొంత వాహనాలను ఏపీ వైపు మళ్లిస్తున్నారు. ప్రయాణికుల డిమాండ్, రద్దీ బాగా ఉండడంతో చార్జీలను అమాంతంగా పెంచేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి 13 వరకు 80 శాతం వాహనాలు ఏపీలోని వివిధ ప్రాంతాలకు బుక్ అయినట్టు నగరానికి చెందిన ఒక ట్రావెల్స్ నిర్వాహకుడు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, ఏలూరు, విశాఖపట్టణం, అమలాపురం, తిరుపతి, పొద్దుటూరు, కడప, ఉభయ గోదావరి జిల్లాలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని ప్రైవేట్ బస్సుల్లో డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ప్రైవేట్ బస్సుల దారిదోపిడీ సైతం తారాస్థాయికి చేరింది. హైదరాబాద్ నుంచి ఒంగోలుకు సాధారణంగా అయితే రూ.550 వరకు చార్జి ఉండగా.. ప్రస్తుతం ఆ టికెట్ ధరను ఏకంగా రూ.2వేల నుంచి రూ.2,500 వరకు పెంచేశారు. దాదాపు అన్ని మార్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
గవర్నర్ ఘనకార్యం.. తీవ్ర విమర్శలు..!
భువనేశ్వర్ : ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోయాయి.. అనే సామెత అందరికీ తెలిసిందే. ఒడిషా గవర్నర్ గణేషీ లాల్ చేసిన పని కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇంతకు ముందు ఒడిషా గవర్నర్లుగా పనిచేసిన వారు ఏడాది మొత్తానికి చేసిన ఖర్చును ప్రస్తుత గవర్నర్ గణేషీ లాల్ ఒక్క పర్యటనతోనే సమం చేశారు. దీంతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు.. సొంత రాష్ట్రం హరియాణను సందర్శించడానికి ఒడిషా గవర్నర్ గణేషీ లాల్ గత జూన్‌లో ఛాపర్లో వెళ్లారు. ఆయన సొంత ప్రాంతం సిర్సాలో ఛాపర్ దిగడానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఢిల్లీ వరకే వెళ్లారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు. దీంతో పర్యటన ఖర్చులన్నీ తడిసి మోపెడయ్యాయి. అయితే, 46 లక్షల రూపాయలు వ్యయం చేసే గవర్నర్ పర్యటనకు అనుమతిస్తూ రాష్ట్రపతి భవన్, ఒడిషా ప్రభుత్వం ఆమోద ముద్ర వేశాయి. ఈ విషయం ఒడిషా రాజ్‌భవన్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఇంతటి భారీ పర్యటనకు రాష్ట్రపతి భవన్, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్ ప్రభుత్వం ఆమోదం తెలపడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. కాగా, తనపై వస్తున్న విమర్శలపై గవర్నర్, బీజేపీ మాజీ నేత గణేషీ లాల్ మండిపడ్డారు. తన పర్యటన ఖర్చుపై తప్పుడు వివరాలు వెల్లడించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఒడిషా గవర్నరు పర్యటన నిమిత్తం ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే మొత్తం 11 లక్షలు కావడం గమనార్హం. -
విద్యార్థులకు సైకిళ్లు
lట్రాన్స్పోర్ట్ చార్జీలకు బదులు సైకిళ్లు ఇవ్వాలని నిర్ణయం lప్రభుత్వ పాఠశాలల్లో 1061 మంది బాలురు.. 985 మంది బాలికల ఎంపిక విద్యారణ్యపురి : జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. అంతదూరం నడవడం కష్టం కావడంతో విద్యార్థులు ఆటోల్లో వెళ్లేవారు. అయితే పేద పిల్లలకు రవాణా చార్జీలు భారం కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా సర్వశిక్షాభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు ద్వారా ఎంపిక చేసిన వారికి ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున అందజేస్తున్నారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 2,049, యూపీఎస్‌లు 360, ఉన్నత పాఠశాలలు 510 ఉన్నాయి. యూపీఎస్, హైస్కూళ్లలో 6,7,8 తరగతుల విద్యార్థులకు 2015–16 విద్యా సంవత్సరానికి ట్రాన్స్పోర్ట్ చార్జీల కింద ఒక్కో విద్యార్థికి రూ.3 వేల చొప్పున రూ. 61.38 లక్షలు మంజూరయ్యాయి. ఈ మెుత్తాన్ని పంపిణీ చేసేందుకు మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే 1061 మంది బాలురు, 985 మంది బాలికలను ఎంపిక చేశారు. అయితే విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ చార్జీలు చెల్లించే బదులు సైకిళ్లు ఇవ్వాలని కలెక్టర్ వాకాటి కరుణ ఇటీవలే నిర్ణయించారు. ఒక్కో సైకిల్ రూ. 3 వేల కంటే ఎక్కువే అవుతున్నందున అదనపు ఖర్చులు సుమారు రూ.13 లక్షలు తన నిధుల నుంచి ఇచ్చేందుకు కలెక్టర్ సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. టెండర్లు పిలిచి సైకిళ్లను కొనుగోలు చేయడంతో పాటు సగానికి పైగా ఆయా మండలాల ఎమ్మార్సీ కార్యాలయాలకు కూడా పంపించారు. కొద్దిరోజుల్లోనే పూర్తిస్థాయిలో చేరుకోబోతున్నాయి. గత విద్యాసంవత్సరానికి సంబంధించిన 6,7,8 తరగతుల విద్యార్థులకు ఈ సైకిళ్లు అందించనున్నారు. కాగా 2016–17 సంవత్సర ట్రాన్స్పోర్ట్ నిధులు ఇంకా మంజూరు కాలేదు.