గిరిజన యువతకు శిక్షణ ఎన్నడో?
* రూ.మూడు కోట్లతో సామర్లకోటలో భవనాలు
* నిర్మాణం పూర్తయినా ప్రారంభం కాని వైనం
సామర్లకోట : రంపచోడవరం ప్రాంతానికి చెందిన గిరిజన యువతీ, యువకులకు సామర్లకోటలో ఇవ్వ తలపెట్టిన శిక్షణ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. సామర్లకోటలోని విస్తరణ శిక్షణా కేంద్రంలో సుమారు రూ. 3 కోట్లతో గిరిజన యువత శిక్షణా కేంద్రం నిర్మించారు. ఈ భవనాల నిర్మాణం పూర్తరుునా ప్రారంభానికి నోచుకోలేదు. కాగా భవనాల నిర్మాణంపై గతంలోనే కొన్ని వివాదాలు ఉన్నాయి. అప్పటి జిల్లా కలెక్టర్ రవిచంద్ర ఆదేశాల మేరకు సుమారు మూడు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని భవనాలు నిర్మించారు.
భూముల కేటాయింపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ, కమిషనర్ అనుమతి పొందవలసి ఉంది. అరుుతే అనుమతి లేకపోవడంతో భవనాలను విస్తరణ శిక్షణా కేంద్రం పరిధిలో ఉండేలా చూడాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీనిపై విస్తరణ శిక్షణా కేంద్రం అధికారులను వివరణ కోరగా గతంలో జరిగిన విషయాలపై తమకు అవగాహన లేదని చెప్పారు.
కాగా రంపచోడవరం నుంచి యువతీ, యువకులు సామర్లకోట వచ్చి ఎలా శిక్షణ పొందుతారన్న సందేహమూ ఉంది. ఐటీడీఏకి నిధులు ఉన్నా అప్పట్లో స్థల సమస్య కారణంగా సామర్లకోటలో ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణా కేంద్రం భవనాలు పూర్తయినప్పటికీ శిక్షణకు అవసరమైన ఫర్నీచర్, ఇతర సదుపాయూలు ఏర్పాటు చేయలేదు. ఈ శిక్షణా కేంద్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిసింది. భవనాలు ప్రారంభమైన వెంటనే శిక్షణను కూడా ప్రారంభించవలసి ఉన్నా.. అదెప్పుడో అధికారులే చెప్పాలి.
త్వరలో భవనాలు ప్రారంభిస్తాం
సామర్లకోట విస్తరణ శిక్షణా కేంద్రంలో నిర్మించిన గిరిజన యువత శిక్షణా కేంద్రం త్వరలో ప్రారంభం అవుతుంది. యువతకు అవసరమైన అన్ని రకాల శిక్షణలూ ఈ కేంద్రంలో ఇస్తారు. శిక్షణ సమయంలో భోజన వసతి సౌకర్యాలు ఉంటాయి. శిక్షణ ప్రారంభానికి సంబంధించి పూర్తి వివరాలు రావలసి ఉంది.
- కేవీఎన్ చక్రధరబాబు, ఐటీడీఏ పీఓ, రంపచోడవరం