ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి
ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
హన్మకొండ అర్బన్ : లంబాడీలను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలని ఆది వాసీ సంక్షేమ పరిషత్ జాతీయ అ«ధ్యక్షుడు దాట్ల నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో బాలసముంద్రంలోని ఏకశిలాపార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లంబాడీలను రాజకీయ లబ్ధికోసమే ఎస్టీ జాబితాలో చేర్చాయని అన్నారు. దీంతో ఆది వాసీలకు కోలుకోలేని అన్యాయం జరగుతోందన్నారు. ఆదివాసీల కోసం ప్రభుత్వాలు చట్టాలు తీసుకువచ్చినప్పటికీ సరిగా అమలు చేయడంలేదని అన్నారు. ఆదివాసీలను అడవి, భూమి, నీటి నుంచి దూరం చేసే కుట్ర జరగుతోందని, దీన్ని గుర్తించి మేధావులు, యువత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాయకులు ఈసం ధర్మయ్య, మల్లెల కృష్ణ, ఈక నాగేశ్వర్రావు, రామకృష్ణ, ఈసం పాపయ్య పాల్గొన్నారు.