సానుభూతి X అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి షెడ్యూల్ రావడంతో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ ఉప ఎన్నికపై మెదక్ జిల్లా నేతలతో మాట్లాడారు. ఇక టీఆర్ఎస్ అభివృద్ధి మంత్రం జపిస్తూ ఎన్నికకు సమాయత్తమవుతోంది.
సానుభూతిపైనే కాంగ్రెస్ ఆశలు
కాంగ్రెస్‌కు నారాయణఖేడ్ నియోజకవర్గంలో బలమైన పునాది ఉంది. ఇక్కడ ఇప్పటిదాకా కేవలం ఒక్కసారే(1994లో) కాంగ్రెస్ ఓడిపోయింది. మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీ వరుస విజయాలు సాధించింది. వీటికితోడు నియోజకవర్గంలో పార్టీ నేతలు పి.కిష్టారెడ్డి, సురేశ్ షెట్కార్ కుటుంబాలకు బలమైన అనుచర వర్గం ఉంది. ఈ రెండు కుటుంబాలు ఐక్యంగా ఉంటే కాంగ్రెస్‌ను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని ఆ పార్టీ నేతల విశ్వాసం. ఈ కుటుంబాల నుంచి ఒకరు లోక్‌సభకు, మరొకరు శాసనసభకు పోటీలో ఉంటూ పరస్పరం సహకరించుకుంటున్నారు.
2014 ఎన్నికల్లోనూ సురేష్ షెట్కార్ జహీరాబాద్ నుంచి లోక్‌సభకు పోటీచేయగా, పి.కిష్టారెడ్డి అసెంబ్లీకి పోటీచేశారు. నారాయణఖేడ్ నుంచి పోటీ చేసిన కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందగా, షెట్కార్ ఓడిపోయారు. కిష్టారెడ్డి అకాల మృతితో వస్తున్న ఉప ఎన్నికలో పోటీ చేయాలని షెట్కార్ అభిలషించారు. అయితే కిష్టారెడ్డిపై ఉన్న సానుభూతితో ఆయన కుమారుడు సంజీవరెడ్డిని పోటీలోకి దించాలని టీపీసీసీ నిర్ణయించింది.
షెట్కార్తో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతి పక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, మెదక్ జిల్లా ముఖ్య నేతలు దామోదర రాజనర్సింహ, జె.గీతారెడ్డి, వి.సునీతా లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డి సమావేశమై ఉప ఎన్నికల్లో సహకరించాలని కోరారు. కిష్టారెడ్డి కుటుంబ సభ్యుల తరఫున పనిచేయాలని, రానున్న సాధారణ ఎన్నికల్లో తగిన ప్రాధాన్యం ఉంటుందని నచ్చజెప్పారు.
టీఆర్ఎస్ అభివృద్ధి జపం..
సాధారణ ఎన్నికల నాటికి నారాయణఖేడ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలహీనంగానే ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పార్టీల నేతలను పెద్దఎత్తున చేర్చుకుంది. జిల్లాకు చెందిన మంత్రి టి.హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో నియోజకవర్గంలోని చెరువులు, రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి వాటికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.
ఉప ఎన్నికల కోణంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల్లోనూ ఈ నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇతర పార్టీల నేతలను ఆకర్షించడానికి పదవులు, కాంట్రాక్టులను ఎరగా చూపిస్తున్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను కూడా తమకు అనుకూలంగా మల్చుకోవడానికి టీఆర్ఎస్ యత్నిస్తోంది.