గణేషీ లాల్ (ఫైల్ ఫొటో)
భువనేశ్వర్ : ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోయాయి.. అనే సామెత అందరికీ తెలిసిందే. ఒడిషా గవర్నర్ గణేషీ లాల్ చేసిన పని కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇంతకు ముందు ఒడిషా గవర్నర్లుగా పనిచేసిన వారు ఏడాది మొత్తానికి చేసిన ఖర్చును ప్రస్తుత గవర్నర్ గణేషీ లాల్ ఒక్క పర్యటనతోనే సమం చేశారు. దీంతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాలు.. సొంత రాష్ట్రం హరియాణను సందర్శించడానికి ఒడిషా గవర్నర్ గణేషీ లాల్ గత జూన్‌లో ఛాపర్‌లో వెళ్లారు. ఆయన సొంత ప్రాంతం సిర్సాలో ఛాపర్ దిగడానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఢిల్లీ వరకే వెళ్లారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. దీంతో పర్యటన ఖర్చులన్నీ తడిసి మోపెడయ్యాయి. అయితే, 46 లక్షల రూపాయలు వ్యయం చేసే గవర్నర్ పర్యటనకు అనుమతిస్తూ రాష్ట్రపతి భవన్, ఒడిషా ప్రభుత్వం ఆమోద ముద్ర వేశాయి. ఈ విషయం ఒడిషా రాజ్‌భవన్ అధికారులు శుక్రవారం వెల్లడించారు.
ఇంతటి భారీ పర్యటనకు రాష్ట్రపతి భవన్, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్ ప్రభుత్వం ఆమోదం తెలపడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. కాగా, తనపై వస్తున్న విమర్శలపై గవర్నర్, బీజేపీ మాజీ నేత గణేషీ లాల్ మండిపడ్డారు. తన పర్యటన ఖర్చుపై తప్పుడు వివరాలు వెల్లడించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఒడిషా గవర్నరు పర్యటన నిమిత్తం ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే మొత్తం 11 లక్షలు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment