tree man
-
నా చేతులు నరికేయండి ప్లీజ్..!
ఢాకా : బంగ్లాదేశ్‌కు చెందిన అబ్దుల్ బజందర్ అనే వ్యక్తి ‘ట్రీ మ్యాన్ సిండ్రోమ్’ అనే వ్యాధితో బాధపడుతూ.. ట్రీ మ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. శరీరంపై చెట్లల పొడుచుకొచ్చిన దద్దుర్లతో విపరీతంగా బాధపడ్డాడు. దాంతో వైద్యులు 2016లో అబ్దుల్‌కు దాదాపు 25 శస్త్ర చికిత్సలు చేసి అతని శరీరంపై వచ్చిన మొక్కల్లాంటి దద్దుర్లను తొలగించేశారు. ఆ తర్వాత అతనికి వ్యాధి పూర్తిగా నయమైందని భావించారు వైద్యులు. కానీ ఈ వ్యాధి మళ్లీ తిరగబెట్టింది. ఈ ఏడాది మే నుంచి దద్దుర్లు మళ్లీ రావడం ప్రారంభించాయి. ఈ సారి అరచేతుల నిండా ఈ చెట్లలాంటివి పుట్టుకొచ్చేశాయి. రిక్షా తొక్కుకు బతికే అబ్దుల్.. ఈ సమస్య కారణంగా చేతులతో పని చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. భరించలేని నొప్పితో విలవిల్లాడుతున్నాడు. ఈ క్రమంలో తన చేతులను తొలగించాల్సిందిగా డాక్టర్లను కోరుకుంటున్నాడు. ఈ విషయంలో అబ్దుల్ తల్లి కూడా అతనికే మద్దతు పలుకుతుంది. ‘నా కొడుకు బాధ చూడలేకపోతున్నాను. నొప్పితో విలవిల్లాడుతున్నాడు. రాత్రిళ్లు నిద్ర కూడా పోవడం లేదు. చేతులు తొలగిస్తే.. ఈ బాధ తప్పుతుంది’ అంటున్నారు. విదేశాలకు వెళ్లి మెరుగైన చికిత్స తీసుకోవాలని భావిస్తున్నాను. అందుకు తన ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం లేదంటున్నాడు అబ్దుల్. వైద్యులు మాట్లాడుతూ.. ‘నొప్పి తట్టుకోలేక అబ్దుల్ తన చేతులు తీసేయాల్సిందిగా కోరుతున్నాడు. కానీ వైద్యులుగా మేం అలా చేయలేం. త్వరలోనే అతని సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కొంటాం’ అని తెలిపారు. అహ్మద్‌కు భార్య, కూతురు ఉన్నారు. అతని ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం.. ఉచితంగా వైద్యం అందిస్తోంది. ఆస్పత్రిలోనూ అతనికి మంచి సదుపాయాలు కల్పిస్తున్నారు. అతడి పరిస్థితికి ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతోంది. -
వింత వ్యాధి.. కథ మళ్లీ మొదటికే!
ఢాకా : మాములు మనిషిగా మారేందుకు చెట్టు మనిషి ‘అబుల్ బజందర్’ చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. వైద్యులు చేసిన సర్జరీలు ఫలించకపోగా.. ఇప్పుడు మళ్లీ అతని చేతిపై కుక్క గొడుగుల్లాంటి ఆకారాలు మొలవటం ప్రారంభమైంది. దీంతో అతను ఆందోళనకు గురవుతున్నాడు. 25 ఏళ్ల బజందర్ దాదాపు పన్నెండేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నాడు. 'ఎపిడర్మోడిస్ప్లాషియా వెర్రసిఫార్మిస్' అనే చర్మ వ్యాధి అతనికి సోకింది. అది కాస్త ముదరటంతో చెట్టు బెరడు లాంటి ఆకృతులతో ఉన్న అతడి రెండు చేతులు, కాళ్లు మీద పెరిగిపోగా.. ఆ బాధతో అతను నరకం అనుభవించాడు. 2016లో ఇతని గురించి మొదటిసారి వార్తలు వెలువడగా.. బంగ్లా ట్రీ మ్యాన్(చెట్టు మనిషిగా) అతని పేరు పాపులర్ అయిపోయింది. ఢాకాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రి అతనికి ఉచితంగా చికిత్స చేసేందుకు ముందుకొచ్చింది. శస్త్రచికిత్స ద్వారా వింత వ్యాధి నుంచి విముక్తి కలిగిస్తామని అతనికి వైద్యులు మనోధైర్యం కల్పించారు. చివరకు గతేడాది 24 సర్జరీలు చేసి వాటిని తొలగించటంతో.. ఇక మాములు మనిషిని అయిపోయానని అతను సంతోషించాడు. వైద్య శాస్త్రంలో ఇదో అరుదైన చికిత్స అని బంగ్లాదేశ్ వైద్యులు కూడా గర్వంగా ప్రకటించుకున్నారు. ఇక శస్త్ర చికిత్సల అనంతరం పరిశీలన కోసం ఏడాది నుంచి అతను ఆస్పత్రిలోనే ఉంచుతున్నారు. ఓ చిన్న గదిలో భార్య కూతురుతోపాటు అతను నివసిస్తున్నాడు. కొన్ని రోజులు గడిచాక సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అతను మెరుగవటానికి కాస్త సమయం పట్టొచ్చని.. మరిన్ని శస్త్ర చికిత్సలు అవసరమని వైద్యుడు సమంత లాల్ సేన్ చెబుతున్నారు. కానీ, బజందర్ మాత్రం వణికిపోతున్నాడు. ‘‘ఇంక నాకు ఎలాంటి శస్త్ర చికిత్సలు వద్దు. నా కాళ్లు చేతులు బాగుపడతాయనే నమ్మకం పోయింది. నేను చనిపోయినా ఫర్వాలేదు. నన్ను బయటికి పంపించేయండి. నా కుటుంబాన్ని పోషించుకోవాలి. నా కూతురిని చదివించుకోవాలని’’ అంటూ వైద్యులను అతను వేడుకుంటున్నాడు. అయినప్పటికీ 25వ సర్జరీకి వైద్యులు సిద్ధమైపోయారు. ప్రపంచంలో ఇతనికి ముందు ముగ్గురు ఇలాంటి సమస్యను ఎదుర్కున్నారు. అయితే వారి విషయంలో కూడా శస్త్రచికిత్సలు పలించలేదని తెలుస్తోంది. అబుల్ బజందర్ సర్జరీకి ముందు.. ప్రస్తుతం -
16 ఆపరేషన్ల తర్వాత అతడికి ఆశ మొదలైంది
-
16 ఆపరేషన్ల తర్వాత అతడికి ఆశ మొదలైంది
ఢాకా: వృక్ష మనిషి గుర్తున్నాడా.. దాదాపు ఏడాదికిందట అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.అత్యంత అరుదుగా వచ్చే వ్యాధి బారిన పడిన ప్రపంచంలోని నలుగురిలో ఇతడు కూడా ఒకడు. కాళ్లకు చేతులకు చెట్ల బెరడ్ల మాదిరిగా, పొగాడు కాడల్లా, చెట్ల వేర్ల మాదిరిగా వికృత ఆకృతులు పొడుచుకొచ్చి గుత్తుల్లా మాదిరిగా ఉండి బ్రతకడమే కష్టంగామారిన అతడి పరిస్థితి ఇప్పుడు మెరుగైంది. ప్రపంచం మొత్తం నివ్వెర పోయేలా ఆ వ్యాధి తిరిగి అతడి వైపు చూడకుండా పూర్తిగా బయటపడ్డాడు. దాదాపు 16 ఆపరేషన్లు చేసి అతడి మాములు మనిషిని చేశారు. చదవండి..(కాళ్లు చేతులకు చెట్టు వేర్లు, బెరడ్లు మొలిస్తే..!) దీంతో అతడు మరో నెల రోజుల్లో తన ఇంటి ముఖం చూడనున్నాడు. అందరిలో కలిసిపోనున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే బంగ్లాదేశ్‌లోని అబుల్ బజందర్ అనే 25 ఏళ్ల యువకుడు ప్రస్తుతం 'ఎపిడర్మోడిస్ప్లాషియా వెర్రసిఫార్మిస్' అనే అత్యంత అరుదైన జెనిటికల్ వ్యాధితో బాధపడుతుండే వాడు. ఈ వ్యాధికారణంగా అతడి చేతులు కాళ్లకు చెట్ల బెరడ్ల మాదిరిగా వికృత ఆకృతులు వచ్చి తీరని సమస్యతో జీవిస్తున్నాడు. దీంతో అతడికి వైద్యం చేసేందుకు ఓ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ముందుకొచ్చింది. అతడి చేతికి, కాళ్లకు అలా రావడానికి కారణం ఓ చర్మ వ్యాధి అని వైద్యులు తెలుసుకున్నారు. దాదాపు పదేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్న అతడికి శస్త్రచికిత్స చేసి నయం చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. చెప్పిన మాట ప్రకారం పదహారు శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించిన వైద్యులు అతడిని మాములు మనిషిని చేశారు. దీంతో ఈ వ్యాధి వచ్చి పూర్తి కోలుకొని బయటపడుతున్న తొలి వ్యక్తిగా అబుల్ నిలవనున్నాడు. అతడి కాళ్లు, చేతి వేళ్లకు సంపూర్ణ ఆకృతినిచ్చేందుకు మైనర్ సర్జరీలు చేసి మరో 30 రోజుల్లో అతడిని డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారు. తాను మాములు మనిషిగా మారడంపట్ల అబుల్ పట్టరాని సంతోషం వ్యక్తం చేశాడు. తనకు ఇప్పుడు బతుకుపై ఆశపుడుతోందని చెప్పాడు. -
ఆ ప్రేమికుడి ఎదురుచూపు ఎండమావి అయింది
జకర్తా: కళ్లెదురుగా చావొస్తున్నా భరించగలరేమోగానీ.. కళ్లముందే అయినవాళ్లు దూరమవుతుంటే తట్టుకోవడం సాధరణంగానే భావోద్వేగాలు మిళితమైన ఉన్న మనిషికి సాధ్యం కాదు. చనిపోయేవరకు తనకు కావాల్సిన వారు లేకున్నా.. చనిపోతున్న ఆఖరిక్షణాల్లో మాత్రం తన మనసుకు దగ్గరయిన వ్యక్తి పక్కనే ఉండాలని కోరుకుంటారు.. ఇండోనేషియాలో డీడీ కోస్వారా అనే వ్యక్తి కూడా ఇలాగే కోరుకున్నాడు. అత్యంత అరుదైన జబ్బుతో బాధపడుతూ రోజుల తరబడి ఆస్పత్రికే పరిమితమై ఉంటూ ఏరోజైనా తనను చూసేందుకు తన భార్య రాకపోతుందా అని చూసిన ఎదురుచూపు చివరికి ఎండమావి అయ్యింది. ఒంట్లో సత్తువ పోయింది. అరుదైన జబ్బు అతడి శరీరం మొత్తాన్ని పీల్చిపిప్పిచేసింది. చివరకు ప్రాణాలు తీసింది. అలా తన భార్యను కుటుంబాన్ని చూడకుండానే ప్రాణాలుకోల్పోయిన ఆ వ్యక్తికి తన భార్య అంటే ఎంత ఇష్టమో.. 'నేను కెరీరే ముఖ్యమని అనుకున్నాను.. ఉద్యోగం వచ్చాకే ఇంకేదైనా అనుకున్నాను.. కానీ ఎలా ఊహించగలరు? నా జీవితంలోకి ఒకమ్మాయి వస్తుందని.. ఆమె నాసర్వస్వం అవుతుందని' అని ఆ వ్యక్తి చెప్పిన మాటలే చెప్తాయి. ఇండోనేషియాలో డీడీ కోస్వారా వ్యక్తి ఉండేవాడు. కార్పెంటర్‌గా స్థిరపడిన అతడు కెరీర్లో ముందుకెళ్లాకే పెళ్లి వగైరా అనుకున్నాడు. కానీ, అనూహ్యంగా అతడి జీవితంలోకి ఒకమ్మాయి రావడంతో ఆమెపై మనసుపడి పెళ్లి చేసుకున్నాడు. కానీ, కొద్ది కాలనికే అతడు ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధి లెవెండోస్కీ-లుట్జ్ డిస్పాస్లియా బారిన పడ్డాడు. దీంతో అతడి శరీరంలో కాళ్లకు చేతులకు చెట్ల బెరడులాంటి ఆకారాలు పుట్టుకొచ్చాయి. అతడిని ట్రీ మ్యాన్(వృక్ష మనిషి)గా కూడా పిలుస్తారు. ఫలితంగా అతడు ఏం పనిచేయలేనివాడిగా మారాడు. ఆపరేషన్లు చేసిన అవి తిరిగి పుట్టుకురావడం మొదలైంది. దీంతో చివరికి కుటుంబం నుంచి కూడా వెలివేయబడ్డాడు. ఆ తర్వాత బాడుంగ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి జబ్బు ముదరడంతో ఈ జనవరి 30న (2016) ప్రాణాలు విడిచాడు. ఆయన ఆస్పత్రిలో బ్రతికున్నన్నీ రోజులు అతడి భార్య కోసం ఎదురుచూసేవాడని, తన జబ్బు ఎప్పటికైనా తగ్గిపోయి తన కుటుంబంలో కలిసిపోతానని, కార్పెంటర్ జీవితాన్ని ప్రారంభిస్తానని కలలు కనేవాడని అదే ఆస్పత్రికి చెందిన నర్సులు తెలిపారు. -
కాళ్లుచేతులకు చెట్టు వేర్లు, బెరడ్లు మొలిస్తే..!
ఢాకా: సాధారణంగా మనకు ఒంటిపై చిన్న కురుపులాంటిది వస్తేనే పొద్దస్తమానం అది ఎలా పోతుందా అని అద్దం ముందుపెట్టుకొని చూసుకుంటూ కూర్చుంటాం. దాన్ని నయం చేసుకునేందుకు నానా మార్గాలు అనుసరిస్తుంటాం.. చివరికి అది మానిపోయి ఓ మచ్చ ఉన్నా తెగ ఫీలయిపోతుంటాం. అలాంటిది, ఓ చెట్టు బెరడు, వేళ్లు ఆకారంలో పెద్దపెద్ద ఆకృతలతో చేతులకు పొడుచుకొని వస్తే.. అవికూడా పొగాకుచుట్టకాడల గుత్తుల్లా ఏళ్లతరబడి అలాగే ఉండిపోతే.. ఊహించుకోవడానికే చాలా ఇబ్బందిగా ఉంది కదా.. బంగ్లాదేశ్‌లోని అబుల్ బజందర్ అనే 25 ఏళ్ల యువకుడు ప్రస్తుతం ఇదే సమస్యతో బాధపడుతున్నాడు. ఇతడిని అక్కడ ట్రీ మ్యాన్ (వృక్ష మనిషి) అని కూడా పిలుస్తుంటారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ ఆస్పత్రికి అతడు చికిత్స కోసం వచ్చాడు. ఈ సందర్బంగా చెట్టు బెరడు లాంటి ఆకృతులతో ఉన్న అతడి రెండు చేతులు, కాళ్లు మీడియా చూపించారు. అతడి చేతికి, కాళ్లకు అలా రావడానికి కారణం ఓ చర్మ వ్యాధి అని వైద్యులు తెలిపారు. దానిని 'ఎపిడర్మోడిస్ప్లాషియా వెర్రసిఫార్మిస్' అని అంటారని తెలిపారు. దాదాపు పదేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్న ఈ యువకుడికి శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమస్య ప్రపంచంలో చాలా అరుదుగా సంభవిస్తుందని చెప్పారు. గతంలో శస్త్ర చికిత్స ద్వారా వాటిని తొలగించినట్లు కూడా వివరించారు.