Treking
-
70 ఏళ్ల వయసులో బుగ్గల్ శిఖరంపైకి సాహస యాత్ర
ఆయన వయసు 70 ఏళ్లు.. సాధారణంగా ఈ వయసు వాళ్లు మహా అయితే తీర్థయాత్రలు చేస్తుంటారు. లేదంటే ఇంటికే పరిమితమై మనుమలు, మనుమరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. కానీ డాక్టర్ ఏబీఆర్పీ రెడ్డి (Dr ABRP Reddy) మాత్రం తీవ్ర చలికి తట్టుకుని హిమాలయాల్లో సాహసోపేతమైన ట్రెక్కింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.. అనుకోవడమే కాదు..ఆ యాత్రను పూర్తిచేసి వయసుతో పనిలేకుండా ఎలాంటి సాహసాన్ని అయినా చేయవచ్చని నిరూపించాడు. ఐటీ, యానిమేషన్ రంగంలో సీఈఓగా 25 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది. 60 ఏళ్ల వయసులో ట్రైనింగ్ ప్రారంభించి మారథాన్ రన్నర్‌గా ఎదిగారు. హైదరాబాద్ వంటి వెచ్చని ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ చల్లని వాతావరణం ఏబీఆర్పీ రెడ్డికి కొత్తేమీ కాదు. గతంలో ఢిల్లీ, ఇంగ్లండ్‌లో కూడా నివసించారు. ఇప్పటికే ఐదుసార్లు హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేసిన ఆయన కుమార్తె సింధు కూడా వెంట ఉంది. ట్రెక్కింగ్ చేయడానికి కూతురే తనకు ప్రేరణ అని ఏబీఆర్పీ రెడ్డి పేర్కొన్నారు. ఏటా 20 వేల మందికి పైగా ట్రెక్కింగ్ చేసేవారికి మార్గనిర్దేశం చేసే ఇండియా హైక్స్ బైక్ గ్రూప్‌లో ఆయన చేరారు. వారు గరిష్ట వయో పరిమితి 62 ఏళ్లుగా నిర్దేశించినప్పటికీ, ఏబీఆర్పీ రెడ్డి గుండె సంబంధిత అంశాలతో సహా ఇతర ఫిట్నెస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండడంతో ట్రెక్కింగ్ పూర్తి చేశారు. నెల రోజుల పాటు శిక్షణ.. ట్రెక్కింగ్ కోసం నెల రోజుల పాటు జిమ్‌లో శిక్షణ పొందాను. ఇందు కోసం రోజుకు 60 అంతస్తులు వేగంగా ఎక్కేవాడిని. ట్రెక్కింగ్ సమయంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీ సెంటీగ్రేడ్‌కు చేరుకుంటాయి. దీంతో తీవ్రమైన చలిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే అత్యంత క్లిష్టమైన భాగం. తీవ్ర చలిని తట్టుకునేందుకు గూడారాల లోపల ఉండాలి. స్లీపింగ్ బ్యాగులను ఉపయోగించాలి. ఎత్తుకు చేరుకున్నప్పుడు వాతావరణ పీడనాన్ని ఎదుర్కోవాలి. తక్కు వ ఆక్సిజన్ కారణంగా ఆల్టిట్యూడ్ సిక్నెస్ రావచ్చు. ఈ స్ఫూర్తితో మరిన్ని సాహసాలునా కుమార్తె సింధు టెక్కింగ్ గ్రూపులో ఉండడం వల్ల అధిరోహణ, దిగే సమయంలో ఎన్నో సూచనలు చేసింది. మూడు రోజుల్లో మా బృందంలోని మొత్తం 24 మంది ట్రెక్కర్లు దయారా బుగ్గల్ అనే 12,000 అడుగుల ఎత్తు శిఖరాన్ని చేరుకున్నాం. శిఖరాన్ని చేరుకున్నప్పుడు ట్రెక్కింగ్‌లో ఎదుర్కొన్న కష్టాలను పూర్తిగా మరిచిపోయి సంబరాలు చేసుకున్నాం. అక్కడి నుంచి కిందికి దిగడం మొదలై నాల్గో రోజు సాయంత్రం బేస్ క్యాంప్‌కు చేరుకున్నాం. బేస్ క్యాంప్ డెహ్రాడూన్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొత్తం 12,000 అడుగుల ట్రెక్కింగ్ ఇచ్చిన స్ఫూర్తితో 2025లో 18,000 అడుగుల ఎత్తు ట్రెక్కింగ్‌కు సిద్ధం అవుతున్నాను. – డాక్టర్ ఏబీఆర్పీ రెడ్డి -
Lok sabha elections 2024: ఒక్క ఓటు కోసం 39 కిలోమీటర్ల ట్రెక్కింగ్..
ఈటానగర్: ప్రజాస్వామ్యం మామూలు వ్యక్తిని సైతం మెహమాన్‌ను చేస్తుంది. అందుకు ఉదాహరణ ఈ 44 ఏళ్ల సొకేలా తయాంగ్. అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజ్వా జిల్లాలోని మారుమూలన ఉన్న మలోగాం ఆమె గ్రామం. హయులియాంగ్ అసెంబ్లీతోపాటు, అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి ఆ గ్రామం వస్తుంది. అక్కడ ఎన్నికలు మొదటి ఫేజ్‌లో జరగనున్నాయి. ఇంతకీ ఆమె మెహమాన్ ఎందుకయ్యారంటే.. ఆ ఊరులో ఓటరు ఆమె ఒక్కరే. ఆమె కోసం పోలింగ్ సిబ్బంది అంతా.. ఎన్నికలు జరిగే ఏప్రిల్ 19వ తేదీ కంటే ఒకరోజు ముందు.. అంటే ఏప్రిల్ 18న 39 కిలోమీటర్ల ఎత్తు కొండలు ఎక్కాల్సి ఉంటుంది. చైనా సరిహద్దుకు దగ్గరలో ఉన్న ఆ గ్రామంలో తయాంగ్ కోసం తాత్కాలికంగా ఓ పోలింగ్ బూత్ కూడా ఏర్పాటు చేయనున్నారు. మలోగామ్లో ఇంకొన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ వారిలో ఎవరూ ఓటు కోసం నమోదు చేసుకోలేదు. దీంతో వారికి ఓటర్ల జాబితాలో చోటు దక్కలేదు. ఒక్కరికోసం బూత్ ఎందుకని.. సమీపంలోని ఏదైనా పోలింగ్ బూత్‌లో ఓటు వేయాల్సిందిగా అధికారులు ఆమెను కోరారు. కానీ అందుకు తయాంగ్ అంగీకరించలేదు. దీంతో ఆమె ఓటు కోసం అధికారులు, భద్రతా సిబ్బంది, పోర్టర్లతో సహా పోలింగ్ బృందం హయులియాంగ్ నుంచి అనూహ్య వాతావరణం మధ్య ప్రమాదకరమైన భూభాగం గుండా కష్టతరమైన ప్రయాణం చేయనుంది. హయులియాంగ్ నుంచి మలోగామ్కి కాలి నడకన వెళ్లడానికి ఒక రోజంతా పడుతుంది. పోలింగ్ రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బూత్ తెరచి ఉంటుంది. ‘‘నేను మా గ్రామంలో చాలా అరుదుగా ఉంటాను. ఏదైనా పని ఉన్నప్పుడు లేదా ఎన్నికల సమయంలో మాలోగాం వస్తుంటా. మిగతా సమయంలో మాకు వ్యవసాయ భూములు ఉన్న లోహిత్ జిల్లాలోని వక్రోలో ఉంటాను. ఏప్రిల్ 18 సాయంత్రంలోగా ఇంటికి చేరుకుని ఓటు వేస్తా’’ అని చెబుతున్నారు. -
యాంగ్షూ ప్రకృతి చేసిన విన్యాసం
చెట్టులెక్కగలవా... ఓ నరహరి పుట్టలెక్కగలవా అంటూ చెంచులక్ష్మి ఆట పట్టించడాన్ని సినిమాల్లో చూశాం. ట్రెకింగ్, మౌంటెనీరింగ్ అంటూ కొండ వాలులు, పర్వత సానువుల వెంట పరుగులు తీసే సాహసికులను బయట చూస్తూనే ఉంటాం. ఇప్పుడు... అడ్వెంచర్ టూరిజం రాక్ క్లైంబింగ్ మీద సరదా పడుతోంది. అందుకు అనువైన శిఖరాల కోసం చైనా బాట పడుతోంది. చైనా దక్షిణభాగంలో గువాన్గ్జీ రీజియన్‌లో గుయిలిన్ నగరానికి సమీపంలో ఉంది యాంగ్షూ. ప్రకృతి చేసిన విచిత్రమైన విన్యాసాలే ఈ ఊరిని ప్రపంచం దృష్టిలో పడేటట్లు చేశాయి. యాంగ్షూ పట్టణానికి చుట్టూ పచ్చటి శిఖరాలు చీమల పుట్టల్లా ఉంటాయి. వాటి మధ్యలో కొద్దిపాటి సమతల ప్రదేశం, ఓ పక్క ‘లీ’ నది ప్రవాహం. కొండవాలులో కట్టిన ఇళ్లు, వాటిని తొంగి చూడడానికే అన్నట్లు అర్ధచంద్రాకారంలో పెద్ద రంధ్రం. కొండకు ఇంత చక్కగా ఏ శిల్పకారుడో చెక్కినట్లు అర్ధవృత్తాకారం ఎలా వచ్చిం దని ఆశ్చర్యంగా చూసేలోపు గైడ్లు ఓ సైన్సు పాఠం చెప్పేస్తారు. ఈ కొండల్లోని లైమ్‌స్టోన్, డోలమైట్, జిప్సమ్ వంటివి నీటిలో కరిగిపోవడంతో ఏర్పడిన రంథ్రం అది. వర్షాలు కురిసి నీటిలో డోలమైట్ వంటివి కరిగిపోగా మిగిలిన రాతి రూపాలివి. చీమ పుట్టలను తలపించే కొండశిఖరాలు, గుహలు, భూగర్భ జలప్రవాహాలు, సహజంగా రూపొందిన విచిత్రమైన రూపాలు కూడ. యాంగ్ షూ కే ఎందుకంటే... ఇది పొల్యూషన్ ఫ్రీ టూరిస్టు స్పాట్. ఓ సైకిల్ అద్దెకు తీసుకుని పట్టణ వీధుల్లో తిరగవచ్చు. వాటర్ కేవ్‌లో మునిగి మడ్ బాత్, మడ్ ఫైట్ చేయవచ్చు. ఇది పెద్ద వాళ్లను చిన్నపిల్లలుగా మార్చేసే సరదా ఆట. మడ్ఫైట్ చేసిన తర్వాత ఆ పక్కనే ఉండే వేడినీటి గుండాల్లో సేదదీరడంలో ఉన్న హాయిని ఫీలవ్వాల్సిందే. ఇక్కడ మోటర్‌బైక్ ట్యాక్సీలను యువతులు నడుపుతుంటారు. గైడ్‌కు కానీ, ట్యాక్సీలకు కానీ బేరమాడకపోతే పది ‘రెన్మిన్బి’ల బదులు యాభై వరకు సమర్పించుకోవాలి. అచ్చమైన చీనీ వంట! రెస్టారెంట్లలో చైనీస్ఫుడ్తోపాటు పశ్చిమ దేశాల ఆహారం కూడా దొరుకుతుంది. చాలా రెస్టారెంట్లలో మెనూ చైనాభాషలోనే ఉంటుంది. పేరు పలకడానికి వచ్చినవే ఆర్డర్ చేయడం లేదా గైడ్ సహాయంతో ఆర్డర్ చేయడమే మార్గం. చైనా వాళ్ల వంటలను వారి ఇళ్లలోనే రుచి చూడాలంటే యాంగ్షూ నుంచి పది నిమిషాలు ప్రయాణించాలి. అక్కడ రైతులు ఇళ్లలో పర్యాటకులకు వండి పెట్టడంతోపాటు కలిసి భోజనం చేస్తారు. లీ నదిలో పడవ ప్రయాణం! యాంగ్షూ చిన్న పట్టణం. గుయిలిన్ లియాన్గ్జియాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగి రోడ్డు మార్గాన వెళ్లాలి. దీనికంటే అద్భుతమైన ప్రయాణం లీ నదిలో పడవలో వెళ్లడమే. కాలుష్య రహితమైన ప్రదేశంలో ప్రవాహ వేగం తెలియని నిశ్శబ్దమైన నదిలో పడవలో విహరిస్తుంటే... ఆకాశం కనిపిస్తుంది కానీ అందదు. నేల ఉందని తెలుసు కానీ తాకలేం. తీరం మాత్రం నేనున్నానని భరోసా ఇస్తున్నట్లు ఉంటుంది. ఏ నదిలో పయనిస్తున్నా ఇలాంటి అనుభవమే ఉంటుంది. కానీ లీ నదిలో పయనించేటప్పుడు, కొండలెక్కేటప్పుడూ పక్కనే యాంగ్షూ పట్టణంలో వీధులు, ఇళ్లు కనువిందు చేస్తుంటాయి. రాక్ క్లైంబింగ్! కొండల పైకి ఎక్కుతూ మంద్రంగా ప్రవహించే లీ నదిని చూస్తూ మధ్యలో వైవిధ్యమైన ఆర్కిటెక్చర్‌తో ఉన్న చైనా ఆలయాలను చూడడానికి ఆసియా దేశాలతోపాటు పాశ్చాత్య దేశాల నుంచి కూడా పర్యాటకులు క్యూ కడుతుంటారు.