రిహార్సల్స్ మొదలు...
సాక్షి క్రీడావిభాగం : అందరిదీ ఒకటే లక్ష్యం... ఒకే వైపు గమనం, గమ్యం... క్రికెట్ విశ్వ వేదికపై జగజ్జేతగా నిలవడం. ‘ప్రపంచ’ యుద్ధాన్ని గెలుచుకునేందుకు అస్త్ర శస్త్రాలతో సన్నద్ధం కావాల్సిన సమయమిది. అందుకు తగిన సాధన సంపత్తి సిద్ధంగా ఉంది. కావాల్సిందల్లా ఏ ఆయుధం ఎలా పని చేస్తుందో సరి చూసుకోవడం. ప్రత్యర్థి అంచనాలకు అందకుండా దేనిని ఎప్పుడు ఉపయోగించాలో పరీక్షించుకోవడం.
తమ వద్ద ఏదైనా ‘బ్రహ్మాస్త్రం’ ఉంటే దానిని ఎంత జాగ్రత్తగా, ఏ కీలక క్షణంలో బయటికి తీయాలో ఆలోచించుకోవాల్సిన వ్యూహ చతురత! అవును... వన్డే ప్రపంచ కప్ కోసం ఇప్పుడు అన్ని జట్లూ రిహార్సల్లో మునిగాయి. వార్షిక పరీక్షలకు ముందు ప్రి ఫైనల్లాగా ఈ నాలుగేళ్ల పరీక్ష కోసం రాబోయే నెల రోజుల వ్యవధిని అన్ని జట్లు సమర్థంగా ఉపయోంచుకునే పనిలో పడ్డాయి. ఒకరిద్దరు మినహా ఈ ఆటగాళ్లే ప్రపంచకప్ బరిలోకి దిగుతుండటంతో దాదాపు అన్ని జట్లూ వన్డే సిరీస్‌లలో బిజీగా ఉన్నాయి. వారి సన్నాహకాలేమిటి, ఇవి వరల్డ్ కప్‌కు ముందు వారికి ఎంత వరకు ఉపయోగపడతాయనేది చూడాలి.
భారత్ మరో సారి
ప్రపంచ కప్‌కు ముందు భారత జట్టు ఆస్ట్రేలియాలోనే జరిగే ముక్కోణపు వన్డే సిరీస్‌లో పాల్గొం టోంది. భారత్, ఆసీస్‌తో పాటు ఈ టోర్నీలో ఇంగ్లండ్ మూడో జట్టుగా ఉంది. ఆసీస్ గడ్డపై ఇప్పటికే టెస్టు సిరీస్ ఆడిన భారత్, వన్డే టోర్నీలో కూడా ఆడటం ప్రాథమికంగా అనుకూలాంశంగా చెప్పవచ్చు. అక్కడి మైదానాలు, పిచ్‌లు, వాతావరణ పరిస్థితులపై ఒక అంచనా ఏర్పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భారత్, సొంతగడ్డపై ఆడే వన్డే మైదానాలతో పోలిస్తే అక్కడ చాలా తేడా ఉంటుంది.
బౌండరీ లైన్ ఎక్కువ దూరం ఉండటం వల్ల మన ఆటగాళ్ల భారీ షాట్లు కూడా అక్కడ సాధారణంగా మారిపోయి డీప్‌లో ఫీల్డర్లకు చిక్కే అవకాశం ఉంటుంది. పైగా అవుట్ ఫీల్డ్‌లో కూడా త్రో విసరడం అంత సులువు కాదనే అంశాలు అక్కడ వన్డేలు ఆడితే గానీ తెలీదు. టెస్టు సిరీస్‌లో మన బౌలింగ్ ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో తుది జట్టు కూర్పు గురించి కూడా మన పేసర్లను పరీక్షించవచ్చు. అయితే ఇలాంటి సమయంలో కూడా 1992నాటి అనుభవం కాస్త వెంటాడుతోంది.
ఎందుకంటే ప్రపంచ కప్‌కు ముందు ఇలాగే ఐదు టెస్టుల సిరీస్, ముక్కోణపు టోర్నీ ఆడిన భారత్, అసలు పోరు సమయానికి చేతులెత్తేసింది. ఆటగాళ్లంతా సుదీర్ఘ పర్యటనతో తీవ్రంగా అలసిపోయారు. ఇప్పటి ఫిట్నెస్ స్థాయి ప్రకారం చూస్తే నాటి సమస్య రాకుండా అధిగమిస్తే ధోని సేనకు ఆసీస్‌లో ఆడటం ఉపయోగపడుతుంది. మరో వైపు కివీస్ మైదానాల్లో మాత్రం ఏడాది క్రితం ఆడిన అనుభవం భారత్‌కు ఉంది.
ఆసీస్, ఇంగ్లండ్ కూడా...
ముక్కోణపు సిరీస్‌తో సొంతగడ్డపై ఆస్ట్రేలియా తమ బలాన్ని పరీక్షించుకోనుంది. స్వదేశంలోనే సన్నాహకాలు చేయడం కూడా ఆ జట్టుకు కలిసిరానుంది. క్లార్క్ ఫిట్నెస్ సమస్యగా మారిన నేపథ్యంలో అతను లేకుండా తుది జట్టులో ఎలాంటి ప్రయోగాలు చేయవచ్చనేది ఆసీస్ ఇప్పుడు ప్రయత్నించి చూడవచ్చు. ఇక చివరి నిమిషంలో కుక్‌ను తప్పించి మోర్గాన్‌ను కెప్టెన్‌గా చేయడంతో ఇంగ్లండ్ పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంది. మోర్గాన్ కూడా చాలా కాలంగా ఫామ్‌లో లేడు. కాబట్టి ఆ జట్టు కుదురుకునేందుకు ఇది మంచి అవకాశం.
ఆ నాలుగూ బిజీ బిజీ
దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ల మధ్య ప్రస్తుతం టి20 టోర్నీ జరుగుతోంది. ఆ తర్వాత జనవరి 16-28 మధ్య ఐదు వన్డేల సిరీస్ జరుగుతుంది. సరిగ్గా ఆస్ట్రేలియా తరహాలోనే కాకపోయినా ఇక్కడి బౌన్సీ పిచ్‌లలో సన్నాహకం ఇరు జట్లకూ ఉపయోగపడవచ్చు. మరో వైపు వరల్డ్ కప్ వేదికలలో ఒకటైన న్యూజిలాండ్‌లోనే కివీస్, శ్రీలంక తలపడుతున్నాయి. ఏడు వన్డేల ఈ సిరీస్ జనవరి 29న ముగుస్తుంది. సొంతగడ్డపై ఈ సిరీస్ న్యూజిలాండ్‌కు ప్రాక్టీస్ అవకాశం ఇస్తుండగా, ఉపఖండపు జట్టు శ్రీలంకకు మాత్రం ఇది మంచి చాన్స్‌గా చెప్పవచ్చు.
వారూ తగ్గలేదు...
ప్రపంచ కప్ బరిలోకి దిగుతున్న చిన్న జట్లలో యూఏఈ, ఐర్లండ్, స్కాట్లాండ్ జట్లు కూడా సీరియస్‌గా సాధన చేస్తున్నాయి. ఈ మూడు జట్ల మధ్య దుబాయ్‌లో ముక్కోణపు వన్డే టోర్నీ జరుగుతోంది. ఈ ప్రాక్టీస్ వారికి ప్రధాన టోర్నీకి ముందు ఉపయోగకరంగా ఉంటుంది. మరో వైపు జింబాబ్వే కూడా తమ స్థాయిలో సిద్ధమైంది. ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్టును ప్రకటించిన తర్వాత జింబాబ్వే సొంత గడ్డపై కెనడాతో అనధికార వన్డే సిరీస్ ఆడింది. పేరుకు జింబాబ్వే ‘ఎ’ అయినా ప్రధాన జట్టులోని ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు.
ఆ రెండూ దూరం...
మరోవైపు పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లకు మాత్రం ప్రపంచ కప్‌కు ముందు సరైన సన్నాహకం లభించడంలేదు. డిసెంబర్ 1న జింబాబ్వేతో సిరీస్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడలేదు. మరో వైపు డిసెంబర్ 19న న్యూజిలాండ్‌తో అబుదాబిలో పాక్ తమ ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. ఇరు జట్లలోని ఆటగాళ్లు తమ దేశవాళీ టోర్నీల బరిలోకి దిగి ఆ మ్యాచ్‌లను ప్రాక్టీస్‌గా ఉపయోగించుకుంటున్నారు. మొత్తానికి 14 జట్లలో 11 సీరియస్ క్రికెట్ ఆడుతున్నాయి. వేదికల్లో మార్పు ఉన్నా...అంతా ప్రపంచ కప్‌కు ముందు సర్వ శక్తులూ కేంద్రీకరిస్తున్నారు.
ముక్కోణపు వన్డే సిరీస్ షెడ్యూల్
తేదీ మ్యాచ్ వేదిక
జనవరి 16 ఆస్ట్రేలియాx ఇంగ్లండ్ సిడ్నీ
జనవరి 18 భారత్xఆస్ట్రేలియా మెల్బోర్న్
జనవరి 20 భారత్ xఇంగ్లండ్ బ్రిస్బేన్
జనవరి 23 ఆస్ట్రేలియా xఇంగ్లండ్ హోబర్ట్
జనవరి 26 భారత్ x ఆస్ట్రేలియా సిడ్నీ
జనవరి 30 భారత్ xఇంగ్లండ్ పెర్త్
ఫిబ్రవరి 1 ఫైనల్ పెర్త్