Tribal welfare residential school
-
Photo Feature: అక్కడే తరగతి.. వసతి
ఆదిలాబాద్ జిల్లా బేలలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆరు నుంచి పది తరగతులకు 12 గదులు మాత్రమే ఉన్నాయి. అందులో ఆరు గదులను తరగతి గదులకు, రెండు గదులను విద్యార్థుల వసతికి కేటాయించారు. మిగతా నాలుగు గదులను ఆఫీస్, స్టోర్, ల్యాబ్, వంటకు ఉపయోగిస్తున్నారు. అయితే 267 మంది విద్యార్థులు పడుకునేందుకు రెండు గదులు సరిపోకపోవడంతో, తరగతి గదులనే వసతికీ వాడుతున్నారు. వాటిలోనే విద్యార్థులు రాత్రిపూట పడుకుంటున్నారు. ఉదయం ఆ గదుల్లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులెవరైనా అనారోగ్యానికి గురైతే.. ఇదిగో ఇలా పాఠాలు బోధిస్తున్న గదిలోనే విశ్రాంతి తీసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, అదనపు తరగతి గదులను నిర్మించి, తమ అవస్థలు తొలగించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. (క్లిక్: ఓయూలో ఐడియాలకు ఆహ్వానం) – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
నాకు నువ్వు.. నీకు నేను
విద్యార్థుల క్షవరాల నిధులు గోల్మాల్ పాడేరు: మన్యంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ కంటింగ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు వార్డెన్స్ కైంకర్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు నాకు నువ్వు.. నీకు నేను అన్న చందంగా ఒకరినొకరు హెయిర్ కంటింగ్ చేసుకుంటున్నారు. మన్యంలోని 11 మండలాల్లో 66 గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలు, 11 బాలుర వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 22 వేలు మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరి ఒక్కొక్కరికి నెలకు హెయిర్ కంటింగ్ కోసం ప్రభుత్వం రూ. 12లు అందిస్తోంది. ఏడాదిలో రెండు, మూడు పర్యాయలు నిధులు విడుదల చేస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా. ఈ నిధులతో ఏ ఒక్క ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు కంటింగ్ చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. విద్యార్థులే సొంత డబ్బులతో హెయిర్ కంటింగ్ చేసుకుంటున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. సెలవులకు ఇళ్లకు వె ళ్లినప్పుడు ఇంటి వద్ద కంటింగ్ చేసుకుని వస్తున్నామని మరికొందరు విద్యార్థులు చెబుతున్నారు. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులే ఒకరినొక రు హెయిర్ కంటింగ్ చేసుకుంటూ కనిపించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు హెయిర్ కంటింగ్ ఛార్జీలు అమలు చేస్తున్నారు. గిరిజన ఆశ్రమాలు వద్దకు వచ్చే సరికి ఈ నిధులు వార్డెన్లు జేబుల్లో వేసుకుంటున్నారనేది తేటతెల్లం అవుతోంది. -
నాణ్యమైన సరకులు సరఫరా చేయాలి
పాడేరు, న్యూస్‌లైన్: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు నాణ్యమైన నిత్యావసర సరకులు సరఫరా చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ జీసీసీ అధికారులు, వ్యాపారులను ఆదేశించారు. హాస్టళ్లలో వంట నూనెలు, పప్పులు, కోడి గుడ్లు, కాస్మోటిక్స్, ఇతర నిత్యావసర సరకుల సరఫరాకు సంబంధించి ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం టెండర్ల కార్యక్రమం నిర్వహించారు. బకాయిలు పేరుకుపోవడంతో కొంతమంది వ్యాపారులు టెండర్లకు దూరంగా ఉన్నప్పటికీ తుని, అనకాపల్లి, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన కొత్త వ్యాపారులు ఈ టెండర్లో పాల్గొన్నారు. 439 క్వింటాళ్ల కందిపప్పు, 306 క్వింటాళ్ల శనగపప్పు, 185 క్వింటాళ్ల పెసరపప్పు, 534 క్వింటాళ్ల బఠాణి, 188 క్వింటాళ్ల పంచదార, 59,480 లీటర్ల వంటనూనె తదితర నిత్యావసర సరకుల సరఫరాకు టెండర్లు నిర్వహించారు. మొత్తం 29 రకాల నిత్యావసర సరకులకు సంబంధించి వ్యాపారులు కోడ్ చేసిన ధరల వివరాలను, సరుకుల శాంపిల్స్ నాణ్యతను పరిశీలించారు. కందిపప్పు కిలో రూ.57, మినపపప్పు రూ.54, శనగపప్పు రూ.45, పెసరపప్పు రూ.77, బఠాణి రూ.37, పామాయిల్ రూ.65.50 ధరతో టెండర్లు ఖ రారు చేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ టెండర్లో చూపించిన శాంపిల్స్ ప్రకారమే నాణ్యమైన నిత్యావసర సరకులను సకాలంలో సరఫరా చేయాలని ఆదేశించారు. సరుకుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరఫరా చేసిన సరకులకు బిల్లుల చెల్లింపుల విషయంలో ఎలాంటి జాప్యం ఉండదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు బి.మల్లికార్జునరెడ్డి, జీసీసీ డివిజనల్ మేనేజర్ ప్రతాప్‌రెడ్డి, బ్రాంచి మేనేజర్లు పాల్గొన్నారు. -
టీచర్ల పోకడపై మావోయిస్టుల ఆరా
కొయ్యూరు, న్యూస్‌లైన్: విధులకు డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయుల వివరాలు మావోయిస్టులు సేకరిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని బడులకు ఉపాధ్యాయులు ఏ వేళకు ఎందరు వస్తున్నదీ ఆరా తీస్తున్నారు. నాలుగు రోజుల కిందట యు.చీడిపాలెం పంచాయతీ పలకజీడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వద్దకు దళసభ్యులు వచ్చారు. అక్కడివారితో కొద్దిసేపు మాట్లాడారు. గోడలపై కరపత్రాలు అంటించారు. అనంతరం పాఠశాలలో ఎందరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నదీ, ఎందరు వేళకు వస్తున్నదీ, రోజుల తరబడి ఎవరు విధులకు డుమ్మాకొడుతున్నది తదితర విషయాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఇద్ద రు పూర్తిగా రావడం లేదని గ్రామస్తులు వివరించినట్టు తెలిసింది. పలకజీడి మారుమూల ప్రాంతం కావడంతో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. కాగా గ్రామానికి చెందిన అటవీ ఉద్యోగి ఒకరిని తమతో పాటు కొంత దూరం తీసుకెళ్లిన మావోయిస్టులు ఉద్యోగం మానేయాలని హెచ్చరించినట్టు తెలిసింది.