నా బాధలు ‘గ్రీవెన్స్‌డే’లో చెప్పుకోమంటారా?
సాక్షి, హైదరాబాద్: నేను మంత్రినన్న విషయాన్ని పక్కనబెడితే కనీసం ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేనన్న విషయాన్ని కూడా మర్చిపోతే ఎలా? అని రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి పసుపులేటి బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో సోమవారం జరిగిన గిరిజన ఉప ప్రణాళిక (టీఎస్పీ) నోడల్ ఏజెన్సీ సబ్‌ప్లాన్ సమావేశంలో భాగంగా మంత్రి బాలరాజు అధికారుల వ్యవహారశైలిని ప్రశ్నిస్తూనే.. ముఖ్యమంత్రితో నెలకొన్న వివాదం విషయంలో పరోక్షంగా రుసరుసలాడారు. ‘‘గత మే నెలలో నేను, బీసీ మంత్రి కలసి విశాఖ జిల్లా కొయ్యూరు మండలం కొమ్మిక గ్రామానికి వచ్చాం. మా కార్యక్రమంలో ఎవరూ పాల్గొనకుండా లబ్ధిదారులందరినీ చేరదీసి సెర్ప్ అధికారులు వేరే గ్రామంలో సమావేశం పెట్టారు. దీనిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు దిక్కులేదు. నా బాధలు గ్రీవెన్స్‌డేలో చెప్పుకొమ్మంటారా’’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.