Tribal boy
-
రైతు బిడ్డకు విదేశీ విద్యా దీవెన.. జర్మనీలో ఉన్నత చదువులు
పుల్లల చెరువు మండలం సుద్దకురువ గిరిజన తండా నుంచి బనావత్ పవన్‌కుమార్ నాయక్ జర్మనీలో ఉన్నత చదువులు చదివేందుకు అర్హత సాధించాడు. తండ్రి వెంకటేశ్వర్లు నాయక్ రైతు. తనకున్న 35 సెంట్లతో పాటు, ఐదు ఎకరాలు కౌలు తీసుకుని మిర్చి, పత్తి సాగు చేశాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కరువు కరాళ నృత్యం చేయడంతో తీవ్రంగా నష్టపోయాడు. అప్పులు తీర్చలేక 2018లో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించారు. సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కింది. ఇక పవన్‌కుమార్ చిన్ననాటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తూనే ఉన్నాడు. భర్త ఆత్మహత్య చేసుకున్నా కొడుకు ఆసక్తి గమనించిన తల్లి పద్మావతి కూలి పనులు చేసుకుంటూ చదివిస్తూ వస్తోంది. పవన్‌కుమార్ కూడా చదువుపై దృష్టిని లగ్నం చేశాడు. జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపికై జర్మనీలో చదువుకుంటున్నాడు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం పవనకుమార్ తల్లికి ఇంటి పట్టా ఇచ్చి సొంత ఇంటి కలను కూడా నెరవేర్చింది. అదే విధంగా ప్రభుత్వం నుంచి ఆమెకు ప్రతి నెలా వితంతు పెన్షన్ రూ.2,750 ఇచ్చి ఆదుకుంటోంది. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో పంటలు పండక అప్పుల పాలయ్యామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తమ కుటుంబాన్ని ఆదుకున్నారని, నా బిడ్డను జర్మనీ పంపించి చదివిస్తున్నారని కన్నీటి పర్యంతమైంది . -
స్ఫూర్తిదాయకం: పూట గడవని స్థితి నుంచి.. అమెరికాలో సైంటిస్ట్ దాకా..
ముంబై: కష్టపడేతత్వం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేందుకు మహారాష్ట్రకు చెందిన భాస్కర్ హలమి జీవితం సరిగ్గా సరిపోతుంది. నిరుపేద కుటుంబంలో పుట్టి, తినేందుకు సరైన తిండి లేక ఆకలితో అలమటించిన రోజుల నుంచి అమెరికాలో శాస్త్రవేత్త స్థాయికి ఎదిగిన ఆయన ప్రతిఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అగ్రరాజ్యంలోని ఓ ప్రముఖ సంస్థలో సీనియర్ శాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ప్రతిఒక్కరు తెలుసుకోవాలి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కుర్ఖేడా తెహసీల్‌లోని చిర్చాడీ గ్రామానికి చెందిన భాస్కర్ హలామి.. ప్రస్తుతం అమెరికాలోని బయోఫార్మా కంపెనీ సిర్నావోమిక్స్‌లోని రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ ప్రధానంగా జన్యుపరమైన ఔషధాలపై పరిశోధనలు చేస్తుంటుంది. ఇందులో భాస్కర్ ఆర్ఎన్ఏ ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తున్నారు. చిర్చాడీ గ్రామంలో సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తి భాస్కరే. తర్వాత ఆయన మాస్టర్స్, పీహెచ్డీ కూడా పూర్తిచేసి గొప్ప స్థాయికి చేరుకున్నారు. తన చిన్న తనంలో తన కుటుంబం పడిన కష్టాలు, తినడానికి తిండి లేని రోజులను గుర్తు చేసుకున్నారు హలామి. ‘ ఒక్క పూట భోజనం కోసం చాలా ఇబ్బందులు పడ్డా. సరైన తిండి, పని దొరకని ఆనాటి రోజుల్లో ఎలా బతికామనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ మా కుటుంబం ఇప్పటికీ ఆశ్చర్యానికి గురవుతుంది. వర్షాకాలంలో తమకున్న చిన్న పొలంలో పంటలేసుకునేందుకు కూడా వీలుండేది కాదు. కొన్ని నెలల పాటు పని దొరక్క ఇప్ప పూలను వండుకొని తినేవాళ్లం. బియ్యం పిండితో అంబలి కాచుకొని ఆకలి తీర్చుకునేవాళ్లం. మా ఊరిలో 90 శాతం ప్రజల పరిస్థితి ఇదే’ అని తెలిపారు భాస్కర్ హలామి. భాస్కర్ హలామీ తండ్రి ఏడో తరగతి వరకు చదువుకున్నారు. ఆయనకి చిన్న ఉద్యోగం వచ్చిన తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని భాస్కర్ గుర్తు చేసుకున్నారు. 100 కి.మీ దూరంలోని ఓ స్కూల్లో తన తండ్రికి వంట చేసే పని దొరికిందని పేర్కొన్నారు. అక్కడి వరకు వెళ్లడానికి సరైన ప్రయాణ వసతులు కూడా ఉండేవి కాదని తెలిపారు.కొన్నాళ్లకు ఆ స్కూల్ ఉన్న కసనూర్‌కు కుటుంబం మొత్తం మకాం మార్చిందని పేర్కొన్నారు. భాస్కర్ 4వ తరగతి వరకు కసనూర్‌లోనే చదువుకున్నారు. తర్వాత స్కాలర్‌షిప్‌పై యవత్మల్లో ఉన్న ప్రభుత్వ విద్యానికేతన్‌లో 10వ తరగతి వరకు పూర్తి చేశారు. గడ్చిరోలిలో బీఎస్సీలో డిగ్రీ పూర్తిచేశారు. తర్వాత నాగర్‌పూర్‌లో కెమిస్ట్రీలో మాస్టర్స్ పట్టా పుచ్చుకున్నారు. 2003లో ప్రఖ్యాత లక్ష్మీనారాయణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో పాస్ అయినప్పటికీ.. భాస్కర్‌కు పరిశోధనపై ఆసక్తి తగ్గలేదు. పీహెచ్డీ నిమిత్తం అమెరికా వెళ్లి డీఎన్ఏ, ఆర్ఎన్ఏలో పరిశోధనలు చేశారు. ‘మిషిగన్ టెక్నాలజికల్ యూనివర్సిటీ’ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం సిర్నావోమిక్స్‌లో పనిచేస్తున్న తనకు.. తమ సంస్థల్లో చేరాలని కోరుతూ ప్రతివారం ఓ అరడజను కంపెనీల నుంచి ఇ-మెయిల్స్ వస్తుంటాయని ఆయనే స్వయంగా తెలిపారు. ఇదీ చదవండి: అమ్మనా జర్మనీ కోడలా?.. వైరల్ -
పసి ప్రాణాన్ని బలిగొన్న ‘బాతు’!
బుచ్చినాయుడుకండ్రిగ (చిత్తూరు జిల్లా): ఓ బాతుకు సంబంధించిన వివాదంలో గిరిజన బాలుడు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని పార్లపల్లి ఎస్టీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రూప, రమేష్ దంపతులకు వెంకటరమణ (11), రమేష్ (8) ఇద్దరు కుమారులు. భర్త రమేష్ ఏడేళ్ల కిందట ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో రూప కూలి పనులు చేసుకుంటూ కుమారులను చదివించుకుంటోంది. వెంకటరమణ స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. శనివారం వెంకటరమణ తల్లితో కలిసి పొలాల వద్ద వేరుశనగకాయల కొట్టేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం వరకు తల్లితో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత ఇంటికొస్తూ పంట కాలువలో చేపలు పట్టి పక్కనే బాతులు మేపుతున్న వారికి ఇచ్చి వారి నుంచి ఓ బాతు తీసుకుని ఇంటికొస్తున్నాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన మురగారెడ్డి కుమారుడు ధనుష్ ఆ బాతు తనకు కావాలని బలవంతంగా లాక్కెళ్లాడు. తర్వాత ధనుష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెంకటరమణ వెళ్లి బాతును తెచ్చుకున్నాడు. ఇది తెలుసుకున్న ధనుష్.. తల్లితో కలిసి వెంకటరమణ ఇంటికెళ్లి గొడవచేసి బాతును తిరిగి తెచ్చుకున్నారు. ఈ క్రమంలో సాయంత్రం ఇంటి నుంచి బయటకెళ్లిన వెంకటరమణ రాత్రంతా ఇంటికి రాలేదు. బంధువులు వెతికినా ఫలితం లేదు. అయితే ఆదివారం ఉదయం ఇంటి సమీపంలోని ముళ్లపొదల్లో వెంకటరమణ శవమై కనిపించాడు. బాతుకోసం తన బిడ్డను ధనుష్ చంపేశాడని తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. ధనుష్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
విద్యార్థి మృతి.. పాఠశాల నిర్లక్ష్యమే కారణం
తమ కుమారుడు బాగా చదువుతున్నాడు. ఇంకా బాగా చదివించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలని ఆ తల్లిదండ్రులు భావించారు. వారి ఆశలకు తగ్గట్టుగానే ఆ విద్యార్థి కూడా చదువులో రాణిస్తున్నాడు. ఐటీడీఏ ప్రోత్సాహంతో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలోనూ అతడికి చోటు లభించింది. దీంతో రాజమహేంద్రవరంలోని హోలీ ఏంజెల్స్ పాఠశాలలో చేరాడు. అయితే విధి వక్రించింది. అతడి ఆశలను చిదిమేస్తూ అనారోగ్యం, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఆ బాలుడు మృతి చెందాడు. కన్నవారిని, కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచాడు. సాక్షి, రంపచోడవరం(తూర్పు గోదావరి) : రాజమహేంద్రవరం హోలీ ఏంజెల్స్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఓ గిరిజన విద్యార్థి మృతి చెందాడు. ఆ విద్యార్థి మృతదేహంతో ఆ గ్రామ గిరిజనులు, తల్లిదండ్రులతో కలిసి బుధవారం ఐటీడీఏ ఎదుట ఆందోళన చేశారు. మండలంలోని బి.రామన్నపాలెం గ్రామానికి చెందిన కంగల సాయిబాబాదొర(16) బుధవారం రాజమహేంద్రవరం జీఎస్ఎల్ ఆసుపత్రిలో మృతి చెందాడు. వారం రోజుల నుంచి విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతున్నా యాజమాన్యం పట్టించుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి జోగిదొర పాఠశాలకు వెళ్లి కుమారుడిని ఆసుపత్రిలో చేర్పించారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏటా ఐటీడీఏ బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తోంది. ఎంపిక చేసిన కార్పొరేట్ పాఠశాలకు ఐటీడీఏ ఏటా ఫీజులు చెల్లిస్తోంది. దీనిలో భాగంగానే సాయిబాబాదొర హోలీ ఎంజెల్సీలో పదో తరగతి చదువుతున్నాడు. ఐటీడీఏ ఎదుట ఆందోళన హోలీ ఏంజెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి ఐటీడీఏ ఎదుట విద్యార్థి మృతదేహంతో ఆందోళన చేశారు. వారం రోజుల నుంచి విద్యార్థి జ్వరంతో బాధపడుతున్నా పట్టించుకోలేదని, కనీసం ఇంటికి ఫోన్ చేసుకునేందుకు కూడా ఫోన్ ఇవ్వలేదని ఆరోపించారు. సకాలంలో వైద్యం చేయించి ఉంటే విద్యార్థి మృతి చెందేవాడు కాదని గ్రామస్తులు వాపోయారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని మృతదేహంతో బైఠాయించారు. దీంతో ఐటీడీఏ ఏపీఓ నాయుడు మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తులతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం తరలించారు. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహం తరలింపు రాజమహేంద్రవరం క్రైం: పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వలన గిరిజన విద్యార్థి మృతి చెందాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. మరోవైపు పాఠశాల యాజమాన్యం చర్యలు కూడా ఆ ఆరోపణలు వాస్తవమన్నట్టుగానే వ్యవహరించారు. బాలుడు వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుంటే హోలీ ఏంజెల్స్ పాఠశాల యాజమాన్యం ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా తమ వద్ద ఉన్న మాత్రలు వేస్తూ కాలం వెళ్లదీసింది. ఈ నేపథ్యంలో సాయిబాబు దొర పరిస్థితి విషమించడంతో హుటాహుటిన మంగళవారం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కాలేజీ యాజమాన్యం మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా బాలుడు స్వగ్రామం తరలించారు. పాఠశాలపై అనేక ఆరోపణలు గతంలో హోలీ ఏంజల్స్ పాఠశాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో యాజమాన్యం విఫలమవుతోంది. మూడేళ్ల క్రితం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయ కృష్ణన్ ఉన్న సమయంలో గిరిజన విద్యార్థులపై దాడులకు పాల్పడడం, వారిని కొట్టడం, మంచి భోజనం పెట్టకుండా హింసించడం, వంటివి చేయడంతో అప్పట్లో పాఠశాల విద్యార్థులు ఆందోళన చేశారు. అప్పటి సబ్ కలెక్టర్ ఈ సంఘటనపై విచారణ జరిపారు. అప్పటి ప్రభుత్వం పాఠశాల యాజమాన్యంపై ఏ విధమైన చర్యలు తీసుకోకుండా, పాఠశాల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పాఠశాల యాజమాన్యం మరలా పాత ధోరణి అవలంభించడం, విద్యార్థులకు సరైన వసతి భోజనం పెట్టకపోవడంతో వారు పౌష్టికాహార లోపంతో ఉంటున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ పాఠశాల పై దృష్టి సారించి, విద్యార్థులను విచారణ చేసి పాఠశాలలో ఏవిధంగా జరుగుతున్నది సమగ్ర విచారణ జరపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో పర్యవేక్షణ కరువు ఐటీడీఏ జిల్లాలోని ఏడు బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు ఏటా ప్రవేశం కల్పిస్తోంది. ఏటా మూడు, ఐదు, ఎనిమిది తరగతుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. వీరు పదో తరగతి పూర్తయిన తరువాత బయటకు వస్తారు. ఇదే తరహాలో హోలీ ఎంజెల్స్ పాఠశాలలో విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ రెండేళ్ల క్రితం గిరిజన విద్యార్థులు తమకు ఆహారం సరిగా పెట్టడం లేదని ఆరోపిస్తూ ఐటీడీఏ పీవోను కలిసి ఆందోళన చేశారు. గిరిజన సంక్షేమ విద్యా విభాగం బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించిన తరువాత వారి బాగోగులు పట్టించుకోవడం లేదు. దీంతో అక్కడ విద్యార్థులు ఏం తింటున్నారో, ఎలా చదువుతున్నారో, అసలు పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఎలా వ్యవహరిస్తోంది? అనేది తెలుసుకోవడం లేదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందించడం పరిపాటిగా మారింది. -
ఖాకీ బండి.. కేసు ఉండదండి!
పోలీసు వాహనం ఢీకొని ఏడేళ్ల గిరిజన బాలుడు మృత్యువాత కనీసం ఆగకుండా వెళ్లిపోయిన పోలీసు అధికారి ఆనక రూ. మూడు లక్షలకు తెగిన బేరం అరకులో అడ్డగోలు పంచాయతీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వాస్తవం ఖాకీ కండకావరంతో ఓ పోలీసు అధికారి నిర్దాక్షిణ్యంగా వాహనం నడిపి ఓ గిరిజన బాలుడి దుర్మరణానికి కారణమయ్యాడు. ఆ బాలుడిని ఢీకొట్టిన తర్వాతైనా దిగి ఏమైందో చూడకుండా నిర్లక్ష్యంగా ముందుకు వెళ్లిపోయాడు. ఆ తరువాత గిరిజన పెద్దలకు విషయం తెలిసి పంచాయతీ పెడితే రూ.మూడు లక్షలు పారేసి సెటిల్ చేసేసుకున్నాడు. పోలీసు అధికారులకు విషయం తెలిసినా బయటకు పొక్కకుండా నోరు నొక్కేసుకుంటున్న వైనం ఒక్కరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అరకులోయ మండలం కొల్లభల్లుగుడలో శనివారం ఉద్రిక్తత సృష్టించిన ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. - సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం అరకులోయ మండలం కొత్తభల్లుగుడ గ్రామంలో శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఓ పోలీసు అధికారి ప్రయాణిస్తున్న బొలేరో వాహనం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల సమీపంలో ఓ గిరిజన బాలుడిని ఢీకొట్టింది. రోడ్డు పక్కనే ఉన్న చెట్టు వద్దకు నేరేడు పండ్లు కోసుకునేందుకు వెళ్తున్న బాలుడు వంతాల సూర్య (7) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర రక్తస్రావంతో క్షణాల్లోనే చనిపోయినట్లు నిర్ధారించుకున్న పోలీసు అధికారి కనీసం అక్కడ ఆగకుండా బొలేరోతో అరకులోయకు వెళ్లిపోయారు. సూర్యతో కలిసి అక్కడకు ఆడుకునేందుకు వచ్చిన చిన్నారులు హఠాత్పరిణామంతో భీతిల్లిపోయారు. అప్పటికే కూలి పనికి వెళ్లిపోయిన సూర్య తండ్రి జాని, ఇంటి వద్దనే ఉన్న తల్లి కలిమొని విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. ఏమైందో.. ఏమో .. తమ బిడ్డ విగతజీవిగా పడి ఉన్నాడని రోదిస్తున్న వారి వద్దకు సీపీఎం అరకు డివిజన్ నాయకుడు వచ్చి జరిగిన దారుణం వివరించారు. పోలీసు వాహనం ఢీకొనడం వల్లనే మీ బిడ్డ చనిపోయాడని చెప్పారు. ఆ సమయంలో అటుగా వెళ్లిన ఓ ఆటో డ్రైవర్ తనకు ఈ విషయం చెప్పినట్టు వివరించారు. గిరిజనుల ఆందోళనతో స్తంభించిన ట్రాఫిక్ కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు, గ్రామస్తులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. సంఘటన స్థలానికి అరకులోయ ఏఎస్ఐ వెంకటరావు, మరో కానిస్టేబుల్ పదిన్నర గంటల సమయంలో చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో అరకులోయ నుంచి వచ్చే వాహనాలను సమీపంలోని బోసుబెడ నుంచి జనంగుడ మీదుగా విశాఖ వైపునకు మళ్లించారు. విశాఖ నుంచి వచ్చే వాహనాలను గేటు వలస నుంచి జనంగుడ మీదుగ అరకులోయకు మళ్లించారు. 11 గంటల సమయంలో అరకులోయ ఎస్ఐ పి.సింహాచలం సంఘటన స్థలానికి రావడంతో అతనే ప్రమాదం చేసిన పోలీసు అధికారి అనుకుని ముహిళలు దాడికి యత్నించారు. పరిస్థితి గమనించిన ఎస్ఐ అక్కడి నుంచి ఉడాయించారు. కొంతసేపటికి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో ఎట్టకేలకు పోలీసులు రాజీ యత్నాలు మొదలుపెట్టారు. సంఘటన జరిగిన స్థలం నుంచి సరిగ్గా రెండు కిలో మీటర్ల దూరంలో పంచాయతీ పెట్టించారు. కొత్తభల్లుగుడ గ్రామ పెద్దలు, సీపీఎం నాయకులు సెటిల్మెంట్కు రంగంలోకి దిగారు. మొదట రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలని బాలుడి బంధువులు డిమాండ్ చేయగా రూ. 50 వేలతో పోలీసులు బేరం మొదలుపెట్టారు. చివరికి రూ. 3 లక్షలు ఇచ్చేందుకు ఖాకీలు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. పాడేరు ఏఎస్పీ ఎ.శశికుమార్ సంఘటన స్థలానికి బయలుదేరినా.. ఆ తర్వాత పంచాయతీ ముగిసిందని తెలిసి మార్గ మధ్యం నుంచే తిరిగి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఆ అధికారి ఎక్కడ? అరకు, డుంబ్రిగుడ పోలీసులు పంచాయతీలో పాల్గొని బేరమాడినట్టు తెలుస్తోంది. అయితే ప్రమాదం చేసిన పోలీసు అధికారి మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. వాస్తవానికి ప్రమాదం జరిగిన సమయంలో ఆ బొలేరా వాహనం ఆయనే స్వయంగా నడుపుతున్నాడా.. లేక డ్రైవర్ ఎవరైనా నడుపుతున్నారా అనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఓ పసివాడి నిండు ప్రాణం బలిగొన్న ఘటనను కేవలం మూడు రూ.లక్షలకు వెలగట్టి పంచాయతీని తెగగొట్టిన ఖాకీల నిరంకుశత్వంపై ఉన్నతాధికారులు ఏమేరకు స్పందిస్తారో చూడాలి.