ఎమ్మెల్సీ అభ్యర్థులపై సస్పెన్స్‌ | Suspension On TRS MLC Candidate Telangana | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ అభ్యర్థులపై సస్పెన్స్‌

Published Fri, Mar 1 2019 7:55 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Suspension On TRS MLC Candidate Telangana - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలై నాలుగు రోజులు గడుస్తున్నా... టీఆర్‌ఎస్‌ తరపున బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో స్పష్టత రావడం లేదు. కరీంనగర్,ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ మేరకు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మాజీ మంత్రి, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే, టీఆర్‌ఎస్‌ నుంచి మాత్రం అధికారికంగా ఎవరిని పోటీలో నిలుపుతారనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. పదవీకాలం ముగుస్తున్న శాసనమండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్‌ను తిరిగి బరిలో నిలుపుతారని భావించినప్పటికీ, ఆ విషయాన్ని బలపరిచే సంకేతాలేవీ వెలువడడం లేదు.

ముఖ్యమంత్రి ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌ను పోటీలో నిలుపుతారనే ప్రచారం కూడా జరిగింది. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ మద్దతుతో పోటీలో నిలవాలని భావి స్తున్న వారు సైతం దేశపతికి ఉన్న అవకాశాలను కొట్టిపారేయలేదు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆయనను భవిష్యత్‌లో గవర్నర్‌ కోటాలో శాసనమండలికి పంపే ఆలోచనలో ఉన్న ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీ ఆర్‌ మదిలో ఎవరు ఉన్నారో అర్థం కాక ఆశావహులు టెన్షన్‌ పడుతున్నారు. ఈనెల 5వ తేదీతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండడంతో కేసీఆర్‌ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వ్యూహాత్మకంగా....
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని నిలపాలనే విషయంలో టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పలు ఉపాధ్యాయ సంఘాలు బలపరుస్తున్న అభ్యర్థిగా ప్రస్తుత శాసనమండలి సభ్యుడు పాతూరి సుధాకర్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ తొలుత భావించింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరిట ఓ ప్రకటన కూడా విడుదలైంది. అయితే ఇంటిలిజెన్స్‌ సర్వే, పార్టీ సర్వేల ఆధారంగా ఎవరికీ అధికారిక మద్దతు ఇవ్వకూడదని పార్టీ భావించినట్లు తెలుస్తోంది. అయితే సుధాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు, నిజామాబాద్‌ ఎంపీ కవిత ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి తన అభ్యర్థిత్వానికి మద్ధతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.

ఇక పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా సుధాకర్‌రెడ్డి వైపే మొగ్గు చూపిస్తున్నారు. కాగా అధికారిక ఉపాధ్యాయ గుర్తింపు సంఘం పీఆర్‌టీయూ సుధాకర్‌రెడ్డికి మద్దతు ఇవ్వకుండా రఘోత్తంరెడ్డిని పోటీలో నిలుపుతోంది. ఈ మేరకు ఆయన 2వ తేదీన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మరో ఉపాధ్యాయ సంఘం నేత బి.మోహన్‌రెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయనతో పాటు జి.వేణుగోపాలస్వామి కూడా ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎవరికి మద్దతు ఇవ్వకుండా గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటే వారికి అండగా నిలవాలనే వ్యూహంతో టీఆర్‌ఎస్‌ ఉన్నట్లు సమాచారం.

పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయంలోనూ ...
పట్టభద్రుల నియోజకవర్గం విషయంలో కూడా ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలనే ఆలోచనతో టీఆర్‌ఎస్‌ ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ నుంచి బలమైన నాయకుడు టి.జీవన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేయడంతో మీమాంసలో పడినట్లు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు భిన్నంగా పట్టభద్రులు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉన్న ఈ ఎన్నికల్లో జీవన్‌రెడ్డిని ఢీకొట్టే స్థాయి నాయకుడిని బరిలో నిలిపితేనే పార్టీని గెలుపు తీరాలకు చేర్చొచ్చన్నది కేసీఆర్‌ ఆలోచనగా చెబుతున్నారు.

గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఉద్యోగసంఘాల నేత దేవీప్రసాద్‌ను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీలో నిలపగా, బీజేపీ తరపున పోటీ చేసిన రామచంద్రారావు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తున్న టీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. ఉపాధ్యాయ నియోజకవర్గం విషయంలో అనుసరిస్తున్న తటస్థ వైఖరినే పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ విషయంలో కూడా అవలంబించాలన్న యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆశల పల్లకీలో నేతలు
టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోగా, పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు మాత్రం ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. కరీంనగర్‌ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్, ట్రస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణతో పాటు గ్రూప్‌–1 అధికారి మామిళ్ల చంద్రశేఖర్‌ గౌడ్‌ తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఎవరికి వారే తమను అధికారికంగా ప్రకటిస్తారని ఆశతో ఉన్నారు. శాసనమండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్, ముఖ్యమంత్రి ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌ తదితరుల పేర్లను కూడా ప్రస్తావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement