అశోక్‌బాబు వ్యాఖ్యలపై ప్రభుత్వమే సమాధానం చెప్పాలి
ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు వ్యాఖ్యాలపై టీఆర్ఎస్ శాసనసభ పక్షం నాయకుడు ఈటెల రాజేంద్ర మండిపడ్డారు.శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అశోక్‌బాబు వ్యాఖ్యలకు సీఎం కిరణ్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా నిర్వహించే సభలకు తాము వ్యతిరేకమని, అందుకే తెలంగాణ ప్రాంతంలో బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు.
రేపటి బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సిటి కళాశాల నుంచి ఇందిరాపార్క్ వరకు శాంతి ర్యాలీ చేపట్టేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరామన్నారు.అందుకు ప్రభుత్వం నిరాకరించిందని తెలిపారు. ముఖ్యమంత్రే తమ హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ ప్రాంతంలో సభలు నిర్వహిస్తు తమపై ఆరోపణలు చేయడం దారుణమని ఆయన అశోక్ బాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఏపీఎన్జీవోలు సభ నిర్వహించుకోవాలంటే సీమాంధ్రలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి నగరాలు ఉన్నాయి. అలాంటప్పుడు హైదరాబాద్‌లోనే సభ నిర్వహించడం వెనకు ఉన్న ఉద్దేశ్యం ఏమిటని ఈటెల రాజేంద్ర ఈ సందర్భంగా ఏపీఎన్జీవో సంఘాన్ని ప్రశ్నించారు.