బాక్సర్ అవతారమెత్తిన ప్రధాని!
న్యూయార్క్: కొందరు రాజకీయ నాయకులకు మరికొన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంటుంది. అయితే ఓ దేశ ప్రధాని మాత్రం బాక్సింగ్ రింగ్ లోకి దిగి ప్రత్యర్థులపైకి పంచ్ లు విసరటం మొదలెట్టారు. అలాగని ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారని భావిస్తే తప్పులో కాలువేసినట్టే. ఆటవిడుపు కోసం ప్రధాని బాక్సింగ్ బరిలోకి దిగారు. ఆ ప్రధాని మరెవరో కాదు కెనడా పీఎం జస్టిన్ ట్రూడ్. గురువారం నాడు బాక్సింగ్ రింగ్ లో అడుగుపెట్టి తన పంచ్ పవర్ రుచిచూపిస్తున్నారు. న్యూయార్క్ పర్యటన నేపథ్యంలో ట్రూడ్ బాక్సర్ అవతారమెత్తారు. న్యూయార్క్ లోని గ్లియాన్సన్ జిమ్ లో ఆయన ప్రతక్షమైనప్పటి ఫొటోలు, వీడియో ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.
రాజకీయ రంగం నుంచి బాక్సింగ్ రింగ్ లోకి ఎంట్రీ ఇచ్చాడా ఏంటని కొందరు ఆశ్చర్యపోగా, బాక్సర్ అవతారంలో పీఎం బాగున్నాడంటూ మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. జిమ్ లో ఉన్న బాక్సింగ్ రింగ్ లో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. రెడ్ స్లివ్ లెస్ ధరించిన ఆయన ఎడమచేతి భుజంపై ఓ టాటుతో కనిపించారు. అక్కడి వారికి ప్రధాని బాక్సింగ్ పాఠాలు బోధించారు. గత ఎన్నికల్లో ఆయన ప్రచార కార్యక్రమం సమయంలో ప్రొఫెషనల్ బాక్సర్, హెవీవెయిట్ మాజీ చాంపియన్ యురీ ఫోర్ మెన్ తో కలిసి ప్రాక్టిస్ చేస్తూ చాలా సమయాన్ని వృథా చేశారని ఆరోపణలున్నాయి. బాక్సింగ్ లో అనుభవంతో పాటు హై స్కూల్లో బోధించిన ఎక్స్ పీరియన్స్ కూడా ట్రూడ్ సొంతం.