ప్రతి పైసా ఖజానాకు చేరాలి: నరసింహన్
ప్రత్యేక చర్యలకు అధికారులకు గవర్నర్ ఆదేశం
ఏ పథకం, కార్యక్రమం ఆగరాదని సూచన
ఆదాయంలో రూ.20వేల కోట్ల తగ్గుదల ఉందన్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో పేర్కొన్న ప్రతిపైసా ఖజానాకు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అధికారులను ఆదేశించారు. ఇటు కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా, గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధులను నూటికి నూరుశాతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్ర పన్నుల నుంచి రావాల్సిన మొత్తాలను రాబట్టాలని, ఇందుకోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని అన్నారు. పన్నులకు సంబంధించిన మొత్తం బకాయిలను పైసాతో సహా వసూలు చేయాలని స్పష్టం చేశారు. ఏ పథకం, కార్యక్రమాలు ఆగరాదని, ఎప్పటిలాగానే అవన్నీ కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ వనరులపై గవర్నర్ శనివారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
- నిర్ధారించిన సమయంలో అంటే మార్చి నెలాఖరులోగా బడ్జెట్లో పేర్కొన్న మేరకు ఆయా రంగాల నుంచి ఆదాయాన్ని రాబట్టి తీరాలని ఆదేశించారు.
- ఆదాయ వనరులను సమకూర్చే శాఖల అధికారులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇస్తామన్నారు.
- అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల విస్తీర్ణాన్ని వెంటనే లె క్కించి నిబంధనల మేరకు రైతులకు ఆర్థిక సాయం అందించాలని సూచించారు.
- రాష్ట్ర ఆర్థిక ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్, ఆదాయ వనరులు, వ్యయం వివరాలతో ప్రత్యేకంగా గవర్నర్కు ప్రజెంటేషన్ ఇచ్చారు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్ల రూపంలో రూ.40 వేల కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.29 వేల కోట్లే వచ్చాయని, రూ.10 వేల కోట్లు తగ్గుదల ఉందని పేర్కొన్నారు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయ శాఖల ద్వారా మార్చి నెలాఖరుకు రూ.80 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.70 వేల కోట్లే వచ్చాయని, ఇందులో రూ.10 వేల కోట్ల తగ్గుదల ఉందని అధికారులు వివరించారు.
అత్యవసరాలకే చెల్లింపులు: ఆర్థిక సంవత్సరం ఈ నెలతో ముగియనున్నందున నిధుల వ్యయంపై ఆర్థిక శాఖ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆర్థిక సంవత్సరాన్ని రెవెన్యూ లోటుతో ముగిస్తే గత తొమ్మిదేళ్ల ఆర్థిక క్రమశిక్షణ తప్పినట్టవుతుందని అధికారులు భావిస్తున్నారు. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం నిబంధనల ప్రకారం ప్రభుత్వం రెవెన్యూ మిగుల్లో ఉండాలి. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బట్టి రెవెన్యూ లోటు కొనసాగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రూ.800 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నట్లు తెలిసింది.
అందువల్ల ఇప్పటినుంచే వ్యయాన్ని కట్టడి చేయకపోతే మార్చి నెలాఖరుకు రెవెన్యూ మిగుల్లోకి రావడం కష్టమేనని ఓ అధికారి అన్నారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సిన పన్నులవాటా నుంచి గ్రాంట్ల రూపంలో రాబడి తగ్గిపోవడంతో నిధుల లభ్యత తగ్గింద న్నారు. ఇది ఆర్థిక సంవత్సరం చివరి నెలలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీతభత్యాలు, అత్యవసరాలు, ఎన్నికలకు సంబంధించిన వాటికే నిధులను విడుదల చేయాలని, మిగతా రంగాలకు నిలుపుదల చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది.