ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శుక్రవారం జరిగిన టీటీడీపీ భేటీలో రేవంత్ రెడ్డి, ఇతర నేతలు
సాక్షి, వెబ్ ప్రత్యేకం : తెలంగాణ తెలుగుదేశంలో కీలక నేతగా కొనసాగుతూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహిత వ్యవహరిస్తూ వచ్చిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి పార్టీపై ధిక్కార స్వరం వినిపించడానికి కారణాలేంటి? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారు? రాజకీయంగా దెబ్బతీయాలన్న కుట్ర జరిగిందా? రేవంత్ ను టీటీడీపీ నుంచి పంపించివేయడానికే ఇదంతా ఒక పథకం ప్రకారం సాగుతోందా? లేదంటే పైస్థాయిలో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం తెలంగాణలో టీడీపీని ఖాళీ చేయించడానికి ఆ పార్టీ నాయకత్వమే పథకం ప్రకారం నడుచుకుంటుందా? తెలంగాణ టీడీపీలో ప్రస్తుతం శరవేగంగా మారుతున్న పరిణామాలు రాజకీయవర్గాల్లో తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి నేరుగా పంపించలేక ఆయన వెనుక పొగబెట్టారన్న వాదన హాట్ టాపిగ్‌గా మారింది. జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు ఊతమిస్తున్నాయి కూడా.
ఓటుకు నోట్లు కేసు బయటకు రాకముందు తెలంగాణ సీఎం కేసీఆర్ పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా ఘాటుగా విమర్శలు చేసేవారు. అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అయితే, ఎప్పుడైతే ఓటుకు నోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు తగ్గించారు. రెండుమూడు సందర్భాల్లో పరస్పరం కలుసుకున్నప్పుడు కూడా వారిద్దరిమధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని వార్తలొచ్చాయి. అయితే, కేసీఆర్ పెట్టిన షరతుల్లో భాగంగానే హైదరాబాద్‌పై పదేళ్ల హక్కును కూడా కాదనుకుని చంద్రబాబు తన నివాసాన్ని, సచివాలయాన్ని అమరావతికి మార్చారు. 2014 లో తిరిగి అధికారం చేపట్టిన తర్వాత ఏపీకి రాజధాని లేని పరిస్థితుల్లో పదేళ్ల పాటు హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన చేసుకోవచ్చని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. అందుకు అనుగుణంగానే హైదరాబాద్ నుంచి పరిపాలన సాగించడానికి వీలుగా దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి సచివాలయంలో అన్ని ఏర్పాట్లు చేయించుకున్నారు. కానీ ఓటుకు నోట్లు కేసు బయటకు పొక్కిన నేపథ్యంలో ఆ సౌకర్యాలను ఏమాత్రం ఉపయోగించుకోకుండానే చంద్రబాబు బిచాణా ఎత్తేశారు. ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సచివాలయంలోని కార్యాలయాలన్నీ ఖాళీ చేసి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అడిగిన వెంటనే చంద్రబాబు స్పందించి వాటిని అప్పగించడానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు.
ఇకపోతే, ఓటుకు కోట్లు కేసు బయటపడిన సమయంలో... చంద్రబాబు ఈ కేసులో గొంతు వరకు కూరుకుపోయారని, అందులోంచి బయటపడటం ఆయన తరం కాదని కేసీఆర్ నొక్కి చెప్పారు. అయితే ఆ తర్వాత కాలంలో కేసుకు సంబంధించి దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. ఆ కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని పలుసార్లు అసెంబ్లీ నుంచి కూడా బహిష్కరించారు. ఇవన్నీ ఒకవైపు జరుగుతున్న తరుణంలో టీడీపీ రాజకీయ పరిణామాలలో వేగంగా మార్పు కనిపించింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పొత్తు వాదన తెరమీదకొచ్చింది. అది కూడా చంద్రబాబు నాయుడు నుంచి స్పష్టమైన సంకేతాలు అందిన తర్వాతే తెలంగాణ టీడీపీ నేతలు టీఆర్ఎస్ విషయంలో తమ బాణీ మార్చారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ తో పొత్తుకు మార్గం సుగమం చేయడానికి వీలుగా అన్నట్లు రాజకీయ కదలికలు మొదలయ్యాయి. పొత్తు అంశంపై ఇరు పక్షాలకు చెందిన కొందరు కీలక నేతల మధ్య సంప్రదింపులు జరిగినట్టు కూడా వార్తలొచ్చాయి. ఈ పరిణామాలు రుచించని రేవంత్ రెడ్డి తనదైన రీతిలో కేసీఆర్ పైన ప్రభుత్వంపైన విమర్శలను కొనసాగిస్తూనే వచ్చారు. టీఆర్ఎస్ తో పొత్తేంటని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఇంటికి కూడా రానివ్వరంటూ రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని బాహాటంగానే వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ తో పొత్తు విషయంలో రేవంత్ నుంచి ఇలాంటి ప్రతిఘటన ఎదురుకావడం పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోయింది. తెలంగాణలో టీడీపీకి కొంత ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ పార్టీని బలోపేతం చేసే చర్యలేవీ చంద్రబాబు చేపట్టలేదన్న వాదన ఆ పార్టీ నేతల్లో ఉంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం లేదా తెలంగాణలో పార్టీని పూర్తిగా వదులుకోవడం... ఈ రెండు అంశాలకు అనుగుణంగానే చంద్రబాబు చర్యలు మొదలయ్యాయని పరిణామాలు గమనిస్తున్న రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. అందుకు రాజకీయ ఒత్తిళ్లు కావొచ్చు లేదా కేసుల వంటి వ్యక్తిగత అంశాలైనా కావొచ్చని చెబుతున్నారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తూ వచ్చారు. తెలంగాణలో టీడీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంపై ఆ తర్వాత కాలంలో చంద్రబాబు స్పందించడం మానేశారు. ఓటుకు కోట్ల కేసులో ఉన్న రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య మినహా మిగతా టీడీపీ ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ లో చేరిపోయారు. పార్టీ ఫిరాయించిన వారిపై తొలుత ఫిర్యాదులు చేస్తూ కొంత మాట్లాడినప్పటికీ ఆ తర్వాత వాటిని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. పైపెచ్చు అలా ఫిరాయించిన నేతలతోనే రాజకీయ పొత్తుల విషయం చర్చలు జరపడం గమనార్హం. ఆ రకంగా తెలంగాణలో ఒకవైపు నేతలను వదులుకుంటూ మరోవైపు పార్టీని బలహీన పరుస్తున్న నేపథ్యం రేవంత్ రెడ్డికి ఏమాత్రం మింగుడు పడనిదిగా మారింది. పైపెచ్చు తెలంగాణలో కేసులతో సతమతమవుతుంటే ఏపీలోనూ వియ్యంకుడి వ్యాపారాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం కూడా రేవంత్ గళం విప్పడానికి కారణమయ్యాయని అంటున్నారు. ఈ పరిణామాలను బాగా విశ్లేషించుకున్న తర్వాత కథ క్లైమాక్స్ కు చేరుతుందని గమనించే రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ పరిణామాలు ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతంలో రేవంత్ రెడ్డి వియ్యంకుడి వ్యాపారాలను దెబ్బతీసే ప్రయత్నాలు కూడా జరిగాయని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వియ్యంకుడు, ఆయన బంధువులకు సంబంధించిన సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. వారి కంపెనీలకు సంబంధించిన పీఎఫ్ ఖాతాలపైనా అధికారులు సోదాలు నిర్వహించి తనిఖీలు జరిపారని చెబుతున్నారు. ఈ చర్య యాధృచ్చికంగా జరిగిందా? లేక రాజకీయ ఒత్తిళ్లతో జరిగిందా? అన్నది తేలనప్పటికీ ఒక పథకం ప్రకారమే ఈ దాడులు జరిగాయన్న అభిప్రాయం రేవంత్ రెడ్డి వర్గీయుల్లో బలంగా నాటుకుపోయింది. ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రాలోనూ కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారన్న అంశాలు కూడా రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే ప్రయత్నంగానే చోటుచేసుకున్నాయని, రాజకీయంగా రేవంత్ రెడ్డిని సొంత పార్టీ నేతలే దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మౌనం వీడకతప్పలేదన్న వాదన ఆయన సన్నిహితుల్లో వ్యక్తమవుతోంది.
శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జరిగిన టీటీడీపీ నేతల భేటీలోనూ ఇందుకు సంబంధించి రేవంత్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించి నేతలను నిలదీసినట్టు తెలిసింది. అలాంటివేమైనా ఉంటే అధినేతతో మాట్లాడాలే తప్ప బహిరంగ విమర్శలు ఎలా చేస్తావని సమావేశంలో ఒక నాయకుడు ప్రశ్నించగా, అధినేతతోనే తేల్చుకుంటానని రేవంత్ స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment