గిరిజనుల కోసం గళమెత్తుతా..
భద్రాచలం, న్యూస్‌లైన్ : గిరిజన సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటులో గళమెత్తుతానని, శక్తివంచన లేకుండా వారి అభ్యున్నతి కోసం పోరాడుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోత్ మదన్‌లాల్, ఇతర నాయకులతో కలిసి శుక్రవారం ఆయన భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆమరణ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజనుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావటం దుర్మార్గమైన చర్య అన్నారు.
కేంద్రంలో నరేంద్రమోడీ వస్తే ఏదో అద్భుతాలు సృష్టిస్తారని ఆశించిన తెలంగాణ ప్రజలకు ఈ ఆర్డినెన్స్ ఆశనిపాతంలా మారిందన్నారు. ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ రద్దు కోసం టీఆర్ఎస్ ఎంపీలతో కలసి పార్లమెంట్లో చర్చకు లేవనెత్తుతామని చెప్పారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం జరిగే ఉద్యమాల్లో వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ముందుంటుందని, ఈ విషయంలో సీపీఎం వంటి పార్టీలతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ముంపుప్రాంత వాసులకు అండగా నిలిచేలా ఎమ్మెల్యే రాజయ్య ఆమరణ దీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు.
తెలంగాణలోనే ఉంచేలా పోరాడుతాం : పాయం
ముంపు మండలాలను తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచేలా వైఎస్ఆర్సీపీ పక్షాన అసెంబ్లీ లోపల, బయట పోరాడుతామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివాసీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. ముంపు ప్రాంతంలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు తాము ఎటువైపు వెళ్లాలనే దానిపై సందిగ్ధింలో ఉన్నారని, దీనిపై వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు. ముంపు ప్రాంత వాసుల సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకతీతంగా ఉద్యమిస్తామని ప్రకటించారు.
ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలి : మదన్‌లాల్
గిరిజనులను గోదావరిలో ముంచే ఆర్డినెన్స్‌ను తక్షణమే వెనక్కు తీసుకోవాలని వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంతో ఆదివాసీలకు ఎంతో అనుబంధం ఉందని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ముంపు ప్రాంతాల పరిరక్షణకు అన్ని పార్టీలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ భద్రాచలం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తెల్లం వెంకట్రావు, నాయకులు కడియం రామాచారి, మంత్రిప్రగడ నర్సింహారావు, కొవ్వూరి రాంబాబు, గంటా కృష్ణ, రామలింగారెడ్డి, మన్మద హరి, చిట్టిబాబు, చిన్ని, దామెర్ల రేవతి, సమ్మక్క, ఎంపీటీసీ బానోతు రాముడు, మండవ వెంకటేశ్వరెడ్డి, రాయిని రమేష్, కృష్ణారెడ్డి, కాపుల నవీన్, రాజు, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.