ఇల్లు.. ఆఫీసు.. కారు.. అన్నీ ఇదే!
పెద్ద పెద్ద అంతస్థుల్లో ఉండేవారికి, అస్తమానం పైకీ కిందికీ దిగలేనివారికీ, పార్కింగ్ ప్లేస్ లేనివారికి, ఆఫీస్ పని అక్కడికక్కడే అయిపోతే బాగుండనుకునే వారికీ, డ్రైవింగ్ చేసే ఓపిక లేనివారికి... అంతెందుకు? ఇల్లు, ఆఫీసు, లిఫ్టు, కారు, లివింగ్ రూమ్... అన్నీ ఆల్ ఇన్ వన్ గా ఉంటే బాగుండు అని గొంతెమ్మ కోరికలు ఉన్నవారికి ఒక వరంగా ‘త్రిదిక’అనే ఒక వాహనం టెక్నాలజీ నిపుణుల ఆలోచనల్లో రూపుదిద్దుకుంటోంది.
ఇంట్లో ఉండాల్సినవి ఇంట్లో... బయట ఉండాల్సినవి బయట ఉండటం ఓ పద్ధతి. కానీ ఇది 21వ శతాబ్దం. హైటెక్ యుగం. ఫొటో చూశారుగా... అదీ విషయం. ఈ సూపర్ బిల్డింగ్‌కు అతుక్కున్నట్టుగా కొన్ని నిర్మాణాలు కనిపిస్తున్నాయా? అవి ఏమనుకుంటున్నారు? ఊహకు అందడం లేదా..? ఓకే. అవన్నీ కార్ల వంటి వాహనాలు! కార్లు గోడలెక్కడమేమిటి? హౌ... హౌ ఇటీజ్ పాజిబుల్ అంటున్నారా? ఈ మధ్య ఓ సరికొత్త లిఫ్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది లెండి. అది పైకి, కిందకు మాత్రమే కాదు.. లెఫ్ట్, రైట్లకు కూడా కదలగలదు.
అచ్చంగా ఈ టెక్నాలజీ స్ఫూర్తితోనే తాను గోడలెక్కగల ‘త్రిదిక’ వాహనాల రూపకల్పనకు ఆలోచన చేశానని అంటున్నాడు చార్లెస్ బంబార్డియర్ అనే యువ శాస్త్రవేత్త. వావ్.. అనేశారా...? సరే... ఈ వాహనాలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇది పగలు మిమ్మల్ని కావాల్సిన చోటుకు తిప్పేందుకు పనికొస్తే... రాత్రిళ్లు మీ ఇంట్లో అదనపు లివింగ్ రూమ్‌గా దీన్ని వాడుకోవచ్చు. ఇంకో విషయం త్రిదికలు నడిపేందుకు డ్రైవర్లు అవసరం లేదు. ప్రత్యేకమైన ట్రాక్‌పై అయస్కాంతాల సాయంతో వెళ్లగల ఈ ఎలక్ట్రిక్ వాహనంలో ఆరుగురు కూర్చోవచ్చు. డ్రైవింగ్ పనిలేదు కాబట్టి వాహనంలో కూర్చుని ఆఫీసు పనులూ చక్కబెట్టుకోవచ్చునన్నమాట. పనైపోయాక ఇంటికొచ్చారనుకోండి. మీ ఇల్లు పదో అంతస్తులో ఉన్నా సరే.. గుమ్మం దాకా దిగబెడుతుంది. అక్కడే ఉండిపోతుంది కూడా! ఆలోచన బాగానే ఉందిగానీ.. ఇలాంటివి నిజంగానే వస్తాయా? అంటే... ఏమో... గుర్రం ఎగరావచ్చు అనక తప్పదు!