telangana mlc election
-
Telangana MLC Elections: నామినేషన్లు ముగిశాయ్.. క్యాంపులు షురూ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో 12 శాసనమండలి స్థానాలకు నామినేషన్ల స్వీకరణ గడువు మంగళవారం ముగిసింది. చివరి రోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్ మినహా పూర్వపు తొమ్మిది జిల్లాల పరిధిలోని 12 స్థానాలకు ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా బుధవారం నామినేషన్ల పరిశీలన, 26 వరకు ఉపసంహరణ తర్వాత బరిలో మిగిలే అభ్యర్థుల జాబితాపై స్పష్టత రానుంది. ఈ కోటా కింద ఓటు హక్కు కలిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో టీఆర్ఎస్కు చెందినవారే అధికంగా ఉన్నారు. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు అత్యధికంగా కరీంనగర్ నుంచి 27 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు. టీఆర్ఎస్ నామినేషన్లు ఇలా..: మెదక్ అభ్యర్థిగా డాక్టర్ యాదవరెడ్డి రెండో సెట్ నామినేషన్ పత్రా లు దాఖలు చేయగా, నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత నామినేషన్ సమర్పించారు. పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూచుకుల్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, నల్లగొండ స్థానం నుంచి ఎంసీ కోటిరెడ్డి కోటిరెడ్డి, ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధు, ఆదిలాబాద్ స్థానం నుంచి దండె విఠల్ నామినేషన్ వేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు పట్నం మహేందర్‌రెడ్డి, సుంకరి రాజు రెండో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాలకు ఎల్.రమణ, తానిపర్తి భానుప్రసాద్ నామినేషన్లు వేశారు. రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీరాజ్ చాంబర్స్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు శైలజారెడ్డి, ఎంపీపీల ఫోరం అధ్యక్షురాలు నిర్మలాశ్రీశైలంగౌడ్ సహా మరో 10 మంది ఎంపీపీలు, జెడ్పీటీసీలు నామినేషన్లు వేసేందుకు వచ్చారు. అధికార పార్టీకి చెం దిన నాయకులు వీరిని అడ్డు కుని నామినేషన్ పత్రాలను చించివేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గందరగోళంలోనే, శేరిలింగంపల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చలిక చంద్రశేఖర్ చాకచక్యంగా లోపలికెళ్లి స్వత్రంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేశారు. మంత్రులకు బాధ్యతలు: సంఖ్యా పరంగా ఎక్కు వ మం ది ఓటర్లను కలిగి ఉన్న టీఆర్ఎస్ వీలైనన్ని స్థానాలను ఏకగ్రీవంగా గెలుపొందేలా వ్యూహరచ న చేస్తోంది. పార్టీ ఓటర్లు చేజారకుండా ఉండేందుకు ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేవరకు క్యాంపులకు తరలించాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులకు ఓటర్ల మద్దతు కూడగట్టడం, క్యాంపుల నిర్వహణ, అసంతృప్తుల బుజ్జగింపు, స్వతంత్రులకు నచ్చచెప్పి పోటీ నుంచి వైదొలిగేలా చూడటం వంటి బా«ధ్యతలు అప్పగించారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఓటర్లను మంగళవారం సాయంత్రానికే హైదరాబాద్ సమీపంలోని ఓ రిసార్టుకు తరలించినట్లు సమాచారం. -
ఆశావహుల్లో ఉత్కంఠ.. గుత్తా, కడియంలకు మళ్లీ చాన్స్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో స్థానం కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మండలికి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల మొదటి వారంలో పూర్తయ్యింది. అలాగే గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలం కూడా ఈ నెల 17న పూర్తయ్యింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన స్థానాలకు గత నెల మూడో వారంలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఎన్నిక తేదీపై ఇప్పటివరకు స్పష్టత లేకున్నా ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నవారు మాత్రం ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. గుత్తా, కడియం ముందు వరుసలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై పదవీ కాలం పూర్తి చేసుకున్న ఆరుగురిలో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఇదే కోటాలో తిరిగి ఎన్నికవ్వాలని భావిస్తున్నారు. వీరిలో గుత్తా సుఖేందర్ రెడ్డికి మళ్లీ అవకాశం కల్పించి మరోసారి మండలి చైర్మన్‌గా అవకాశం కల్పిస్తారని లేదా మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. కడియం శ్రీహరికి కూడా ఎమ్మెల్సీగా తిరిగి అవకాశం లభిస్తుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితం వరంగల్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కడియం ఇంట్లో భోజనం చేశారు. మరోవైపు రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొంతకాలం స్తబ్దుగా ఉన్న కడియం ఇటీవలి కాలంలో తరచూ సీఎంను కలుస్తున్నారు. కడియంకు తిరిగి ప్రాధాన్యత దక్కుతుందనడానికి ఇవి సంకేతాలుగా చెబుతున్నారు. భారీగానే జాబితా మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండటంతో పదవులు ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతల జాబితా భారీగానే ఉంది. పద్మశాలి, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆయా సామాజికవర్గ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్, తక్కల్లపల్లి రవీందర్రావు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. వీరితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, పీఎల్ శ్రీనివాస్, ఎంసీ కోటిరెడ్డి, శుభప్రద పటేల్ వంటి వారు ఆశావహుల జాబితాలో ఉన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీలో చేరే పక్షంలో ఆయనకు తప్పనిసరిగా అవకాశం లభిస్తుందని సమాచారం. గవర్నర్ కోటాలో సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, బ్రూవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికపైనే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. చదవండి: ప్రజాసేవకు పదవులు అవసరం లేదు: కడియం శ్రీహరి Huzurabad: బిగ్‌ఫైట్‌కు టీఆర్ఎస్, బీజేపీ సై.. కానీ కాంగ్రెస్ ఎందుకిలా! -
టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయం
-
MLC Election Results: సురభి వాణిదేవి విజయం
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘంగా కొనసాగిన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుపై అధికార టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించారు. ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఆమె గెలుపు ఖరారైంది. మరికాసేపట్లో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇక వాణిదేవి విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. తెలంగాణ భవన్లో కాసేపట్లో విజయోత్సవ సంబరాలకు ఏర్పాట్లు చేస్తుండటంతో, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. ►సురభి వాణిదేవికి వచ్చిన మొత్తం ఓట్లు 1,49,269 ♦మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,12,689 ♦రెండో ప్రాధాన్యత ఓట్లు 36,580 ►రాంచందర్‌రావుకు వచ్చిన మొత్తం ఓట్లు 1,37,566 ♦మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,04,668 ♦రెండో ప్రాధాన్యత ఓట్లు 32,898 కాగా తెలంగాణలో ఈ నెల 14న రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత మూడు రోజులుగా ఓట్ల లెక్కింపు జరుగుతుండగా నేడు, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఫలితం వెలువడింది. ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఫలితం తేలాల్సి ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు దిశగా పయనిస్తుండగా, తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో కొనసాగుతున్నారు. చదవండి: మేం నేర్పిన చదువు ఇదేనా: వాణిదేవి అసహనం -
ప్రశ్నించే గొంతుకకే పట్టాభిషేకం
సాక్షి, కరీంనగర్: మూడు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘన విజయంతో ఊపు మీదున్న అధికార టీఆర్ఎస్కు ఊహించని షాక్ తగిలింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. కరీంనగర్లో మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో పట్టభద్రుల స్థానం నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి.జీవన్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ప్రతీ రౌండ్లో సమీప ప్రత్యర్థిపై వేలాది ఓట్ల తేడాతో ముందుకుసాగారు. పోలైన ఓట్లలో సగానికి పైగా తొలి ప్రాధాన్యత ఓట్లు జీవన్‌రెడ్డికి చేరడంతో ఆయన విజయం నల్లేరు మీద నడకైంది. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్.. బీజేపీ అభ్యర్థి సుగుణాకర్‌రావుతో పోటీ పడడం గమనార్హం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో... ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బల పరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగిన శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఎలిమినేషన్ రౌండ్లో ఆయన ఐదో స్థానానికి పడిపోయారు. ఇక్కడ పీఆర్టీయూ–టీఎస్ అభ్యర్థి కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించారు. ఈ ఫలితం రాత్రి 11గంటల తర్వాత వెలువడింది. రెండో స్థానంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బి.మోహన్‌రెడ్డి నిలవడం గమనార్హం. రెండు ఎమ్మెల్సీ స్థానా ల్లోనూ టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు పరాజయం పాలవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్త లకు కొంత నిరాశ ఎదురైంది. పార్టీ అధికారిక అభ్యర్థులుగా బరిలో నిలవలేదని చెప్పుకునే ప్రయత్నం చేసినా.. చంద్రశేఖర్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి విజయం కోసం టీఆర్ఎస్ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ సైతం వీరిద్దరిని గెలిపించాలని ఎమ్మెల్యేలకు సూచించడం గమనార్హం. గ్రూప్–1 ఉద్యోగాన్ని వదులుకొని... గ్రూప్–1 అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో 9వ ర్యాంకు సాధించిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ ట్రాన్స్పోర్ట్ అధికారిగా పలు జిల్లాల్లో సేవలందించారు. మొన్నటి వరకు నల్లగొండ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తూనే కరీంనగర్ ఇన్చార్జి డీటీసీగా వ్యవహరించేవారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచే శాసనమండలికి వెళ్లాలన్న లక్ష్యంతో కసరత్తు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు శాయశక్తులా కృషి చేశారు. పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టబోమని అధిష్టానం స్పష్టం చేసినప్పటికీ.. కేసీఆర్, కేటీఆర్, ఎంపీ కవితతో మాట్లాడి తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆమోదించుకున్నారు. అనంతరం ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేసి, పార్టీ నేతలను ఒప్పించి అధికారికంగా మద్దతు ప్రకటించేలా చూడగలిగారు. అయితే ప్రశ్నించే గొంతుక కావాలన్న జీవన్‌రెడ్డి నినాదం ప్రజల్లోకి బలంగా చేరడంతో పాటు శాసనమండలిలో విపక్ష ఎమ్మెల్సీలు లేకుండా టీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని ప్రచారం చేయడంతో విద్యావంతులు ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో జగిత్యాల ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం సేవలందించిన జీవన్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఆయనపై సానుభూతికి కారణమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో నాలుగు పూర్వ జిల్లాల్లో ఓటర్లంతా ఏకపక్షంగా స్పందించి జీవన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడం విశేషం. ప్రభావం చూపలేకపోయిన బీజేపీ శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో గణనీయమైన ఓట్లు సాధించుకున్న బీజేపీకి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పొల్సాని సుగుణాకర్ రావుకు అది ఓట్లు సాధించి పెట్టలేదు. మూడో స్థానానికి పడిపోయారు. కామారెడ్డికి చెందిన రణజిత్ మోహన్ బీజేపీ సానుభూతి పరుడిగానే పోటీ చేసినా.. ఆయనకు అక్కడ తప్ప మిగతా చోట్ల పెద్దగా ఓట్లు పోల్ కాలేదు. బీజేపీ ఎంపీ అభ్యర్థి సంజయ్‌కు ఇది కొంత ఇబ్బందికర పరిణామమేనని భావిస్తున్నారు. పట్టభద్రులంతా జీవన్‌రెడ్డి వైపే... కరీంనగర్: కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రౌండ్ రౌండ్‌కు మెజార్టీ పెంచుకుంటూ ప్రత్యర్థులను మట్టి కరిపించారు. పట్టభద్రుల ఎన్నికల్లో 17 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఐదుగురు అభ్యర్థులు మూడంకెల ఓట్లు సాధించగలిగారు. మిగతా అభ్యర్థులు అంతంత మాత్రంగానే ఓట్లు పొందారు. ఒకటో రౌండ్లో జీవన్‌రెడ్డికి 6,984 ఓట్లు రాగా, రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి సుగుణాకర్‌రావుకు 2,004 ఓట్లు వచ్చాయి. ఇక టీఆర్ఎస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు 1,910, యువత తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమకు 654 ఓట్లు, ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు జి.రణజిత్‌మోహన్‌కు 706 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి 7వేల ఓట్లు సాధించారు. మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ 2,004 ఓట్లు, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగుణాకర్‌రావు 1,807 ఓట్లు, రాణిరుద్రమ 650, జి.రణజిత్‌మోహన్‌కు 822 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి 7,380 ఓట్లు సాధించారు. మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ 1,942 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సుగుణాకర్‌రావుకు 1,846 ఓట్లు, రాణిరుద్రమకు 648 ఓట్లు, జి.రణజిత్‌మోహన్‌కు 513 ఓట్లు వచ్చాయి. మిగతా అభ్యర్థులు నామమాత్రపు పోటీ మాత్రమే ఇవ్వగలిగారు. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి జీవన్‌రెడ్డి 21,364 ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా.. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ 5,856 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. సుగుణాకర్‌రావు 5,657 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. రాణి రుద్రమ 1,952 ఓట్లు సాధించారు. రాత్రి 11 గంటల తర్వాత నాలుగో రౌండ్ లెక్కింపు మొదలైంది. -
5 స్థానాలు.. ఆరుగురు పోటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామనేషన్ల పర్వం ముగిసింది. మొత్తం ఐదు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. అధికార టీఆర్ఎస్ నుంచి మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లేశం బరిలోకి దిగగా.. టీఆర్ఎస్ మద్దతుతో మిత్రపక్షం ఎంఐఎం నుంచి మీర్జా రియజ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇక, ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి గుడూరు నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఈ నెల 12న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తన సంఖ్యాబలం ఆధారంగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను అలవోకగా గెలుచుకునే అవకాశం ఉంది. టీడీపీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునే అవకాశముంది. అయితే, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉండటంతో క్రాస్ ఓటింగ్ ద్వారా మొత్తం ఐదు స్థానాలు తామే గెలుచుకుంటామని టీఆర్ఎస్ ధీమాతో ఉంది. -
టీఆర్ఎస్ కు 10, కాంగ్రెస్ కు 2
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక కోటా శాసన మండలి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 12 స్థానాల్లో 10 టీఆర్ఎస్ దక్కించుకుంది. 6 ఏకగ్రీవం కాగా, మరో నాలుగింటిని పోటీలో గెల్చుకుంది. నాలుగు జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలకు జరిగిన హోరాహోరీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 2 సీట్లు కైవసం చేసుకున్నాయి. ఈ నెల 27న పోలింగ్ జరగ్గా, నేడు ఓట్ల లెక్కింపు జరిగింది. అమితాసక్తి రేపిన నల్లగొండ ఎమ్మెల్సీ సీటును కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరిత పోరులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ గెలుపొందారు. రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు పట్నం నరేందర్ రెడ్, శంభీపూర్ రాజు విజయం సాధించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ చెరోకటి దక్కించుకున్నాయి. కసిరెడ్డి నారాయణరెడ్డి(టీఆర్ఎస్), దామోదర్ రెడ్డి(కాంగ్రెస్) గెలుపొందారు. -
ఇది ప్రజల విజయం: కోమటిరెడ్డి
నల్లగొండ: సమిష్టి కృషితోనే తాను విజయం సాధించానని ఎమ్మెల్సీగా ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. స్థానిక కోటా శాసన మండలి ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... ఇది ప్రజల విజయమని పేర్కొన్నారు. తన గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషి చేశారని, కలిసికట్టుగా ముందుగా సాగి విజయాన్ని అందుకున్నామని చెప్పారు. పార్టీలు మారినా కొంతమంది నాయకులు కాంగ్రెస్ పై అభిమానంతో తనకు ఓటు వేశారని వెల్లడించారు. నల్లగొండలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆగడాలకు కళ్లెం వేస్తామన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి నైతిక బాధ్యత వహించి మంత్రి జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన విజయాన్ని సోనియా గాంధీకి కానుకగా ఇవ్వనున్నట్టు తెలిపారు. 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. -
'ఇది ప్రజల విజయం'
-
నల్లగొండలో కోమటిరెడ్డి గెలుపు
-
ఖమ్మంలో టీఆర్ఎస్ విజయం
-
నల్లగొండలో కోమటిరెడ్డి గెలుపు
నల్లగొండ: స్థానిక కోటా శాసన మండలి ఎన్నికల్లో విపక్ష కాంగ్రెస్ బోణి కొట్టింది. ఉత్కంఠభరిత పోరులో నల్లగొండ స్థానంలో విజయ కేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిపై 193 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజగోపాల్ రెడ్డికి 542, చిన్నపరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. మొత్తం 1100 ఓట్లు పోలయ్యాయి. తమ పార్టీ విజయంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పరస్పరం స్వీట్లు పంచుకుని అభినందనలు తెలుపుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరుల సొంత జిల్లా కావడంతో ఇక్కడి ఎమ్మెల్సీ ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పక్కావ్యూహంతో టీఆర్ఎస్ కు చెక్ పెట్టి విజయం సాధించింది. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డింది. మంత్రి జగదీశ్వర్ రెడ్డి బాధ్యత అంతా తన భుజాలపై వేసుకుని ప్రచారం సాగించారు. క్యాంపు రాజకీయాలు నిర్వహించినా టీఆర్ఎస్ కు ఓటమి తప్పలేదు. అయితే క్రాస్ ఓటింగ్ కారణంగానే తమ అభ్యర్థి ఓడిపోయాడని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. -
ఖమ్మంలో టీఆర్ఎస్ విజయం
ఖమ్మం: స్థానిక కోటా శాసన మండలి ఎన్నికల్లో ఖమ్మం సీటును అధికార పార్టీ గెలుచుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ విజయం సాధించారు. సీపీఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావుపై 31 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన విజయం సాధించారు. లక్ష్మీనారాయణకు 316 ఓట్లు, పువ్వాడ నాగేశ్వరరావుకు- 275 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమల్ రాజ్ కు 102 ఓట్లు వచ్చాయి. నోటాకు ఒక ఓటు పడింది. ఒక ఓటు చెల్లకుండా పోయింది. తమ పార్టీ అభ్యర్థి విజయంతో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు మునిగిపోయారు. టపాసులు కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు
-
ఆ గొంతు మీది కాదా?
‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు ప్రమేయంపై అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ నిలదీత నామినేటెడ్ ఎమ్మెల్యేతో బాబు మాట్లాడింది నిజం కాదా? ఓటుకు కోట్లు అంశంపై చర్చకు అనుమతించని స్పీకర్ చర్చకు పట్టుపట్టిన ప్రతిపక్షం కేసీఆర్ ఫోన్ చేయడంతోనే జగన్ ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నాడన్న అచ్చెన్నాయుడు... నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్న జగన్ నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేయాలని సవాల్ తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య శాసనసభ నిరవధిక వాయిదా హైదరాబాద్: ‘‘తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టడానికి ఆయనతో ఫోన్లో మాట్లాడింది మీరు కాదా? ఎమ్మెల్యేను కొనడానికి రేవంత్‌రెడ్డిని బేరానికి పంపించింది మీరు కాదా? డబ్బులు ఇచ్చింది మీరు కాదా?’’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిలదీస్తూ శుక్రవారం శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంధించిన ప్రశ్నలు ఇవి. అయన అడిగిన ప్రశ్నలకు అధికారపక్షం ఠారెత్తిపోయింది. సభానేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ ఆవరణలోని తన చాంబర్లో ఉన్నప్పటికీ సభలో అడుగుపెట్టలేదు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ‘ఓట్లుకు కోట్లు’ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అట్టుడికింది. ఈ అంశంపై జగన్ మాట్లాడటం మొదలుపెట్టడంతోనే స్పీకర్ మైక్ కట్ చేయగా, అధికార పార్టీ సభ్యులు అడుగడుగునా అడ్డుపడ్డారు. తమ పార్టీ అధినేత ప్రమేయం ఉన్న వ్యవహారంలో ప్రతిపక్ష నేత మాట్లాడుతుండే సరికి వారు అవాంతరాలు కల్పిస్తూ ఎదురుదాడికి దిగారు. నిరూపించకపోతే రాజీనామా చేస్తారా? ‘‘అధికార పార్టీ సభ్యులు నా మీద ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేశారు. నేను సవాల్ విసురుతున్నా. కేసీఆర్ రాత్రి నాకు ఫోన్ చేసినట్లు నిరూపించండి. నేను రాజీనామా చేస్తా. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా?’’ అని జగన్మోహన్రెడ్డి అధికార పార్టీకి సవాలు విసిరారు. జగన్‌కు రాత్రి కేసీఆర్ ఫోన్ చేసి ఓటుకుకోట్లు కేసును శాసనసభలో ప్రస్తావించమని చెప్పారని అచ్చెన్నాయుడు ఆరోపించడంతో జగన్ ఈ సవాలు విసిరారు. సభ తొలిసారి వాయిదా పడి తర్వాత సమావేశం అయిన సమయంలో ప్రతిపక్షనేతకు మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా అంతకు ముందు తెలుగుదేశం నేతలు చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘‘మీరు(టీడీపీ వాళ్లు) ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయవచ్చు. మేము వాస్తవం చెప్పినా విని హేతుబద్ధంగా ఆలోచించరు. ఏదైనా చెబితే నిజాయితీ ఉండాలి. నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడమేనా? కేసీఆర్, చంద్రబాబు ఎన్నికల్లో పొత్తుపెట్టుకొన్నారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు పత్రికల్లో వచ్చాయి ఇవిగో. (పత్రికల క్లిప్పింగ్స్ చూపించారు). దొంగతనం చేయడం తప్పు కాదట. దొంగతనం చేస్తూ పట్టుబడితే.. పట్టుకోవడం తప్పంటున్నారు చంద్రబాబు. ఓటుకు కోట్లు కేసును రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా తయారు చేస్తున్నారు. ఫోన్లో మాట్లాడిన వాయిస్ (నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన గొంతు) మీది (చంద్రబాబుది) అవునా, కాదా? బేరానికి రేవంత్‌రెడ్డికి డబ్బులిచ్చి పంపించింది మీరు కాదా? వీడియో, ఆడియో రికార్డింగ్‌లలో పట్టుబడ్డారు. ఫోరెన్సిక్ నివేదికలు చంద్రబాబు ప్రమేయాన్ని ధ్రువీకరించాయి. నేను ఇక్కడే(శాసనసభలో) ఉన్నాను. ఆయన(చంద్రబాబు)ను వచ్చి సమాధానం చెప్పమనండి. ఆ కేసు చార్జిషీట్లో 22 సార్లు చంద్రబాబు పేరు ఉంది. ఈ విషయం గురించి చర్చ జరగకూడదు అని అంటున్నారు. నా గురించి మాత్రం సభలో రోజూ చర్చించవచ్చు. రోజూ నోటికి వచ్చినట్లు తిట్టొచ్చు. నన్ను తిట్టడంతో ఆగరు. చనిపోయిన మా నాన్న మీదా మాట్లాడతారు. దివంగత నేత ప్రియతమ నాయకుడు డా.వైఎస్ రాజశేఖరరెడ్డి పేరూ ప్రస్తావిస్తారు. నా గురించి ఏం మాట్లాడినా ఫర్వాలేదా? చంద్రబాబు మీద మాట్లాడితే సబ్‌జుడీస్ (కోర్టుల్లో ఉన్న వ్యవహారం) అంటున్నారు. నా గురించి మాట్లాడితే సబ్‌జుడీస్ కాదా? తప్పు చేసి తప్పించుకోవడానికి చంద్రబాబు సభను ఉపయోగించుకుంటున్నారు. చార్జిషీట్లో 22 సార్లు బాబు పేరుంటే సభలో ఎందుకు చర్చి ంచకూడదు? విచ్చలవిడిగా లంచాలు మేసి వాటితో ఓట్లు కొనుగోలు చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే సభలో చర్చించకూడదా?...’’ అని జగన్ ప్రసంగిస్తుండగా స్పీకర్ అడ్డుతగులుతూ అజెండాలో లేని అంశాల పై మాట్లాడటానికి కుదరదంటూ మైక్ కట్ చేశారు.. తెలుగుదేశం సభ్యుల విమర్శలు... అధికార పార్టీ సభ్యులు కాలువ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, పల్లె రఘునాథరెడ్డి తదితరులు సభలో పరిమితులు దాటి జగన్ మీద విమర్శల వాన కురిపించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్ర ను జగన్ ఎండగడుతుండే సరికి ఆయనపై విమర్శలతో విరుచుకుపడ్డారు. అధికారపార్టీ సభ్యుల తీరుపై ప్రతిపక్షపార్టీ సభ్యులు తీవ్రనిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డుల ప్రదర్శన.. నినాదాలు హోరు... ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో విపక్షసభ్యులు నిరసన వ్యక్తం చేశారు. చర్చ కోసం పట్టుబట్టారు. స్పీకర్ అంగీకరించకపోవడంతో వైఎస్సార్సీపీ సభ్యులంతా స్పీకర్ పోడియం వద్ద నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ‘ఓటుకు కోట్లు ఎక్కడవి? చంద్రబాబు బ్రీఫ్డ్ మీ’ అని రాసున్న ప్లకార్డులు ప్రదర్శించారు. ‘ఒక ఓటు ఐదు కోట్లు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే ఆందోళనల మధ్య 9.28 గంటలకు సభ తొలిసారి వాయిదా పడింది. 10.15 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడూ ఇదే పరిస్థితి కొనసాగింది. కాసేపు విపక్షనేత జగన్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చి అర్ధాంతరంగా మైక్ చేయడం, విపక్ష సభ్యుల నినాదాల హోరులోనే అధికార పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో ప్రతి విమర్శలు చేయడం మినహా ఏ అంశంపైనా చర్చ చేపట్టలేకపోయారు. 10.33 గంటలకు సభ రెండోసారి వాయిదా పడింది. మధ్యాహ్నం 1.05 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడూ విపక్ష సభ్యులు ఓటుకుకోట్లు కేసుపై చర్చించాలని పట్టుబట్టి స్పీకర్ పోడియం వద్ద నిలబడి నినాదాలు అందుకున్నారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య శాసనసభ వర్షాకాల సమావేశాల వివరాలను వెల్లడిస్తూ సభను స్పీకర్ నిరవధిక వాయిదా వేశారు. అధికార పార్టీ సభ్యులు నా మీద ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేశారు. నేను సవాల్ విసురుతున్నా. నాకు కేసీఆర్ ఫోన్ చేసినట్లు నిరూపించండి. నేను రాజీనామా చేస్తా. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా? - వైఎస్ జగన్ -
తప్పుకో బాస్
చంద్రబాబు రాజీనామాకు వైఎస్సార్సీపీ డిమాండ్ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించిన పార్టీ శ్రేణులు కదం తొక్కిన జిల్లా ప్రజలు సబ్ కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటిచ్చారు.. తీరా ఇప్పుడు రుజువుల టేపులు దొరికితే ట్యాపింగంటున్నారు.. అవినీతి అంతుచూస్తానంటూ నీతివాక్యాలు వల్లించే మీరు అడ్డంగా దొరికిపోయినా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ రుబాబు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసిన ఓ చంద్రబాబూ.. రాష్ట్రాన్ని ఏలే అర్హత లేదు.. వెంటనే గద్దె దిగు.. అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీడీపీ అనైతిక చర్యలను నిరసిస్తూ ఆందోళనలు చేశారు. విజయవాడ : అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదు.. తక్షణమే రాజీనామా చేసి తప్పును అంగీకరించాలి.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబే కీలక సూత్రధారి అని వెల్లడైన నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, నిరసన ర్యాలీలు నిర్వహించాయి. సిగ్గుంటే తక్షణం వైదొలగాలి... విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి అధ్యక్షతన ఆ పార్టీ శ్రేణులు భారీ ధర్నా చేపట్టాయి. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబుకు సిగ్గుంటే తక్షణమే పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఉన్నతస్థాయి దర్యాప్తు చేసి, సీఎం చంద్రబాబును అరెస్టు చేయాలని ఆయన కోరారు. పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ ఇలాంటి నీచ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని మండిపడ్డారు. బాబు తక్షణమే తన పదవి నుంచి తప్పుకొని ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఆధారాలతో సహా దొరికిపోయిన బాబును తక్షణమే అరెస్టు చేయాలన్నారు. దీనిని రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా మార్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు, అవినీతికి విడదీయరాని సంబంధం ఉందన్నారు. అన్ని పనులు, ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. రుజువులతో సహా దొరికినా ఇంకా చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం. శివరామకృష్ణ, కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పామర్రులో ఉద్రిక్తత... పామర్రులో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. అయితే వీరికి పోటీగా టీడీపీ నేతలు కూడా ర్యాలీ నిర్వహించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ కార్యకర్తలు కవ్వింపు ధోరణులకు పాల్పడినా.. స్థానిక పోలీసులు పట్టనట్లు వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆందోళన చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలను మాత్రం ధర్నా విరమించాలని పోలీసులు పదేపదే కోరడం, అడ్డంకులు సృష్టించడంపై ఎమ్మెల్యే కల్పన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. జిల్లాలో ఆందోళనలు ఇలా... నూజివీడులో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు నేతృత్వంలో పట్టణంలోని ప్రధాన సెంటర్లో ధర్నా నిర్వహించారు. తిరువూరులో ఎమ్మెల్యే రక్షణనిధి ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డులో ధర్నా చేపట్టారు. పెనమలూరు నియోజకవర్గంలో పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. మచిలీపట్నం నియోజకవర్గంలో పార్టీ పట్టణ కన్వీనర్ షేక్ సలార్‌దాదా నేతృత్వంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. పెడన నియోజకవర్గంలో కైకలూరు సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి ధర్నా జరిపారు. పెడన తహశీల్దార్ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బూరగడ్డ వేదవ్యాస్ ఆధ్వర్యంలోలో ధర్నా నిర్వహించారు. మైలవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. నందిగామ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి, మానవహారం నిర్మించారు. అనంతరం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మొండితోక అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని బస్టాండ్ సెంటర్లో పట్టణ మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు నేతృత్వంలో ధర్నా జరిగింది. కైకలూరులో పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. -
ఇదేనా రాజకీయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటు కొనుగోలు కోసం తెలుగుదేశం పార్టీ నడిపిన ముడుపుల బాగోతం తెలుగు ప్రజలను విస్తుపోయేలా చేసింది. అధికారం కోసం ఆ పార్టీ ఎంతకైనా తెగబడుతుందనే విషయాన్ని ఈ ఘటన తేటతెల్లం చేసింది. జిల్లాలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఐదు కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకొని రూ.50 లక్షలు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇస్తూ ఏసీబీకి చిక్కి కటకటాలపాలైన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలోని పెద్దల సభలో ఎలాగైనా గెలుపు సాధించాలనే ఉద్దేశంతో ఈ దురుద్దేశానికి పాల్పడింది. ‘మా బాసే నన్ను పంపించారు.. చంద్రబాబు ఆశీస్సులు నీకు ఉంటాయి..’ అంటూ స్టీఫెన్సన్కు రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చిన వీడియో సంభాషణలు పలు న్యూస్ చానళ్లలో ప్రసారం కావడంతో దీనివెనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కీలక సూత్రధారి అనే విషయం తేటతెల్లమవుతోందని అందరూ భావిస్తున్నారు. ఈ ఉదంతం తెలుగు ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. రేవంత్‌రెడ్డి ప్రజాస్వామ్య విలువలను మంటగలిపాడంటూ పలు పార్టీల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. సంస్కృతీ సంప్రదాయాలకు పెట్టింది పేరుగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ విచ్చలవిడిగా ధన రాజకీయాలకు తెరతీయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఇచ్చి అధికారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలతో పాటు సామాజిక బాధ్యతతో దేశం నుంచి వెలివేయాలని పలువురు కోరుతున్నారు. చంద్రబాబును కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముడుపులు పట్టిసీమ సొమ్ములే పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన అవినీతి సొమ్ముతోనే తెలంగాణలో ఎమ్మెల్యేను కొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నించారు. ఇందులో ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హస్తం ఉంది. టీడీపీ సూట్‌కేసుల పార్టీ అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి ఆ డబ్బులు ఎక్కడ నుంచి అందాయన్న విషయాన్ని సీబీఐ నిగ్గు తేల్చాలి. పట్టిసీమ కాంట్రాక్టర్ ఇంటికి హెలికాప్టర్లో చంద్రబాబు వెళ్లడాన్ని బట్టే ముడుపుల బంధం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. - మల్లాది విష్ణు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు టీడీపీ ఖరీదైన రాజకీయం చేస్తోంది రేవంత్‌రెడ్డి లంచం ఇస్తున్న వీడియో ద్వారా స్పష్టం అవుతోంది. దీన్ని ప్రజలు నమ్ముతున్నారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు సంపాదించుకునేందుకు ఒక్క ఓటుకు రూ.5 కోట్లు చొప్పున ఆఫర్ ఉంటే విచిత్రంగా ఉంది. రాజకీయనాయకుల్నే కాకుండా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ఉంది. టీడీపీ ఖరీదైన రాజకీయం చేస్తోంది. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడాలి. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాలి. రేవంత్ రెడ్డి తప్పు చేసినట్లు రుజువైతే చట్టం తన పని తాను చేసుకువెళ్లాలి. - డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు, బీజేపీ నగర అధ్యక్షుడు టీడీపీవి అరాచక రాజకీయాలు టీడీపీ అరాచక రాజకీయాలు చేస్తోంది. ఒక్క ఎమ్మెల్యే ఓటు కోసం రూ.5 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారంటే దోపిడీ సొమ్ము ఆ పార్టీ నేతల వద్ద ఎంత ఉందో అర్థమవుతోంది. చంద్రబాబు తెలంగాణలో కుట్ర రాజకీయాలు చేయడం అనైతికం. రేవంత్ రెడ్డికి ఆ సొమ్ములు ఎక్కడ నుంచి వచ్చాయనే దానిపై సీబీఐ విచారణ నిర్వహించాలి. మహానాడులో నీతులు వల్లించిన చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం హేయం. - సుంకర పద్మశ్రీ, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా అమ్మేశారు చంద్రబాబు మార్కు రాజకీయాలు రేవంత్‌రెడ్డి ఉదంతంతో బట్టబయలయ్యాయి. బాబు పారదర్శకత నేతి బీరకాయలో నేతి చందమే. రెడ్ హ్యాండెండ్‌గా డబ్బులిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దొరికినా ఇంకా టీడీపీ సమర్థించుకోవడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా అమ్మేశారు. ఆ పార్టీకి ఇదేం కొత్త కాదు. మొన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ధనరాజకీయం చేశారు. రేవంత్‌రెడ్డిని ప్రేరేపించిన సూత్రధారిపైనా చర్యలు తీసుకోవాలి. రేవంత్‌రెడ్డి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి. - దోనేపూడి శంకర్, సీపీఐ నగర కార్యదర్శి నిజం నిప్పులాంటిది రాజకీయాల్లో నీతి, నిజాయితీతో వ్యవహరిస్తున్నామని ప్రగల్భాలు పలికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిజస్వరూపం రేవంత్‌రెడ్డి వ్యవహారంతో బయటపడింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలుపొందాలనే తాపత్రయంతో రూ.5 కోట్లు ఎరచూపిన రేవంత్‌రెడ్డికి తెరవెనుక ఉన్న పెద్దల బాగోతాన్ని ఏసీబీ బహిర్గతం చేయాలి. అవినీతి, అక్రమాలపై ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ ఇతర పార్టీల నాయకులను చులకన చేసే రేవంత్‌ను కఠినంగా శిక్షిస్తేనే రాజకీయాల్లో మార్పు వస్తుంది. - రక్షణనిధి, తిరువూరు ఎమ్మెల్యే బాబు స్వార్థ రాజకీయాలకు రేవంత్ బలి తెలంగాణలో టీడీపీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు రేవంత్‌రెడ్డి పావుగా మారాడు. మంచి వాగ్ధాటి ఉన్న రేవంత్‌రెడ్డి రాజకీయం జీవితం నాశనమైంది. ఇటువంటి రాజకీయాలు చంద్రబాబు మొదటి నుంచి చేస్తున్నారు. రేవంత్‌లాంటి వాళ్లు చాలామంది టీడీపీలో ఉన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచేందుకు ఆనాడే చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆయన చావుకు కారణమయ్యాడు. సింగపూర్ నేతలతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని రాష్ట్రాన్ని వారికి తాకట్టు పెట్టి ఉండవచ్చు. - బి.అశోక్ కుమార్, లోక్‌సత్తా నగర అధ్యక్షుడు ఒక్క ఓటుకు ఐదు కోట్లా తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఒక్క ఓటు కోసం రూ.5 కోట్లకు ఎమ్మెల్యేను కొనుగోలు చేయడం దారుణం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. పార్టీలు, ప్రజాస్వామ్యంపై చర్చ జరగాలి. ఎమ్మెల్యేలు పార్టీలు మారేటప్పుడు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీచేయాలి. అలాగే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేవారిపైనా కఠినమైన ఆంక్షలు ఉండాలి. - చెన్నుపాటి విద్య, మాజీ ఎంపీ రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను డబ్బుతో కొందామనుకుని ఏసీబీకి దొరికిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. గతంలో ఎన్నోసార్లు నీతి వాఖ్యాలు పలికిన రేవంత్‌రెడ్డి ఇపుడు ఎమ్మెల్యేకు డబ్బు ఇస్తూ ఏసీబీ స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పటికైనా చేసిన తప్పునకు ఎమ్మెల్యే పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి. - జేఎస్ఆర్ నాయుడు, కాపునాడు రాష్ట్ర కార్యదర్శి కొనుగోలు రాజకీయాలు ఎమ్మెల్యే ఓటు కొనుగోలుకు రేవంత్‌రెడ్డిని పురిగొల్పిన సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. చంద్రబాబు మొదట్నుంచి కొనుగోలు రాజకీయాలు చేస్తున్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీకోసం సొంత పార్టీ ఎమ్మెల్యేలనే బాబు కొన్నారు. రేవంత్ స్వయంగా చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు అంగీకరించినందున చంద్రబాబుపై సెక్షన్ 34, 107, 420, 120బి కేసు నమోదు చేసి, ప్రివెన్స్ ఆఫ్ కరప్షన్ సెక్షన్-7 ఎవెట్మెంట్ ప్రకారం చర్యలు తీసుకోవాలి. - పి.గౌతంరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబును అరెస్ట్ చేయాలి నామినేటెడ్ ఎమ్మెల్యేకు కోట్లు ఇవ్వజూపిన ఘటనలో తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి కేవలం పావు మాత్రమే. అసలు సూత్రధారి చంద్రబాబు నాయుడే. ఈ కేసులో బాబును మొదటి నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసి విచారించాలి. దేశ చరిత్రలోనే ఇంతటి నీచ రాజకీయాలకు పాల్పడిన ముఖ్యమంత్రి లేరు. తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకొని మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయాలి. రాష్ట్ర ప్రజల సొమ్ముతో, కాంట్రాక్టర్ల వద్ద నుంచి తీసుకున్న ముడుపులతో తెలంగాణాలో ఎమ్మెల్సీ గెలుపు కోసం అక్కడ ముడుపులు పంచటం అత్యంత దౌర్భాగ్యం. -జోగి రమేష్ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చంద్రబాబు మాటలు నేతిబీర చందం నీతికి తాను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే చంద్రబాబు జీవితమంతా అవినీతిమయం. ఎన్నికల్లో ఓటర్లకు మభ్యపెట్టడానికి కోట్లు కుమ్మరించే టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ధనప్రవాహం పారించటానికి వెనుకాడదని రేవంత్‌రెడ్డి ఘటనతో నిరూపితమైంది. తన బాస్ చంద్రబాబు ఆదేశాల ప్రకారమే డబ్బులు ఇస్తున్నానని రేవంత్ పేర్కొన్నందున చంద్రబాబును అరెస్టు చేయాలి. నీరు-చెట్టు, పట్టిసీమ ప్రాజెక్ట్ వంటి వాటిలో అవినీతికి పాల్పడుతున్న బాబు మహానాడులో నీతి వ్యాఖ్యలు చెప్పటం హాస్యాస్పదం. -కొలుసు పార్థసారథి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు టీడీపీ స్వరూపం బట్టబయలైంది రేవంత్‌రెడ్డి వ్యవహారంతో తెలుగుదేశం పార్టీ స్వరూపం బట్టబయలైంది. పెద్దల సభకు పంపించే నేతల ఎన్నికల అంశంలో టీడీపీ ఈ విధంగా వ్యవహరించడం అత్యంత నీచమైన పరిణామం. జాతీయ మీడియానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మీడియా రేవంత్‌రెడ్డి వ్యవహారాన్ని, తెలుగుదేశం పార్టీ తీరును ఎండగడుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా ఖూనీ చేసిన తెలుగుదేశం పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం. - జలీల్‌ఖాన్, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనే డబ్బులు కుమ్మరించటం చూశాం. ఈ ఘటనతో చట్టసభల్లో సీట్లను కూడా కోట్లు కుమ్మరించి కొనుగోలు చేస్తున్నారు. ఇది రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోతుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణలు అవసరం. - సీహెచ్ బాబురావు, సీపీఎం నగర కార్యదర్శి రేవంత్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి ఒక ఓటు కోసం రూ.5 కోట్లు ఇచ్చి ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన రేవంత్‌రెడ్డి వ్యవహారం ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాలకు మాయని మచ్చ తెచ్చింది. ఇలాంటి వ్యక్తిని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలి. స్టీఫెన్సన్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అయినందునే రేవంత్‌రెడ్డి బండారం బయటపడింది. ప్రజాప్రతినిధులకు ఉన్న విలువను నీచంగా దిగజార్చిన రేవంత్‌రెడ్డి స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిది. - మేకా ప్రతాప్ అప్పారావు, నూజివీడు ఎమ్మెల్యే -
రేవంత్ కోసం రంగంలోకి మార్షల్స్
హైదరాబాద్: ముడుపుల వ్యవహారంలో అరెస్టైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని జైలుకు తరలించడంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. న్యాయమూర్తి అనుమతితో ఈ ఉదయం ఓటు వేసేందుకు ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఓటు వేయకుండా కాలయాపన చేసేందుకు రేవంత్ లో కలిసి టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కమిటీ హాల్ లో సమావేశం పెట్టుకున్నారు. ఎన్నికలు జరుగుతుండగా సమావేశం ఎలా పెట్టుకుంటారని మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల పరిశీలకుడు అదర్ సిన్హాకు ఫిర్యాదు చేశారు. దీంతో రేవంత్ రెడ్డిని తరలించేందుకు మార్షల్స్ ను రంగంలోకి దించారు. అసెంబ్లీ నుంచి ఆయనను మార్షల్స్ బయటకు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. రేవంత్ రెడ్డిని తర్వాత పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. -
టైంపాస్ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకుండా అసెంబ్లీహాల్ లోనే కాలయాపన చేస్తున్నారు. ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో అరెస్టైన తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందనే ఆశతో ఓటు వేయకుండా టైం పాస్ చేస్తున్నారు. మరోవైపు ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు త్వరగా ఓటు వేయాలని రేవంత్ రెడ్డిని పోలీసులు కోరారు. 'నేను టీడీఎల్పీ ఉప నేతను..ఓటింగ్ సరళిని పరిశీలించాల్సిన బాధ్యత నాపై ఉంది' అని అధికారులతో రేవంత్ అన్నారు. ఓటు వేసిన తర్వాత ఆయనను పోలీసులు జైలుకు తరలించనున్నారు. ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కాసేపట్లో బెయిల్ పిటిషన్ వేయనున్నట్టు రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు తెలిపారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేయాలి
-
ఓటు వేశాక జైలుకు రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ కోసం ఈరోజు పిటిషన్ వేయనున్నామని ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు. పోలీసులు పెట్టిన కేసు తప్పుడుదని, బెయిల్ ఇవ్వాలని కోరతామని చెప్పారు. రేవంత్ రెడ్డిని ఈ ఉదయం న్యాయమూర్తి లక్ష్మీపతి ఎదుట హాజరుపరిచారు. రేవంత్ కు జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి రేవంత్ కు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారని లాయర్లు చెప్పారు. ఓటు వేసేందుకు ఏ సమయంలో తీసుకెళ్లతారనేది పోలీసులు తమ వీలును బట్టి చేస్తారన్నారు. ఓటు వేసిన తర్వాత ఆయనను జైలుకు తరలిస్తారన్నారు. పోలీసులు తన పట్ల దురుసుగా వ్యవహరించారని జడ్జికి రేవంత్ ఫిర్యాదు చేశారని లాయర్లు వెల్లడించారు. పోలీసుల దురుసు ప్రవర్తన కారణంగా తన చేతికి గాయమైందని, వైద్యం చేయించుకునేందుకు అనుమతించాలని కోరగా న్యాయమూర్తి మౌలిక ఆదేశాలిచ్చారని న్యాయవాదులు తెలిపారు. ఏసీబీ తరపు లాయర్ రాలేదని, అధికారులు మాత్రమే వచ్చారని చెప్పారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేయాలి: టి.టీడీపీ
హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు లేఖ రాసింది. తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరింది. అధికార టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని టీడీపీ ఆరోపించింది. సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేల ఫోన్లు టాప్ చేసి బ్లాక్‌మెయిలింగ్ పాల్పడుతున్నారని లేఖలో తెలిపింది. పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసిన తర్వాతే ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేసింది.