చెట్టును ఢీకొన్నకారు..ముగ్గురి మృతి
సాక్షి, ధర్మారం/కొడిమ్యాల: రైస్‌మిల్ ప్రారంభోత్సవానికి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మామ, అల్లుడు, కూతురు మృతిచెందారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కొడిమ్యాలకు చెందిన రాగి వీరేశం(77), అతని కూతురు కొండూరి పద్మా వతి(50), అల్లుడు మనోహర్(55) ప్రాణాలు కో ల్పోగా.. సరోజన చికిత్స పొందుతుంది. కొడి మ్యాల మండల కేంద్రానికి చెందిన వీరేశం, సరోజన దంపతులకు నలుగురు కూతుళ్లు. రెండో కూతురు పద్మావతి, భర్త మనోహర్ ముప్పై ఏళ్ల క్రితం కరీంనగర్లో స్థిరపడ్డారు. వీరేశం, సరోజన దంపతులు మూడు రోజుల క్రితం కరీంనగర్‌లోని రెండో కూతురు ఇంటికి వెళ్లారు.
సోమవారం నాలుగో కూతురుకు సంబంధించిన రైస్‌మిల్ ప్రారంభోత్సవం వెల్గటూర్ మండలం గుల్లకోటలో ఉంది. ఈ కార్యక్రమానికి అత్తమామలు వీరేశం, సరోజన, తోడల్లుడు మనోహర్, పద్మావతి దంపతులు కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మామఅల్లుళ్లు వీరేశం, మనోహర్ సంఘటన స్థలంలోనే మృతిచెందారు. పద్మావతి, సరోజన తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పద్మావతి ప్రాణాలు విడిచింది. సరోజన చికిత్స పొందుతుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో కొడిమ్యాలలో విషాదం నెలకొంది. మృతుడి అల్లుడు రేణికుంట శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మారం ఎస్సై ప్రేమ్‌కుమార్ తెలిపారు. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి ఏసీపీ వెంకటరాంరెడ్డి, సీఐ నరేందర్ సందర్శించి పూర్తి వివరాలు సేకరించారు.
కొడిమ్యాలలో విషాదం
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో జరిగిన ప్రమాదంతో జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో విషాదం అలుముకుంది. అందరితో కలుపు గోలుగా ఉండే వీరేశం మృతితో మండల కేంద్రంలో ఆయన పరిచయస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.