‘మిషన్ కాకతీయ’తో చెరువులకు పూర్వవైభవం
కందుకూరు (రంగారెడ్డి జిల్లా): 'మిషన్ కాకతీయ' పథకం ద్వారా చెరువులకు పూర్వ వైభవం తేవడానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కప్పాటి పాండురంగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న మిషన్ కాకతీయ పనులను ఆయన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడారు.
మండల పరిధిలో 38 చెరువుల్లో పూడికతీత పనులను చేపట్టడానికి ప్రభుత్వం గుర్తించగా అందులో 30 చెరువులకు అనుమతులు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం 27 చెరువుల్లో పనులు కొనసాగుతున్నాయన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం శంకుస్థాపనకు సీఎం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో ఈ ప్రాంతంలోని చెరువులు నిండుతాయని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సీఎం కేసీఆర్ను మెప్పించి నియోజకవర్గానికి అధికంగా నిధులు తీసుకురావడానికి అహర్నిశలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.