గెలిచినోళ్లకే కండువా, ఓడినోళ్లకు కాదు...!
అధికార పార్టీ గెలిచినోళ్లకే కండువా వేస్తుంది కాని ఓడినోళ్లకు కాదని ఒక నేతకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చిందట. హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో తెగ హడావుడి చేసే ఈ నేత పార్టీని ఫిరాయించడం దాదాపు ఖరారైనట్లేనని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా జరగడం... సొంతపార్టీలోనే సదరు నేత కొనసాగాల్సి రావడంతో... అసలు కారణం ఏమై ఉంటుందా? అని ఆరా తీశారట అనుచరులు. అధికారపార్టీలోకి చేరేందుకు ఈ నేత రాజ్యసభ సీటు కావాలని లేదా హెచ్ఎండీఏ చైర్మన్గా నియమించాలని, హైదరాబాద్ మేయర్ పదవి లేదా ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని కండిషన్లు పెట్టారట.
ఈ చిట్టానంతా విన్న అధికారపార్టీ నేతలు నీకంత సీన్ లేదు, బేషరతుగా వస్తే రా లేకపోతే లేదు అని మొహమాటం లేకుండా చెప్పారట. పార్టీలో చేరిక కార్యక్రమానికి అగ్రనేత రారని, ఎవరైనా మంత్రి సమక్షంలోనే చేరాలని కూడా తమ వంతు కండిషన్లు చెప్పేశారట. అంతేకాకుండా నగరంలోని ఒకటి లేదా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిమితం కావాల్సి ఉంటుందంటూ తేల్చేశారట. దీనితో ఆ పార్టీలో చేరి అనామకుడిగా ఎందుకు మిగిలిపోవాలంటూ ఉన్నపార్టీలోనే కొనసాగాలని ఈ నేత డిసైడ్ అయ్యారట. అయితే సదరునేత ఉన్నపార్టీలోనే ఉంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో శల్యసారధ్యం చేసి, గెలిచిన కొందరు కార్పొరేటర్లను తీసుకుని అధికారపార్టీలో ఎక్కడ చేరతాడోనన్న అనుమానం పార్టీనేతలను పెనుభూతంగా భయపెడుతోందట. ఈ నేతను వదిలించుకునేందుకు ఏమి చేయాలా అని కంటి మీద కునుకులేకుండా సొంతపార్టీనేతలు ఆలోచిస్తున్నారట...