TRS MLC candidates
-
గులాబీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన్నపరెడ్డి
సాక్షిప్రతినిధి, నల్లగొండ : శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికకు అధికార టీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ అధినాయకత్వం డాక్టర్ తేరా చిన్నపరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇదే నియోజకవర్గానికి 2015లో జరిగిన ఎన్నికల్లో తేరా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. కాగా ఆయన గత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో స్థానికసంస్థల నియోజకవర్గం ఖాళీ అయ్యింది. ఈనెల 14వ తేదీతో (మంగళవారం) నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదివారం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున మూడు స్థానాల అభ్యర్థులను ప్రకటించారు. కాగా, నల్లగొండ స్థానం నుంచి పలువురు టికెట్ ఆశించినా.. గత ఎన్నికల్లో (2015) ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తేరా చిన్నపురెడ్డికే మళ్లీ అవకాశం ఇచ్చారు. ఈసారి ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టీఆర్ఎస్ వ్యూహా త్మకంగానే వ్యవహరించింది. గత ఎన్నికల్లో గెలుపు కోసం తేరా చిన్నపరెడ్డి బాగానే ఖర్చు చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన మొన్నటి ఎంపీ ఎన్నికల సమయంలో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. కానీ, ఆయనకు ఆ టికెట్ దక్కలేదు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆయననే తిరిగి పోటీకి పెట్టాలని అధినాయకత్వం భావించిందని చెబుతున్నారు. టీఆర్ఎస్లోనే.. ‘స్థానిక’ ఓటర్లు గత ఎన్నికల సమయం నాటికి స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు అత్యధికులు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆయా ఎన్నికల్లో వారు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచారు. కానీ ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారంతా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్లో చేరారు. గత ఎన్నికల సమయం నాటికి 1,110 మంది స్థానిక ఓటర్లు ఉండగా, వీరిలో మెజారిటీ ఓటర్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన వారే. ఈ కారణంగానే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలిచారన్నది సాధారణ అభిప్రాయం. కాగా, ప్రస్తుతం వీరిలో కొన్ని ఓట్లు తగ్గినా.. అత్యధికులు టీఆర్ఎస్లోనే ఉండడంతో ఈసారి తమ అభ్యర్థి ఎమ్మెల్సీగా విజయం సాధించడం ఖాయమన్న విశ్వాసం గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్థానిక ఓటర్ల బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేకే అప్పజెప్పారని అంటున్నారు. ఈ నెల 31వ తేదీన నల్లగొండ స్థానిక ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇంకా ఖరారుకాని.. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులు గడువు మిగిలి ఉండగా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. 2015 నాటి ఎన్నికల్లో ఈ స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్ తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలేవీ చేస్తున్నట్లు కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ పార్టీ గుర్తుపై గెలిచిన స్థానిక సంస్థల అభ్యర్థులంతా ఇప్పుడు టీఆర్ఎస్కు మారిపోవడంతో ఆ పార్టీకి ఉన్న ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కాగా, నల్లగొండ స్థానిక ఎమ్మెల్సీ పదవీకాలం మరో మూడేళ్లు మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి ముందుకు వచ్చి ఎవరు పోటీ చేస్తారో అన్న ఆసక్తి అన్ని వర్గాల్లో ఉంది. ఈ సారి అభ్యర్థిని బరిలోకి దింపుతుందా..? లేక పోటీకి దూరంగా ఉంటుందా అన్న అంశం తేలాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, పార్టీ వర్గాల్లో మాత్రం.. భువనగిరి యాదాద్రి జిల్లాకు చెందిన టీపీసీసీ కోశాధికారి గూడూరి నారాయణరెడ్డి, సూర్యాపేట జిల్లాకు చెందిన పటేల్ రమేష్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. నామినేషన్లకు రెండు రోజుల సమయమే ఉన్నందున కాంగ్రెస్ నాయకత్వం కూడా రేపో మాపో తమ అభ్యర్థిని ప్రకటిస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తేరా చిన్నపరెడ్డి ప్రొఫైల్.. పేరు : తేరా చిన్నపరెడ్డి తల్లిదండ్రులు : తేరా కోటమ్మ, తేరా పెద్దరాంరెడ్డి కుటుంబం : భార్య కల్పన, కుమార్తెలు వీణారెడ్డి, రవళిరెడ్డి పుట్టిన తేదీ : 10–08–1963 విద్యార్హతలు : బీఎస్సీ కెమికల్ టెక్నాలజీ, 1985లో పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రీయల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, డాక్టరేట్ ఇన్ ఫార్మాసిటికల్ టెక్నాలజీ ఫ్రం వెస్ట్బ్రోక్ యూనివర్సిటీ యూఎస్ఏ స్వస్థలం : పిన్నవూర, పెద్దవూర మండలం వృత్తి నేపథ్యం : పారిశ్రామికవేత్త పారిశ్రామిక రంగ నేపథ్యం : 1985లో పీజీ పూర్తి చేసిన తేరా చిన్నపురెడ్డి ఆ తర్వాత స్టాండర్డ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ కంపెనీలో మొదట ఉద్యోగం పొందారు. ఆ తరువాత ఢిల్లీ సీఫామ్ ల్యామ్లోకి మారారు. ఔషధ రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్‌లో సైంటిస్టుగా తొమ్మిది సంవత్సరాలు పనిచేశారు. ఆ తరువాత అమెరికా వెళ్లారు. 1993లో తేరా చిన్నపురెడ్డి కల్పనను వివాహం చేసుకున్నారు. 1994లో యూఎస్‌లోని ఫార్మా ఇండస్ట్రీస్‌లో అంతర్జాతీయ మార్కెటింగ్ విభాగంలో ఆరు సంవత్సరాల పాటు కెనడా, మెక్సికో, అమెరికా దేశాల్లో తిరుగుతూ పనిచేశారు. 1995లో నల్లగొండ జిల్లాలోని చౌట్టుప్పల్ సమీ పంలో శ్రీని ఫార్మా ఇండస్ట్రీస్ ప్రారంభించారు. రాజకీయ నేపథ్యం : 2009లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి రాజకీయ ప్రవేశం చేసి కుందూరు జానారెడ్డి చేతిలో ఓటమి చెందారు. 2014లో నల్లగొండ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా తేరా చిన్నపురెడ్డి పోటీ చేసి గుత్తా సుఖేందర్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. 2015లో నల్లగొండ జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. -
వ్యూహాత్మకంగా... ఆఖర్లో ఖరారు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో పూర్తి ఆధిపత్యంతో ఉన్న టీఆర్ఎస్... ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాల్లోనూ కచ్చితంగా గెలుపు సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీలోకి దించాలని నిర్ణయించింది. 2015లో ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరిగాయి.అప్పుడు నల్ల గొండ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ఫలితానికి ఆస్కారం ఇవ్వకూడదని టీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తోంది.ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు స్థానాలను గెలుచుకోవాలని నిర్ణయించుకుంది. ఆ అవకాశాలు ఉండే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. ప్రతిపక్ష పార్టీల్లో అయోమయం కలిగించేలా.. టీఆర్ఎస్ టికెట్ కోసం ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లోని పలువురు నేతలు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావును కలిసే ప్రయత్నం చేశారు. అయితే కేటీఆర్ మాత్రం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ఆశావహులకు సమాచారం పంపించారు. కేరళ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ దగ్గరికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వెళ్లారు. కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్‌కు వచ్చాకే అభ్యర్థులపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. నామినేషన్ల గడువు 14తో ముగుస్తోంది. దానికి ఒకటిరెండు రోజుల ముందు మాత్రమే అభ్యర్థుల ప్రకటనకు అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీల్లో అయోమయం కలిగించేలా ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. నల్లగొండ ఎమ్మెల్సీ స్థానంలో టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, టీఆర్ఎస్ నేత తేరా చిన్నపరెడ్డి... వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కపల్లి రవీందర్రావు, రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి... రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కొత్తగా పార్టీలో చేరిన పటోళ్ల కార్తీక్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తోంది.నల్లగొండ స్థానానికి ప్రస్తుత ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి కె.నవీన్‌రావును ప్రకటించే అంశాన్నీ పరిశీలిస్తోంది. సీఎం కేసీఆర్‌తో కేటీఆర్... దేవాలయాల సందర్శన కోసం కేరళ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ బృందంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చేరారు. కేటీఆర్ సతీసమేతంగా బుధవారం కేరళకు వెళ్లారు. సీఎం కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులతోపాటు ఎంపీ సంతోష్‌కుమార్ ఈ పర్యటనలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌తో కలసి వెళ్లిన కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్... కేరళ సీఎం పినరయ్ విజయన్‌తో భేటీ అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్నారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థులపై సస్పెన్స్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలై నాలుగు రోజులు గడుస్తున్నా... టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో స్పష్టత రావడం లేదు. కరీంనగర్,ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ మేరకు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మాజీ మంత్రి, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే, టీఆర్ఎస్ నుంచి మాత్రం అధికారికంగా ఎవరిని పోటీలో నిలుపుతారనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. పదవీకాలం ముగుస్తున్న శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్‌ను తిరిగి బరిలో నిలుపుతారని భావించినప్పటికీ, ఆ విషయాన్ని బలపరిచే సంకేతాలేవీ వెలువడడం లేదు. ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ను పోటీలో నిలుపుతారనే ప్రచారం కూడా జరిగింది. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ మద్దతుతో పోటీలో నిలవాలని భావి స్తున్న వారు సైతం దేశపతికి ఉన్న అవకాశాలను కొట్టిపారేయలేదు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆయనను భవిష్యత్‌లో గవర్నర్ కోటాలో శాసనమండలికి పంపే ఆలోచనలో ఉన్న ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా టీఆర్ఎస్ అధినేత కేసీ ఆర్ మదిలో ఎవరు ఉన్నారో అర్థం కాక ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. ఈనెల 5వ తేదీతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండడంతో కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వ్యూహాత్మకంగా.... కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని నిలపాలనే విషయంలో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పలు ఉపాధ్యాయ సంఘాలు బలపరుస్తున్న అభ్యర్థిగా ప్రస్తుత శాసనమండలి సభ్యుడు పాతూరి సుధాకర్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ తొలుత భావించింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరిట ఓ ప్రకటన కూడా విడుదలైంది. అయితే ఇంటిలిజెన్స్ సర్వే, పార్టీ సర్వేల ఆధారంగా ఎవరికీ అధికారిక మద్దతు ఇవ్వకూడదని పార్టీ భావించినట్లు తెలుస్తోంది. అయితే సుధాకర్‌రెడ్డి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు, నిజామాబాద్ ఎంపీ కవిత ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి తన అభ్యర్థిత్వానికి మద్ధతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇక పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా సుధాకర్‌రెడ్డి వైపే మొగ్గు చూపిస్తున్నారు. కాగా అధికారిక ఉపాధ్యాయ గుర్తింపు సంఘం పీఆర్టీయూ సుధాకర్‌రెడ్డికి మద్దతు ఇవ్వకుండా రఘోత్తంరెడ్డిని పోటీలో నిలుపుతోంది. ఈ మేరకు ఆయన 2వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరో ఉపాధ్యాయ సంఘం నేత బి.మోహన్‌రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు జి.వేణుగోపాలస్వామి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎవరికి మద్దతు ఇవ్వకుండా గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటే వారికి అండగా నిలవాలనే వ్యూహంతో టీఆర్ఎస్ ఉన్నట్లు సమాచారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయంలోనూ ... పట్టభద్రుల నియోజకవర్గం విషయంలో కూడా ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలనే ఆలోచనతో టీఆర్ఎస్ ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి బలమైన నాయకుడు టి.జీవన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో మీమాంసలో పడినట్లు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు భిన్నంగా పట్టభద్రులు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉన్న ఈ ఎన్నికల్లో జీవన్‌రెడ్డిని ఢీకొట్టే స్థాయి నాయకుడిని బరిలో నిలిపితేనే పార్టీని గెలుపు తీరాలకు చేర్చొచ్చన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఉద్యోగసంఘాల నేత దేవీప్రసాద్‌ను టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో నిలపగా, బీజేపీ తరపున పోటీ చేసిన రామచంద్రారావు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తున్న టీఆర్ఎస్ ఇప్పటి వరకు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. ఉపాధ్యాయ నియోజకవర్గం విషయంలో అనుసరిస్తున్న తటస్థ వైఖరినే పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ విషయంలో కూడా అవలంబించాలన్న యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఆశల పల్లకీలో నేతలు టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోగా, పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు మాత్రం ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, ట్రస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణతో పాటు గ్రూప్–1 అధికారి మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్ తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఎవరికి వారే తమను అధికారికంగా ప్రకటిస్తారని ఆశతో ఉన్నారు. శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరుల పేర్లను కూడా ప్రస్తావిస్తున్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
⇒ ఎమ్మెల్యే కోటాలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, గంగాధర్‌గౌడ్ ⇒ గవర్నర్ కోటాలో ఫరూఖ్, డి.రాజేశ్వర్‌కు మరో అవకాశం ⇒ పేర్లు ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. శాసనమండలిలో ఎన్నికలు జరిగే స్థానా లకు పోటీ చేసే పార్టీ అభ్యర్థులను టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. త్వరలో ఖాళీ ఏర్పడే స్థానాలకూ అభ్య ర్థులను ప్రకటించారు. ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థు లుగా వుల్లోల గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు పేర్లను సీఎం ప్రక టించారు. ఎమ్మెల్యే కోటా కింద 3 స్థానాలకు, స్థానిక సంస్థల కోటా కింద ఒక స్థానానికి, ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ఒక స్థానానికి నోటిఫికేషన్ వెలువడింది. త్వరలోనే గవర్నర్ కోటా కింద 2 ఖాళీలు ఏర్పడుతు న్నాయి. ఈ ఖాళీలకు డి.రాజేశ్వర్‌రావు, ఫరూఖ్ హుస్సేన్‌ల పేర్లను ప్రభుత్వం తరఫున ప్రతిపాదించాలని సీఎం నిర్ణయించారు. స్థానిక సంస్థల కోటా నుంచి ఎంఐఎంకు చెందిన సయ్యద్ అమీనుల్ అసద్ జాఫ్రీకి టీఆర్ఎస్ మద్దతిచ్చింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోటా ఎన్నికకు కాటేపల్లి జనార్దన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు టీఆర్ఎస్ అభ్యర్థులు సోమవా రం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. హోంమంత్రి నాయిని, మున్సిపల్ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి మాదాటి రమేశ్‌రెడ్డిలను ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్తలుగా సీఎం ప్రకటించారు. సుభాష్‌రెడ్డి పేరు పరిశీలించినా: అభ్యర్థిత్వాలు ఖరారవడంతో ప్రస్తుత ఎన్నికల్లో 7 ఎమ్మెల్సీ స్థానాలకుగాను ముస్లిం సామాజిక వర్గానికి 2, రెడ్డి సామాజిక వర్గానికి 2, క్రిస్టియన్లకు ఒకటి, బీసీలకు ఒకటి, వెలమ సామాజిక వర్గా నికి ఒకటి చొప్పున దక్కినట్లయింది. కేసీఆర్ రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డి పేరును కూడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం పరిశీలించినా సామాజిక సమీకరణాల నేపథ్యంలో సాధ్యం కాలేదు. మళ్లీ ఎమ్మెల్సీ ఖాళీలు ఏర్పడినప్పుడు సుభాష్‌రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఫరూఖ్, రాజేశ్వర్లకు మళ్లీ అవకాశం ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న ఫరూఖ్ హుస్సేన్, డి.రాజేశ్వర్లకు మళ్లీ అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. మే 27న వీరిద్దరి పదవీ కాలం ముగియనుంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన వీరిద్దరినీ మరోసారి గవర్నర్ కోటాలో ప్రతిపాదించనున్నట్లు ముందుగానే ప్రకటించడంతో ఆ సీట్లు ఆశిస్తున్న పార్టీ నేతల ఆశలకు గండి కొట్టినట్లయింది. విధేయతకే పట్టం.. చేరిక నేతలకు ప్రాధాన్యం... అభ్యర్థుల ఎంపికలో విధేయతకు పెద్దపీట వేయటంతోపాటు ఇతర పార్టీల నుంచి చేరిన నేతలకు సీఎం ప్రాధాన్యమిచ్చారు. వివిధ సందర్భాల్లో వారికిచ్చిన మాటను సీఎం నిలబెట్టు కున్నారు. సీనియర్ నాయకుడు, తొలి నుంచీ పార్టీలో ఉన్న ఎలిమినేటి కృష్ణారెడ్డికి ఈసారి అవకాశం కల్పించారు. టీఆర్ఎస్ క్రమశిక్షణ మండలి చైర్మన్‌గా పని చేసిన కృష్ణా రెడ్డి దివంగత మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి సోదరుడు. టీడీపీ నుంచి గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావును ఊహించినట్లుగానే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. పార్టీ అడ్‌హక్ కమిటీల నియామకంలో ఆయనకు సీఎం హైదరాబాద్ సిటీ కన్వీనర్‌గా కీలక బాధ్యతలు కట్టబెట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మైనంపల్లి మేయర్ స్థానాన్ని ఆశించారు. అది దక్కకపోవటంతో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఈ సీటు మిత్రపక్షమైన ఎంఐఎంకు ఇవ్వటంతో ఎమ్మెల్యేల కోటాలో మైనంపాటిని సర్దు బాటు చేశారు. టీడీపీ తరఫున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పని చేసిన గంగాధర్ గౌడ్‌కు మళ్లీ అవకాశం దక్కింది. ఎమ్మెల్సీగా చైర్మన్ స్వామిగౌడ్ ఎన్నిక సందర్భంగా ఆయన టీఆర్ఎస్లో చేరారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారమే గంగాధర్‌గౌడ్‌కు మళ్లీ చాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే ఎమ్మెల్సీ అభ్యర్థులలో ముగ్గురు పేర్లను టీఆర్ఎస్ పార్టీ దాదాపు ఖరారు చేసింది. అందరు అభ్యర్థుల పేర్లను ఈ నెల 19న ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటిస్తారు. ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతోపాటు నేతి విద్యాసాగర్ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది.