మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు
ప్రజలు తమకు అండగా ఉన్నంత కాలం తమను ఎవరూ ఏమీ చేయలేరని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కారు బిహార్ ఎన్నికల్లో ఓటమి చవిచూసిందని, ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికల్లో కూడా వాళ్లకు మూడో స్థానం మాత్రమే దక్కిందని చెబుతూ.. దీన్ని బట్టే కేంద్ర పాలన, టీఆర్ఎస్ పాలనలపై ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
కేసీఆర్ పాలన పట్ల ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉందో ఈ ఫలితాలతో అందరికీ తేటతెల్లం అయ్యిందని వరంగల్ ఉప ఎన్నికల విజయం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ చెప్పారు. ఇకనైనా ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే వారికి, ప్రజలకు, తమకు.. అందరికీ మంచిదని ఆయన హితవు చెప్పారు. ఇకనైనా ప్రతిపక్షాలు తమను బద్నాం చేసే కార్యక్రమాలు మానుకుంటే మేలని అన్నారు.