దరి చేరని వెలుగు!
మారని గిరిజనుల బతుకులు
మూలనపడిన ప్రాసెసింగ్ యూనిట్లు
తెరుచుకోని శీతల గిడ్డంగి
కోట్లాది రూపాయలు వృథా
నిర్లక్ష్యపు చీకట్లలో ‘వెలుగు’ పథకాలు
సీతంపేట : గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన పథకాలు నిర్లక్ష్యపు చీకట్లలో మగ్గిపోతున్నాయి. లబ్ధిదారుల జీవితాలనూ మసకబార్చేస్తున్నాయి. ఈ పథకాల అమలు కోసం ఏర్పాటు చేసిన యంత్రాలు, నిర్మించిన భవనాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలో టీపీఎంయూ (ట్రైబల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్) పరిధిలోని ఏడు మండలాల్లో గిరిజనుల అభ్యున్నతికి చేపట్టిని వెలుగు పథకాలు మూలన పడుతున్నాయి. సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, మెళియాపుట్టి, పాతపట్నం, మందస మండలాల్లో చేపట్టిన వెలుగు పథకాలు నిలిచిపోయాయి. ఏజెన్సీలో అమలవుతున్న పథకాల పరిశీలనకు ఉన్నతాధికారులు, ప్రముఖులు వచ్చినపుడు మాత్రమే హడావుడిగా మసిపూసి మారెడు కాయ చేసి చూపిస్తున్నారు.
మార్కెటింగ్ పథకాల పరిస్థితి దారుణం
గిరిజనుల ద్వారా మార్కెటింగ్ కేంద్రాలను నడిపి వారికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఐదు చోట్ల పసుపు, చింతపండు, జీడి ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ట్రైకార్ పథకం ద్వారా రూ.8.80 లక్షలు వెచ్చించారు. అయితే ‘వెలుగు’ నుంచి సైరె న ప్రోత్సాహం లేకపోవడంతో గిరిజన మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం లేక ప్రాసెసింగ్ యూనిట్లు మూత పడ్డాయి. ప్రస్తుతం ఒక్క యూనిట్ కూడా పనిచేయని పరిస్థితి ఉంది. రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన కందిపప్పు యూనిట్, ధాన్యం కొనుగోలు కేంద్రాలదీ అదే దుస్థితి.
దిష్టిబొమ్మలా కోల్డ్ స్టోరేజి
గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులు చెడిపోకుండా ధర వచ్చే వరకు నిల్వ ఉంచేందుకు వీలుగా సీతంపేటలో కోటి రూపాయలు వెచ్చించి నిర్మించిన కోల్డ్ స్టోరే జి పూర్తిగా నిరుపయోగంగా మారింది. రెండేళ్లుగా ఒక్క అటవీ ఉత్పత్తిని కూడా గిరిజనులు దీనిలో నిల్వ చేసిన దాఖలాలు లేవు. దీన్ని కూడా ‘వెలుగు’ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. అటవీ ఉత్పత్తులను తక్కువ ధరకు వ్యాపారులకు అమ్మేయకుండా.. తగిన ధర వచ్చే వరకు ఈ కోల్డ్స్టోరేజీలో వాటిని నిల్వ చేసుకోవచ్చని గిరిజనులకు అవగాహన కల్పించడంలోనూ అధికారులు విఫలం కావడంతో కోల్డ్ స్టోరేజి ఏర్పాటు లక్ష్యం నెరవేరకుండాపోయింది.
బాలబడులదీ అదే దుస్థితి
ఐదేళ్లలోపు చిన్నారులకు ఆటపాటల ద్వారా విద్యనందించాలనే ఉద్దేశంతో ఐటీడీఏ పరిధిలో ‘వెలుగు’ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసిన బాల బడులు నిర్వహణ కూడా సక్రమంగా సాగడంలేదు. గతంలో ఆటబొమ్మల సరఫరా పేరుతో భారీగా నిధులు దుర్వినియోగం చేశారు. కొత్తూ రు, భామిని, సీతంపేట మండలాల్లో ఏర్పాటు చేసిన 110 బాలబడుల్లో దాదాపు సగం అంతంతమాత్రంగా పని చేస్తున్నాయి. ఈ అంశాలను ఐకేపీ ఏపీడీ సావిత్రి వద్ద ప్రస్తావించగా సీజన్ ఆరంభమైతే యూనిట్లు ప్రారంభిస్తామన్నారు. కోల్డ్ స్టోరేజీని జీసీసీకి అప్పగించామన్నారు.