స్టార్ హోటళ్లలో చిలక్కొట్టుడు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆ వస్తువులు అందంగా ఉండటం కావచ్చు. లేక తీపి గుర్తుగా దాచుకోవాలన్న మమకారం కావచ్చు. ఇవేవీ కాకుంటే ఫ్రీగా వస్తోంది కదా బ్యాగులో వేసేస్తే పోలా... అనుకునే తత్వమైనా కావచ్చు. ఉన్నత స్థాయి వ్యక్తులు సైతం ఫైవ్‌స్టార్ హోటళ్లలోకి వెళ్లేసరికి చేతులకు పని చెప్పకుండా ఉండలేకపోతున్నారట. ఫైవ్ స్టార్ హోటళ్లలో దిగుతున్న వారిలో మూడొంతుల మంది ఆ హోటల్ గదిలోని ఏదో ఒక వస్తువును తెలియకుండా తీసుకెళుతున్నట్లు ఆన్లైన్ ట్రావెల్ అడ్వయిజరీ సంస్థ ‘ట్రిప్ అడ్వైజర్’ వెల్లడించింది. ఈ సంస్థ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో... ప్రతి ఐదుగురిలో ముగ్గురు షాంపూ, సబ్బులు వంటి సౌందర్య సాధనాల దగ్గర నుంచి రిమోట్లోని బ్యాటరీల వరకు ఏదో ఒక వస్తువును తీసుకెళ్లిపోతున్నారనేది బయటపడింది
అంతర్జాతీయ ప్రయాణికుల్లో 65 శాతం మంది ఈ విధంగా చేస్తుంటే దేశీయ ప్రయాణికుల్లో ఇది కొంత తక్కువగా... 58 శాతంగా ఉంది. కొంతమందైతే టీ బ్యాగులు, లైట్లు, హ్యాంగర్లు వంటివి కూడా తీసుకెళ్తున్నారట. అంతర్జాతీయ ప్రయాణికుల్లో సగటున 7 శాతం మంది ఈ రకంగా టవల్స్‌ను తీసుకెళుతున్నట్లు అంగీకరించారు. కాకపోతే ఇలా టవల్స్ పోతున్నా ఫిర్యాదు చేయడానికి హోటళ్ల యాజమాన్యాలు మాత్రం ముందుకు రావటం లేదు.
అతిథులు ఖాళీ చేసిన తర్వాత గదికి వెళ్లి చూస్తే టవల్స్ ఉండటం లేదని ప్రతి నాలుగు హోటల్స్‌లో ఒక్కటి మాత్రమే ఫిర్యాదు చేస్తోంది. మినీ బార్లో ఉండే కాంప్లిమెంటరీ బాటిల్స్ కూడా ఎంచక్కా తీసుకెళ్ళిపోతున్నారట. ఇక హోటల్స్ అందించే ఉచిత సేవల విషయానికి వస్తే అత్యధిక శాతం మంది ఉచిత పార్కింగ్, వైఫై ఇంటర్నెట్ కనెక్టివిటీ, బ్రేక్‌ఫాస్ట్ కోరుకుంటున్నారు. దీనిపై కొందరిని ప్రశ్నించినపుడు... ‘‘హోటల్ బిల్లులో ఆ షాంపూలు, సబ్బులు కలిసే ఉంటాయి కదండీ! మరి వాటిని తీసుకెళితే తప్పేంటి?’’ అనే సమాధానం కూడా రావటం గమనార్హం.
విమానాల్లో చదువే ఫస్ట్...
విమాన ప్రయాణికుల్లో అత్యధికులు ప్రయాణిస్తున్న సమయంలో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేయడానికి ప్రాధాన్యమిస్తున్నారని ట్రిప్ అడ్వయిజర్ వెల్లడించింది. మిగిలిన వాళ్లు సినిమాలు చూడటం లేదా నిద్రపోవడం చేస్తున్నట్లు తెలియజేసింది. అలాగే 54 శాతం మంది పురుషులు సీట్ బెల్ట్ సిగ్నల్ ఆగిపోగానే సీట్లలోంచి లేచి నిల్చుంటున్నారని, 47 శాతం మంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమన్నా చేయడం లేదని, 39 శాతం మంది వెనక సీట్లో ఉన్న వాళ్ళతో సంబంధం లేకుండా దురుసుగా వారి సీట్లను వెనక్కి నెడుతున్నారని పేర్కొంది.