ఘనంగా ఆదివాసీ దినోత్సవం
సాక్షి, అమరావతి/పార్వతీపురం టౌన్/పాడేరు: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గిరిజన ఎమ్మెల్యేలు, నేతలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, అల్లూరి సీతారామరాజు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న సేవలను కొనియాడారు.
90 శాతం హామీలు నెరవేర్చాం..
విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి జ్యోతి ప్రజ్వలన చేసి ఆదివాసీ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనులకు ఇచ్చిన హామీల్లో 90 శాతానికి పైగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని, మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పుష్పశ్రీవాణి కొనియాడారు. కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, పీడిక రాజన్నదొర తదితరులు పాల్గొన్నారు.
పాడేరులో ఘనంగా..
విశాఖ జిల్లా పాడేరులో ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన గిరిజన దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన గిరిజన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్, మాజీ మంత్రి మణికుమారి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో..
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ ఎస్టీ సెల్ నేతలు పాల్గొన్నారు. నాడు వైఎస్సార్ 32 లక్షల ఎకరాలకు పైగా భూముల్లో గిరిజనులకు హక్కులు కల్పించారని పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కుంభా రవిబాబు గుర్తుచేసుకున్నారు. నేడు సీఎం వైఎస్ జగన్ దాదాపు 50 వేల ఎకరాల భూమిని 24,500 మంది గిరిజన కుటుంబాలకు పంపిణీ చేసేందుకు నిర్ణయించారని కొనియాడారు.