పోలీసు వాహనం ఢీకొని ఏడేళ్ల గిరిజన బాలుడు మృత్యువాత
కనీసం ఆగకుండా వెళ్లిపోయిన పోలీసు అధికారి
ఆనక రూ. మూడు లక్షలకు తెగిన బేరం
అరకులో అడ్డగోలు పంచాయతీ
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వాస్తవం
ఖాకీ కండకావరంతో ఓ పోలీసు అధికారి నిర్దాక్షిణ్యంగా వాహనం నడిపి ఓ గిరిజన బాలుడి దుర్మరణానికి కారణమయ్యాడు. ఆ బాలుడిని ఢీకొట్టిన తర్వాతైనా దిగి ఏమైందో చూడకుండా నిర్లక్ష్యంగా ముందుకు వెళ్లిపోయాడు. ఆ తరువాత గిరిజన పెద్దలకు విషయం తెలిసి పంచాయతీ పెడితే రూ.మూడు లక్షలు పారేసి సెటిల్ చేసేసుకున్నాడు. పోలీసు అధికారులకు విషయం తెలిసినా బయటకు పొక్కకుండా నోరు నొక్కేసుకుంటున్న వైనం ఒక్కరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అరకులోయ మండలం కొల్లభల్లుగుడలో శనివారం ఉద్రిక్తత సృష్టించిన ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. - సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
అరకులోయ మండలం కొత్తభల్లుగుడ గ్రామంలో శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఓ పోలీసు అధికారి ప్రయాణిస్తున్న బొలేరో వాహనం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల సమీపంలో ఓ గిరిజన బాలుడిని ఢీకొట్టింది. రోడ్డు పక్కనే ఉన్న చెట్టు వద్దకు నేరేడు పండ్లు కోసుకునేందుకు వెళ్తున్న బాలుడు వంతాల సూర్య (7) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర రక్తస్రావంతో క్షణాల్లోనే చనిపోయినట్లు నిర్ధారించుకున్న పోలీసు అధికారి కనీసం
అక్కడ ఆగకుండా బొలేరోతో అరకులోయకు వెళ్లిపోయారు. సూర్యతో కలిసి అక్కడకు ఆడుకునేందుకు వచ్చిన చిన్నారులు హఠాత్పరిణామంతో భీతిల్లిపోయారు. అప్పటికే కూలి పనికి వెళ్లిపోయిన సూర్య తండ్రి జాని, ఇంటి వద్దనే ఉన్న తల్లి కలిమొని విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. ఏమైందో.. ఏమో .. తమ బిడ్డ విగతజీవిగా పడి ఉన్నాడని రోదిస్తున్న వారి వద్దకు సీపీఎం అరకు డివిజన్ నాయకుడు వచ్చి జరిగిన దారుణం వివరించారు. పోలీసు వాహనం ఢీకొనడం వల్లనే మీ బిడ్డ చనిపోయాడని చెప్పారు. ఆ సమయంలో అటుగా వెళ్లిన ఓ ఆటో డ్రైవర్ తనకు ఈ విషయం చెప్పినట్టు వివరించారు.
గిరిజనుల ఆందోళనతో స్తంభించిన ట్రాఫిక్
కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు, గ్రామస్తులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. సంఘటన స్థలానికి అరకులోయ ఏఎస్‌ఐ వెంకటరావు, మరో కానిస్టేబుల్ పదిన్నర గంటల సమయంలో చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో అరకులోయ నుంచి వచ్చే వాహనాలను సమీపంలోని బోసుబెడ నుంచి జనంగుడ మీదుగా విశాఖ వైపునకు మళ్లించారు. విశాఖ నుంచి వచ్చే వాహనాలను గేటు వలస నుంచి జనంగుడ మీదుగ అరకులోయకు మళ్లించారు. 11 గంటల సమయంలో అరకులోయ ఎస్‌ఐ పి.సింహాచలం సంఘటన స్థలానికి రావడంతో అతనే ప్రమాదం చేసిన పోలీసు అధికారి అనుకుని ముహిళలు దాడికి యత్నించారు. పరిస్థితి గమనించిన ఎస్‌ఐ అక్కడి నుంచి ఉడాయించారు. కొంతసేపటికి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో ఎట్టకేలకు పోలీసులు రాజీ యత్నాలు మొదలుపెట్టారు. సంఘటన జరిగిన స్థలం నుంచి సరిగ్గా రెండు కిలో మీటర్ల దూరంలో పంచాయతీ పెట్టించారు. కొత్తభల్లుగుడ గ్రామ పెద్దలు, సీపీఎం నాయకులు సెటిల్‌మెంట్‌కు రంగంలోకి దిగారు. మొదట రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలని బాలుడి బంధువులు డిమాండ్ చేయగా రూ. 50 వేలతో పోలీసులు బేరం మొదలుపెట్టారు. చివరికి రూ. 3 లక్షలు ఇచ్చేందుకు ఖాకీలు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. పాడేరు ఏఎస్పీ ఎ.శశికుమార్ సంఘటన స్థలానికి బయలుదేరినా.. ఆ తర్వాత పంచాయతీ ముగిసిందని తెలిసి మార్గ మధ్యం నుంచే తిరిగి వెళ్లిపోయినట్టు తెలిసింది.
ఆ అధికారి ఎక్కడ?
అరకు, డుంబ్రిగుడ పోలీసులు పంచాయతీలో పాల్గొని బేరమాడినట్టు తెలుస్తోంది. అయితే ప్రమాదం చేసిన పోలీసు అధికారి మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. వాస్తవానికి ప్రమాదం జరిగిన సమయంలో ఆ బొలేరా వాహనం ఆయనే స్వయంగా నడుపుతున్నాడా.. లేక డ్రైవర్ ఎవరైనా నడుపుతున్నారా అనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఓ పసివాడి నిండు ప్రాణం బలిగొన్న ఘటనను కేవలం మూడు రూ.లక్షలకు వెలగట్టి పంచాయతీని తెగగొట్టిన ఖాకీల నిరంకుశత్వంపై ఉన్నతాధికారులు ఏమేరకు స్పందిస్తారో చూడాలి.