ఫ్రిజ్, టీవీల కోసం ఎర్ర స్మగ్లింగ్
శేషాచలంలో చొరబడ్డ వారంతా తమిళ యువకులే
- అరెస్టయిన వారిలో అధిక శాతం వీరే
- బైక్‌లు, రిఫ్రిజిరేటర్లు, కలర్ టీవీలపై మక్కువ
- జైళ్లలో మగ్గుతున్న జువ్వాదీహిల్స్ ‘ఉడ్ కట్టర్స్’ కుటుంబాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తమిళనాడుకి చెందిన యువత ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఆసక్తి చూపుతోంది. ధర్మపురి, తిరువణ్ణామలై, కాట్పాడి, వేలూరు జిల్లాలకు చెందిన వంద లాది మంది గిరిజన యువకులు శేషాచలం వైపు అడుగులు వేస్తున్నారు. గ్రామాల్లో తిరిగే దళారులు వ్యూహాత్మకంగా వేసే ఉచ్చులో పడుతున్న యువకులు బైక్‌లు, కలర్ టీవీలు, రిఫ్రిజిరేటర్లపై మోజుతో రెడ్ శాండల్ స్మగ్లిం గ్‌కు సిద్ధమవుతున్నారు. అనతికాలంలోనే లక్షలు సంపాదించాలన్న ఆశతో అడవుల్లో చొరబడి బయటకు రాలేక పోలీసులకు చిక్కి చివరికి జైళ్లల్లో మగ్గుతున్నారు.
చిత్తూరు, కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలంలో సరిహద్దుల్లో ఉన్న ఎర్ర చందనం చెట్లన్నీ నరికివేతకు గురయ్యాయి. ప్రస్తుతం అడవి మధ్య ప్రాంతాల్లోనే చెట్లు న్నాయి. వీటిని నరికి, శుద్ధి చేసిన దుంగలను భుజాన వేసుకుని దూరాన ఉండే వాహనాల దగ్గరకు చేర్చాలంటే బరువు మోసే సత్తా ఉన్న యువకులు అవసరం. చెట్టు కోయాలన్నా, కొమ్మలు నరకాలన్నా, స్వల్ప వ్యవధిలోనే దుంగలను తరలించాలన్నా యువకులకే సాధ్యం. రాళ్లతో కూడిన కాలిబాటలో నడవడం, నాలుగైదు రోజులు తిండీ నిద్రా లేకుండా పనిలో నిమగ్నం కావడం యువకులకే సాధ్యమవుతుంది.
దీన్ని గుర్తించిన ఎర్ర చందనం స్మగ్లర్లు ధర్మపురి, తిరువణ్ణామలై, జువ్వాదిమలై ప్రాంతాలకు వెళ్లి యువకులకు ఎర వేస్తున్నారు. కిలోకి గరిష్టంగా రూ.500 చొప్పున కూలీ చెల్లిస్తామంటూ యువకులకు ఆశ చూపుతున్నారు. ఉదాహరణకు ఒక ఎర్ర చందనం దుంగ బరువు 25 నుంచి 28 కిలోల బరువు ఉంటుంది. ఒక్కొక్కరూ రెండేసి చెట్లు నరికి వాటిని స్మగ్లింగ్ చేస్తే పాతిక వేల దాకా కూలీ దక్కుతుంది. ఈ లెక్కన ఒక్కొక్కరూ నాలుగు చొప్పున రెండు వారాలకు రూ.50 వేల దాకా సంపాదిస్తున్నారు.
కలలు చెదిరి కటకటాల్లోకి...
ఈ మధ్య కాలంలో తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు సుమారు 160 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో 100 మందికి పైగా యువకులే ఉన్నారు. అదేవిధంగా ఫారెస్ట్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు చిక్కిన వారిలోనూ యువకులే ఎక్కువ ఉన్నారు. తిరుపతి, చిత్తూ రు, నగరి, సత్యవేడు, మదనపల్లి జైళ్లల్లో వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది. విషయాన్ని గుర్తించిన టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు రెండుసార్లు జువ్వాదిమలై వెళ్లి ఆయా కుటుం బాలతో మాట్లాడారు. రెడ్ శాండల్ స్మగ్లింగ్ నేరమనీ, యువకుల భవిష్యత్తును భద్రంగా చూసుకోమని చెప్పినా ప్రయోజనం కనిపించడం లేదు.
బైక్‌లు, కలర్ టీవీలపై ఆసక్తి...
తిరువణ్ణామలై జిల్లా జువ్వాది హిల్స్‌లో ఉడ్ కట్టర్స్ కుటుంబాలు ఎక్కువ. ఇక్కడున్న ఎక్కువ మంది వీరప్పన్ అనుచరులుగానూ, సహాయకులుగానూ పనిచేశారు. చెట్లు నరకడం తప్ప వీరికి మరే పనీ రాదు. ప్రస్తుతం ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉండి పిల్లలను సరిగ్గా చదివించే స్థోమత లేని వారెందరో ఉన్నారు. అలాంటి కుటుంబాల్లోని యువకులకు బడాబడా స్మగ్లర్లు ఎక్కువ మొత్తంలో కూలీ ఆశ చూపి వీరిని అడవుల్లోకి పంపుతున్నారు.