
ఇదేనా రాజకీయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటు కొనుగోలు కోసం తెలుగుదేశం పార్టీ నడిపిన ముడుపుల బాగోతం తెలుగు ప్రజలను విస్తుపోయేలా చేసింది. అధికారం కోసం ఆ పార్టీ ఎంతకైనా తెగబడుతుందనే విషయాన్ని ఈ ఘటన తేటతెల్లం చేసింది. జిల్లాలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఐదు కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకొని రూ.50 లక్షలు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇస్తూ ఏసీబీకి చిక్కి కటకటాలపాలైన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలోని పెద్దల సభలో ఎలాగైనా గెలుపు సాధించాలనే ఉద్దేశంతో ఈ దురుద్దేశానికి పాల్పడింది. ‘మా బాసే నన్ను పంపించారు.. చంద్రబాబు ఆశీస్సులు నీకు ఉంటాయి..’ అంటూ స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చిన వీడియో సంభాషణలు పలు న్యూస్ చానళ్లలో ప్రసారం కావడంతో దీనివెనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కీలక సూత్రధారి అనే విషయం తేటతెల్లమవుతోందని అందరూ భావిస్తున్నారు.
ఈ ఉదంతం తెలుగు ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. రేవంత్‌రెడ్డి ప్రజాస్వామ్య విలువలను మంటగలిపాడంటూ పలు పార్టీల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. సంస్కృతీ సంప్రదాయాలకు పెట్టింది పేరుగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ విచ్చలవిడిగా ధన రాజకీయాలకు తెరతీయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఇచ్చి అధికారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలతో పాటు సామాజిక బాధ్యతతో దేశం నుంచి వెలివేయాలని పలువురు కోరుతున్నారు. చంద్రబాబును కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ముడుపులు పట్టిసీమ సొమ్ములే
పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన అవినీతి సొమ్ముతోనే తెలంగాణలో ఎమ్మెల్యేను కొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నించారు. ఇందులో ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హస్తం ఉంది. టీడీపీ సూట్‌కేసుల పార్టీ అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి ఆ డబ్బులు ఎక్కడ నుంచి అందాయన్న విషయాన్ని సీబీఐ నిగ్గు తేల్చాలి. పట్టిసీమ కాంట్రాక్టర్ ఇంటికి హెలికాప్టర్‌లో చంద్రబాబు వెళ్లడాన్ని బట్టే ముడుపుల బంధం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది.
- మల్లాది విష్ణు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు
టీడీపీ ఖరీదైన రాజకీయం చేస్తోంది
రేవంత్‌రెడ్డి లంచం ఇస్తున్న వీడియో ద్వారా స్పష్టం అవుతోంది. దీన్ని ప్రజలు నమ్ముతున్నారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు సంపాదించుకునేందుకు ఒక్క ఓటుకు రూ.5 కోట్లు చొప్పున ఆఫర్ ఉంటే విచిత్రంగా ఉంది. రాజకీయనాయకుల్నే కాకుండా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ఉంది. టీడీపీ ఖరీదైన రాజకీయం చేస్తోంది. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడాలి. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాలి. రేవంత్ రెడ్డి తప్పు చేసినట్లు రుజువైతే చట్టం తన పని తాను చేసుకువెళ్లాలి.
- డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు, బీజేపీ నగర అధ్యక్షుడు
టీడీపీవి అరాచక రాజకీయాలు
టీడీపీ అరాచక రాజకీయాలు చేస్తోంది. ఒక్క ఎమ్మెల్యే ఓటు కోసం రూ.5 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారంటే దోపిడీ సొమ్ము ఆ పార్టీ నేతల వద్ద ఎంత ఉందో అర్థమవుతోంది. చంద్రబాబు తెలంగాణలో కుట్ర రాజకీయాలు చేయడం అనైతికం. రేవంత్ రెడ్డికి ఆ సొమ్ములు ఎక్కడ నుంచి వచ్చాయనే దానిపై సీబీఐ విచారణ నిర్వహించాలి. మహానాడులో నీతులు వల్లించిన చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం హేయం.
- సుంకర పద్మశ్రీ, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు
ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా అమ్మేశారు
చంద్రబాబు మార్కు రాజకీయాలు రేవంత్‌రెడ్డి ఉదంతంతో బట్టబయలయ్యాయి. బాబు పారదర్శకత నేతి బీరకాయలో నేతి చందమే. రెడ్ హ్యాండెండ్‌గా డబ్బులిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దొరికినా ఇంకా టీడీపీ సమర్థించుకోవడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా అమ్మేశారు. ఆ పార్టీకి ఇదేం కొత్త కాదు. మొన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ధనరాజకీయం చేశారు. రేవంత్‌రెడ్డిని ప్రేరేపించిన సూత్రధారిపైనా చర్యలు తీసుకోవాలి. రేవంత్‌రెడ్డి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి. - దోనేపూడి శంకర్, సీపీఐ నగర కార్యదర్శి
నిజం నిప్పులాంటిది
రాజకీయాల్లో నీతి, నిజాయితీతో వ్యవహరిస్తున్నామని ప్రగల్భాలు పలికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిజస్వరూపం రేవంత్‌రెడ్డి వ్యవహారంతో బయటపడింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలుపొందాలనే తాపత్రయంతో రూ.5 కోట్లు ఎరచూపిన రేవంత్‌రెడ్డికి తెరవెనుక ఉన్న పెద్దల బాగోతాన్ని ఏసీబీ బహిర్గతం చేయాలి. అవినీతి, అక్రమాలపై ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ ఇతర పార్టీల నాయకులను చులకన చేసే రేవంత్‌ను కఠినంగా శిక్షిస్తేనే రాజకీయాల్లో మార్పు వస్తుంది.
- రక్షణనిధి, తిరువూరు ఎమ్మెల్యే
బాబు స్వార్థ రాజకీయాలకు రేవంత్ బలి
తెలంగాణలో టీడీపీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు రేవంత్‌రెడ్డి పావుగా మారాడు. మంచి వాగ్ధాటి ఉన్న రేవంత్‌రెడ్డి రాజకీయం జీవితం నాశనమైంది. ఇటువంటి రాజకీయాలు చంద్రబాబు మొదటి నుంచి చేస్తున్నారు. రేవంత్‌లాంటి వాళ్లు చాలామంది టీడీపీలో ఉన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచేందుకు ఆనాడే చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆయన చావుకు కారణమయ్యాడు. సింగపూర్ నేతలతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని రాష్ట్రాన్ని వారికి తాకట్టు పెట్టి ఉండవచ్చు.
- బి.అశోక్ కుమార్, లోక్‌సత్తా నగర అధ్యక్షుడు
ఒక్క ఓటుకు ఐదు కోట్లా
తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఒక్క ఓటు కోసం రూ.5 కోట్లకు ఎమ్మెల్యేను కొనుగోలు చేయడం దారుణం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. పార్టీలు, ప్రజాస్వామ్యంపై చర్చ జరగాలి. ఎమ్మెల్యేలు పార్టీలు మారేటప్పుడు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీచేయాలి. అలాగే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేవారిపైనా కఠినమైన ఆంక్షలు ఉండాలి.
- చెన్నుపాటి విద్య, మాజీ ఎంపీ
రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి
ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను డబ్బుతో కొందామనుకుని ఏసీబీకి దొరికిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. గతంలో ఎన్నోసార్లు నీతి వాఖ్యాలు పలికిన రేవంత్‌రెడ్డి ఇపుడు ఎమ్మెల్యేకు డబ్బు ఇస్తూ ఏసీబీ స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పటికైనా చేసిన తప్పునకు ఎమ్మెల్యే పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి. - జేఎస్‌ఆర్ నాయుడు, కాపునాడు రాష్ట్ర కార్యదర్శి
కొనుగోలు రాజకీయాలు
ఎమ్మెల్యే ఓటు కొనుగోలుకు రేవంత్‌రెడ్డిని పురిగొల్పిన సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. చంద్రబాబు మొదట్నుంచి కొనుగోలు రాజకీయాలు చేస్తున్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీకోసం సొంత పార్టీ ఎమ్మెల్యేలనే బాబు కొన్నారు. రేవంత్ స్వయంగా చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు అంగీకరించినందున చంద్రబాబుపై సెక్షన్ 34, 107, 420, 120బి కేసు నమోదు చేసి, ప్రివెన్స్ ఆఫ్ కరప్షన్ సెక్షన్-7 ఎవెట్‌మెంట్ ప్రకారం చర్యలు తీసుకోవాలి.
- పి.గౌతంరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
చంద్రబాబును అరెస్ట్ చేయాలి
నామినేటెడ్ ఎమ్మెల్యేకు కోట్లు ఇవ్వజూపిన ఘటనలో తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి కేవలం పావు మాత్రమే. అసలు సూత్రధారి చంద్రబాబు నాయుడే. ఈ కేసులో బాబును మొదటి నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసి విచారించాలి. దేశ చరిత్రలోనే ఇంతటి నీచ రాజకీయాలకు పాల్పడిన ముఖ్యమంత్రి లేరు. తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకొని మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయాలి. రాష్ట్ర ప్రజల సొమ్ముతో, కాంట్రాక్టర్ల వద్ద నుంచి తీసుకున్న ముడుపులతో తెలంగాణాలో ఎమ్మెల్సీ గెలుపు కోసం అక్కడ ముడుపులు పంచటం అత్యంత దౌర్భాగ్యం.
-జోగి రమేష్ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి
చంద్రబాబు మాటలు నేతిబీర చందం
నీతికి తాను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే చంద్రబాబు జీవితమంతా అవినీతిమయం. ఎన్నికల్లో ఓటర్లకు మభ్యపెట్టడానికి కోట్లు కుమ్మరించే టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ధనప్రవాహం పారించటానికి వెనుకాడదని రేవంత్‌రెడ్డి ఘటనతో నిరూపితమైంది. తన బాస్ చంద్రబాబు ఆదేశాల ప్రకారమే డబ్బులు ఇస్తున్నానని రేవంత్ పేర్కొన్నందున చంద్రబాబును అరెస్టు చేయాలి. నీరు-చెట్టు, పట్టిసీమ ప్రాజెక్ట్ వంటి వాటిలో అవినీతికి పాల్పడుతున్న బాబు మహానాడులో నీతి వ్యాఖ్యలు చెప్పటం హాస్యాస్పదం.
-కొలుసు పార్థసారథి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు
టీడీపీ స్వరూపం బట్టబయలైంది
రేవంత్‌రెడ్డి వ్యవహారంతో తెలుగుదేశం పార్టీ స్వరూపం బట్టబయలైంది. పెద్దల సభకు పంపించే నేతల ఎన్నికల అంశంలో టీడీపీ ఈ విధంగా వ్యవహరించడం అత్యంత నీచమైన పరిణామం. జాతీయ మీడియానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మీడియా రేవంత్‌రెడ్డి వ్యవహారాన్ని, తెలుగుదేశం పార్టీ తీరును ఎండగడుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా ఖూనీ చేసిన తెలుగుదేశం పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం.
- జలీల్‌ఖాన్, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే
చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలి
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనే డబ్బులు కుమ్మరించటం చూశాం. ఈ ఘటనతో చట్టసభల్లో సీట్లను కూడా కోట్లు కుమ్మరించి కొనుగోలు చేస్తున్నారు. ఇది రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోతుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణలు అవసరం.
- సీహెచ్ బాబురావు, సీపీఎం నగర కార్యదర్శి
రేవంత్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి
ఒక ఓటు కోసం రూ.5 కోట్లు ఇచ్చి ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన రేవంత్‌రెడ్డి వ్యవహారం ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాలకు మాయని మచ్చ తెచ్చింది. ఇలాంటి వ్యక్తిని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలి. స్టీఫెన్‌సన్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అయినందునే రేవంత్‌రెడ్డి బండారం బయటపడింది. ప్రజాప్రతినిధులకు ఉన్న విలువను నీచంగా దిగజార్చిన రేవంత్‌రెడ్డి స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిది.
- మేకా ప్రతాప్ అప్పారావు, నూజివీడు ఎమ్మెల్యే