బుగ్గల్ శిఖరంపైకి సాహస యాత్ర
60 ఏళ్ల వయసులో మారథాన్ ట్రైనింగ్
ఔరా అనిపిస్తున్న డాక్టర్ ఏబీఆర్‌పీ రెడ్డిఈ స్ఫూర్తితో మరిన్ని సాహసాలు.
ఆయన వయసు 70 ఏళ్లు.. సాధారణంగా ఈ వయసు వాళ్లు మహా అయితే తీర్థయాత్రలు చేస్తుంటారు. లేదంటే ఇంటికే పరిమితమై మనుమలు, మనుమరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. కానీ డాక్టర్ ఏబీఆర్‌పీ రెడ్డి (Dr ABRP Reddy) మాత్రం తీవ్ర చలికి తట్టుకుని హిమాలయాల్లో సాహసోపేతమైన ట్రెక్కింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.. అనుకోవడమే కాదు..ఆ యాత్రను పూర్తిచేసి వయసుతో పనిలేకుండా ఎలాంటి సాహసాన్ని అయినా చేయవచ్చని నిరూపించాడు.
ఐటీ, యానిమేషన్ రంగంలో సీఈఓగా 25 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది. 60 ఏళ్ల వయసులో ట్రైనింగ్ ప్రారంభించి మారథాన్ రన్నర్‌గా ఎదిగారు. హైదరాబాద్ వంటి వెచ్చని ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ చల్లని వాతావరణం ఏబీఆర్‌పీ రెడ్డికి కొత్తేమీ కాదు. గతంలో ఢిల్లీ, ఇంగ్లండ్‌లో కూడా నివసించారు. ఇప్పటికే ఐదుసార్లు హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేసిన ఆయన కుమార్తె సింధు కూడా వెంట ఉంది. ట్రెక్కింగ్ చేయడానికి కూతురే తనకు ప్రేరణ అని ఏబీఆర్‌పీ రెడ్డి పేర్కొన్నారు. ఏటా 20 వేల మందికి పైగా ట్రెక్కింగ్ చేసేవారికి మార్గనిర్దేశం చేసే ఇండియా హైక్స్ బైక్ గ్రూప్‌లో ఆయన చేరారు. వారు గరిష్ట వయో పరిమితి 62 ఏళ్లుగా నిర్దేశించినప్పటికీ, ఏబీఆర్‌పీ రెడ్డి గుండె సంబంధిత అంశాలతో సహా ఇతర ఫిట్‌నెస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండడంతో ట్రెక్కింగ్ పూర్తి చేశారు.
నెల రోజుల పాటు శిక్షణ..
ట్రెక్కింగ్ కోసం నెల రోజుల పాటు జిమ్‌లో శిక్షణ పొందాను. ఇందు కోసం రోజుకు 60 అంతస్తులు వేగంగా ఎక్కేవాడిని. ట్రెక్కింగ్ సమయంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీ సెంటీగ్రేడ్‌కు చేరుకుంటాయి. దీంతో తీవ్రమైన చలిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే అత్యంత క్లిష్టమైన భాగం. తీవ్ర చలిని తట్టుకునేందుకు గూడారాల లోపల ఉండాలి. స్లీపింగ్ బ్యాగులను ఉపయోగించాలి. ఎత్తుకు చేరుకున్నప్పుడు వాతావరణ పీడనాన్ని ఎదుర్కోవాలి. తక్కు వ ఆక్సిజన్ కారణంగా ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ రావచ్చు.
ఈ స్ఫూర్తితో మరిన్ని సాహసాలు
నా కుమార్తె సింధు టెక్కింగ్ గ్రూపులో ఉండడం వల్ల అధిరోహణ, దిగే సమయంలో ఎన్నో సూచనలు చేసింది. మూడు రోజుల్లో మా బృందంలోని మొత్తం 24 మంది ట్రెక్కర్లు దయారా బుగ్గల్ అనే 12,000 అడుగుల ఎత్తు శిఖరాన్ని చేరుకున్నాం. శిఖరాన్ని చేరుకున్నప్పుడు ట్రెక్కింగ్‌లో ఎదుర్కొన్న కష్టాలను పూర్తిగా మరిచిపోయి సంబరాలు చేసుకున్నాం. అక్కడి నుంచి కిందికి దిగడం మొదలై నాల్గో రోజు సాయంత్రం బేస్ క్యాంప్‌కు చేరుకున్నాం. బేస్ క్యాంప్ డెహ్రాడూన్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొత్తం 12,000 అడుగుల ట్రెక్కింగ్ ఇచ్చిన స్ఫూర్తితో 2025లో 18,000 అడుగుల ఎత్తు ట్రెక్కింగ్‌కు సిద్ధం అవుతున్నాను. – డాక్టర్ ఏబీఆర్‌పీ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment