ప్రశ్నించే గొంతుకకే పట్టాభిషేకం | MLC Results Congress Minister Jeevan Reddy Won In Karimnagar | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే గొంతుకకే పట్టాభిషేకం

Published Wed, Mar 27 2019 1:28 PM | Last Updated on Wed, Mar 27 2019 1:28 PM

MLC Results Congress Minister Jeevan Reddy Won In Karimnagar - Sakshi

జీవన్‌రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ , రఘోత్తమరెడ్డి, టీచర్స్‌ ఎమ్మెల్సీ

సాక్షి, కరీంనగర్‌: మూడు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘన విజయంతో ఊపు మీదున్న అధికార టీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్‌ తగిలింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. కరీంనగర్‌లో మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో పట్టభద్రుల స్థానం నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు టి.జీవన్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ప్రతీ రౌండ్‌లో సమీప ప్రత్యర్థిపై వేలాది ఓట్ల తేడాతో ముందుకుసాగారు. పోలైన ఓట్లలో సగానికి పైగా తొలి ప్రాధాన్యత ఓట్లు జీవన్‌రెడ్డికి చేరడంతో ఆయన విజయం నల్లేరు మీద నడకైంది. టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌.. బీజేపీ అభ్యర్థి సుగుణాకర్‌రావుతో పోటీ పడడం గమనార్హం.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో...
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బల పరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగిన శాసనమండలి చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఎలిమినేషన్‌ రౌండ్‌లో ఆయన ఐదో స్థానానికి పడిపోయారు. ఇక్కడ పీఆర్‌టీయూ–టీఎస్‌ అభ్యర్థి కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించారు. ఈ ఫలితం రాత్రి 11గంటల తర్వాత వెలువడింది. రెండో స్థానంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బి.మోహన్‌రెడ్డి నిలవడం గమనార్హం. రెండు ఎమ్మెల్సీ స్థానా ల్లోనూ టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు పరాజయం పాలవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్త లకు కొంత నిరాశ ఎదురైంది. పార్టీ అధికారిక అభ్యర్థులుగా బరిలో నిలవలేదని చెప్పుకునే ప్రయత్నం చేసినా.. చంద్రశేఖర్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి విజయం కోసం టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్‌ సైతం వీరిద్దరిని గెలిపించాలని ఎమ్మెల్యేలకు సూచించడం గమనార్హం.

గ్రూప్‌–1 ఉద్యోగాన్ని వదులుకొని...
గ్రూప్‌–1 అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో 9వ ర్యాంకు సాధించిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అధికారిగా పలు జిల్లాల్లో సేవలందించారు. మొన్నటి వరకు నల్లగొండ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తూనే కరీంనగర్‌ ఇన్‌చార్జి డీటీసీగా వ్యవహరించేవారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచే శాసనమండలికి వెళ్లాలన్న లక్ష్యంతో కసరత్తు చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో దిగేందుకు శాయశక్తులా కృషి చేశారు. పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టబోమని అధిష్టానం స్పష్టం చేసినప్పటికీ.. కేసీఆర్, కేటీఆర్, ఎంపీ కవితతో మాట్లాడి తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆమోదించుకున్నారు.

అనంతరం ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేసి, పార్టీ నేతలను ఒప్పించి అధికారికంగా మద్దతు ప్రకటించేలా చూడగలిగారు. అయితే ప్రశ్నించే గొంతుక కావాలన్న జీవన్‌రెడ్డి నినాదం ప్రజల్లోకి బలంగా చేరడంతో పాటు శాసనమండలిలో విపక్ష ఎమ్మెల్సీలు లేకుండా టీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తుందని ప్రచారం చేయడంతో విద్యావంతులు ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో జగిత్యాల ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం సేవలందించిన జీవన్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఆయనపై సానుభూతికి కారణమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో నాలుగు పూర్వ జిల్లాల్లో ఓటర్లంతా ఏకపక్షంగా స్పందించి జీవన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడం విశేషం. 

ప్రభావం చూపలేకపోయిన బీజేపీ
శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్‌ అసెంబ్లీ స్థానంలో గణనీయమైన ఓట్లు సాధించుకున్న బీజేపీకి యూత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పొల్సాని సుగుణాకర్‌ రావుకు అది ఓట్లు సాధించి పెట్టలేదు. మూడో స్థానానికి పడిపోయారు. కామారెడ్డికి చెందిన రణజిత్‌ మోహన్‌ బీజేపీ సానుభూతి పరుడిగానే పోటీ చేసినా.. ఆయనకు అక్కడ తప్ప మిగతా చోట్ల పెద్దగా ఓట్లు పోల్‌ కాలేదు. బీజేపీ ఎంపీ అభ్యర్థి సంజయ్‌కు ఇది కొంత ఇబ్బందికర పరిణామమేనని భావిస్తున్నారు. 

పట్టభద్రులంతా జీవన్‌రెడ్డి వైపే...
కరీంనగర్‌: కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రౌండ్‌ రౌండ్‌కు మెజార్టీ పెంచుకుంటూ ప్రత్యర్థులను మట్టి కరిపించారు. పట్టభద్రుల ఎన్నికల్లో 17 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఐదుగురు అభ్యర్థులు మూడంకెల ఓట్లు సాధించగలిగారు. మిగతా అభ్యర్థులు అంతంత మాత్రంగానే ఓట్లు పొందారు. ఒకటో రౌండ్‌లో జీవన్‌రెడ్డికి 6,984 ఓట్లు రాగా, రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి సుగుణాకర్‌రావుకు 2,004 ఓట్లు వచ్చాయి. ఇక టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు 1,910, యువత తెలంగాణ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణిరుద్రమకు 654 ఓట్లు, ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు జి.రణజిత్‌మోహన్‌కు 706 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి 7వేల ఓట్లు సాధించారు. మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ 2,004 ఓట్లు, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగుణాకర్‌రావు 1,807 ఓట్లు, రాణిరుద్రమ 650, జి.రణజిత్‌మోహన్‌కు 822 ఓట్లు వచ్చాయి.

మూడో రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి 7,380 ఓట్లు సాధించారు. మామిండ్ల చంద్రశేఖర్‌ గౌడ్‌ 1,942 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సుగుణాకర్‌రావుకు 1,846 ఓట్లు, రాణిరుద్రమకు 648 ఓట్లు, జి.రణజిత్‌మోహన్‌కు 513 ఓట్లు వచ్చాయి. మిగతా అభ్యర్థులు నామమాత్రపు పోటీ మాత్రమే ఇవ్వగలిగారు. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి జీవన్‌రెడ్డి 21,364 ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా.. టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ 5,856 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. సుగుణాకర్‌రావు 5,657 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. రాణి రుద్రమ 1,952 ఓట్లు సాధించారు. రాత్రి 11 గంటల తర్వాత నాలుగో రౌండ్‌ లెక్కింపు మొదలైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ఓట్లు లెక్కిస్తున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement