తెలుగింటి శోభితం
తెనాలిలో పుట్టిన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ. పెద్దయ్యాక ఇంజినీరో, ఐఏఎస్ అవుతానని చెప్పిన ఆమె.. ముంబై వెళ్లి ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తన అందచందాలకు ఆత్మవిశ్వాసం కలగలిపి మిస్ ఇండియా ఎర్త్ కి రీటాన్ని గెలుచుకుంది. జూబ్లీహిల్స్‌లోని త్రిష షోరూమ్‌లో ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్ లాంచ్‌కి వచ్చిన ఈ బ్యూటీతో సిటీప్లస్ చిట్‌చాట్.
..:: శిరీష చల్లపల్లి
హాయ్ హలో నమస్తే.. నేను అచ్చమైన తెలుగింటి అమ్మాయిని. పుట్టింది, పెరిగింది అంతా తెనాలిలోనే. చిన్నప్పటి నుంచి నాకు పట్టుదల ఎక్కువ. చిన్నప్పుడు ఎవరైనా పెద్దయ్యాక ఏమవుతావ్ అని అడిగితే.. జెనెటిక్ ఇంజినీర్ అనో ఐఏఎస్ అనో చెప్పేదాన్ని.
కలల దారిలో..
ఇంటర్ చదివే టైమ్‌లో నా మాటతీరుకు అందరూ ఇంప్రెస్ అయ్యేవారు. నీలో కాన్ఫిడెన్స్ చాలా ఉందని కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు. వీటిని సీరియస్‌గా తీసుకున్న నేను ఫ్యాషన్ ప్రపంచం వైపు అడుగులు వేశా.. అందులో భాగంగానే పై చదువుల కోసం ముంబై వెళ్లాను. అక్కడ ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు నా ఫ్యాషన్ కలలను నిజం చేసుకునే ప్రయత్నాలు చేశాను. ఆ ప్రాసెస్‌లోనే మిస్ ఇండియా ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. ఈ రోజు సక్సెస్ఫుల్ బ్యూటీ క్వీన్‌గా మీ ముందున్నాను.
ఆవకాయ.. పులిహోర..
ముంబైలో ఉన్నన్ని రోజులు అక్కడున్న ఫుడ్ తిని బోర్‌గా ఫీలయ్యాను. హైదరాబాద్‌లో మాకు చుట్టాలు ఉన్నారు. ఇక్కడికి రాగానే నాకిష్టమైన తెలుగు వంటకాలన్నీ అడిగి మరీ చేయించుకున్నాను. ఆవకాయ, పులిహోర, ముద్దపప్పు, పచ్చిపులుసు.. ఇలా చవులూరించే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇష్టమే. మన ప్రాంతంలో పెళ్లి భోజనం చాలా స్పెషల్‌గా ఉంటుంది. దాన్ని కూడా మిస్సవ్వను.
రంగవల్లులు.. పతంగులు..
నాలుగేళ్ల తర్వాత సంక్రాంతికి మా ఫ్యామిలీ దగ్గర ఉంటున్నా. చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది. ఇంటి ముందు రంగవల్లులు వేయడం, ఇంటి పైన పతంగులు ఎగుర వేయడం భలే సరదాగా ఉంటుంది. ఆ రోజు పట్టు పరికిణీ వేసుకుంటాను. చెవులకు జుంకాలు, చేతులకు గాజులు.. కాళ్లకు పట్టీలు.. అచ్చంగా పదహారణాల తెలుగు పడుచులా ముస్తాబవుతాను. అమ్మ చేసే పిండి వంటలు, మా ఊరి వాతావరణం పండుగ కిక్‌ను మరింత పెంచుతాయి.