TTDP Leaders
-
‘తెలంగాణ’ ఏర్పాటులో టీడీపీది కీలకపాత్ర: కాసాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సరికొత్త చరిత్ర అని, అందులో తెలుగుదేశం పార్టీ పోషించిన పాత్ర కీలకమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. టీటీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జెండాను ఆవిష్కరించిన కాసాని మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణకు అనుకూలంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ ఇవ్వడం వల్లనే కొత్త రాష్ట్రం కల నెరవేరిందన్నారు. -
టీటీడీపీ దుకాణం.. ఉమ్మడి నల్లగొండలో బంద్!
సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ తెలుగుదేశం (టీటీడీపీ) దుకాణం మూతపడనుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జులంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. దీంతో ఇక ఆ పార్టీకి సాధారణ కార్యకర్త కూడా కరువయ్యే దుస్థితి నెలకొంది. 2014 ఎన్నికల నాటినుంచి ఆ పార్టీ రోజు రోజుకూ దిగజారుతూ వస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను ఒక్క చోట కూడా పోటీ చేయలేక పోయింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో సరే సరి. ఇక, పంచాయతీ రాజ్ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో, పార్టీ రహితంగా జరిగిన గ్రామ పంచాయతీల ఎన్నికల్లో .. ఇలా ఏ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఉనికిని కాపాడుకోలేకపోయింది. బోర్డు తిప్పేయడమేనా..? జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతూ వస్తోంది. ఇన్నాళ్లూ ఆ పార్టీ జిల్లా నాయకులు ఊగిసలాటలో ఉన్నారు. గడిచిన ఐదేళ్లుగా ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలకు ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఆ వెంటనే 2014లో జరిగిన ఎన్నికల తర్వాత ఆ పార్టీ మరింత అయోమయంగా తయారైంది. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఉమ్మడి జిల్లాలోని పన్నెండు స్థానాల్లో ఒక్క చోట కూడా పోటీ చేయలేక పోయింది. కోదాడ నుంచి టికెట్ ఆశించి భంగపడిన బొల్లం మల్లయ్య యాదవ్ చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేరి విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ నాయకురాలు పాల్వాయి రజినీకుమారి టికెట్ ఆశించి భంగపడ్డారు. నల్లగొండ నుంచి మాదగోని శ్రీనివాస్‌గౌడ్ సైతం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నా పొత్తులు దెబ్బకొట్టాయి. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నాయకుడికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కలేదు. ఈ పరిణామంతో పార్టీ శ్రేణులు పూర్తిగా నిరాశలో కూరుకుపోయాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే నల్లగొండ టీడీపీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఇలా గడిచిన ఐదేళ్లుగా ఆ పార్టీనుంచి ఒక్కొక్కరు జారిపోయారు. ప్రస్తుతం మిగిలి ఉన్న నాయకులంతా మూకుమ్మడిగా బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన బండ్రు శోభారాణి, నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి కడారి అంజయ్యతోపాటు, పాల్వాయి రజినీ కుమారి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు బీజేపీలో చేరే నాయకుల జాబితాలో ఉన్నారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా నేతృత్వంలో హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో వీరు ఆ పార్టీలో చేరనున్నట్లు చెబుతున్నారు. లేరు నియోజకవర్గానికే చెందిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరడం ఖాయమై పోయింది. అయితే, ఉమ్మడి జిల్లా నేతలతో కాకుండా ఆయన ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమలం కండువా కప్పుకుంటారని పేర్కొంటున్నారు. మొత్తంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరడమే మిగిలి ఉందని అంటున్నారు. ఇదే జరిగితే.. జిల్లాలో ఇక టీడీపీ దుకాణానికి తాళం పడినట్టేనని, ఆ పార్టీ బోర్డు తిప్పేసినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పొమ్మనలేక రేవంత్‌కు పొగబెట్టారా?
సాక్షి, వెబ్ ప్రత్యేకం : తెలంగాణ తెలుగుదేశంలో కీలక నేతగా కొనసాగుతూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహిత వ్యవహరిస్తూ వచ్చిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి పార్టీపై ధిక్కార స్వరం వినిపించడానికి కారణాలేంటి? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారు? రాజకీయంగా దెబ్బతీయాలన్న కుట్ర జరిగిందా? రేవంత్ ను టీటీడీపీ నుంచి పంపించివేయడానికే ఇదంతా ఒక పథకం ప్రకారం సాగుతోందా? లేదంటే పైస్థాయిలో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం తెలంగాణలో టీడీపీని ఖాళీ చేయించడానికి ఆ పార్టీ నాయకత్వమే పథకం ప్రకారం నడుచుకుంటుందా? తెలంగాణ టీడీపీలో ప్రస్తుతం శరవేగంగా మారుతున్న పరిణామాలు రాజకీయవర్గాల్లో తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి నేరుగా పంపించలేక ఆయన వెనుక పొగబెట్టారన్న వాదన హాట్ టాపిగ్గా మారింది. జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు ఊతమిస్తున్నాయి కూడా. ఓటుకు నోట్లు కేసు బయటకు రాకముందు తెలంగాణ సీఎం కేసీఆర్ పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా ఘాటుగా విమర్శలు చేసేవారు. అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అయితే, ఎప్పుడైతే ఓటుకు నోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు తగ్గించారు. రెండుమూడు సందర్భాల్లో పరస్పరం కలుసుకున్నప్పుడు కూడా వారిద్దరిమధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని వార్తలొచ్చాయి. అయితే, కేసీఆర్ పెట్టిన షరతుల్లో భాగంగానే హైదరాబాద్‌పై పదేళ్ల హక్కును కూడా కాదనుకుని చంద్రబాబు తన నివాసాన్ని, సచివాలయాన్ని అమరావతికి మార్చారు. 2014 లో తిరిగి అధికారం చేపట్టిన తర్వాత ఏపీకి రాజధాని లేని పరిస్థితుల్లో పదేళ్ల పాటు హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన చేసుకోవచ్చని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. అందుకు అనుగుణంగానే హైదరాబాద్ నుంచి పరిపాలన సాగించడానికి వీలుగా దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి సచివాలయంలో అన్ని ఏర్పాట్లు చేయించుకున్నారు. కానీ ఓటుకు నోట్లు కేసు బయటకు పొక్కిన నేపథ్యంలో ఆ సౌకర్యాలను ఏమాత్రం ఉపయోగించుకోకుండానే చంద్రబాబు బిచాణా ఎత్తేశారు. ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సచివాలయంలోని కార్యాలయాలన్నీ ఖాళీ చేసి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అడిగిన వెంటనే చంద్రబాబు స్పందించి వాటిని అప్పగించడానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఇకపోతే, ఓటుకు కోట్లు కేసు బయటపడిన సమయంలో... చంద్రబాబు ఈ కేసులో గొంతు వరకు కూరుకుపోయారని, అందులోంచి బయటపడటం ఆయన తరం కాదని కేసీఆర్ నొక్కి చెప్పారు. అయితే ఆ తర్వాత కాలంలో కేసుకు సంబంధించి దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. ఆ కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని పలుసార్లు అసెంబ్లీ నుంచి కూడా బహిష్కరించారు. ఇవన్నీ ఒకవైపు జరుగుతున్న తరుణంలో టీడీపీ రాజకీయ పరిణామాలలో వేగంగా మార్పు కనిపించింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పొత్తు వాదన తెరమీదకొచ్చింది. అది కూడా చంద్రబాబు నాయుడు నుంచి స్పష్టమైన సంకేతాలు అందిన తర్వాతే తెలంగాణ టీడీపీ నేతలు టీఆర్ఎస్ విషయంలో తమ బాణీ మార్చారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ తో పొత్తుకు మార్గం సుగమం చేయడానికి వీలుగా అన్నట్లు రాజకీయ కదలికలు మొదలయ్యాయి. పొత్తు అంశంపై ఇరు పక్షాలకు చెందిన కొందరు కీలక నేతల మధ్య సంప్రదింపులు జరిగినట్టు కూడా వార్తలొచ్చాయి. ఈ పరిణామాలు రుచించని రేవంత్ రెడ్డి తనదైన రీతిలో కేసీఆర్ పైన ప్రభుత్వంపైన విమర్శలను కొనసాగిస్తూనే వచ్చారు. టీఆర్ఎస్ తో పొత్తేంటని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఇంటికి కూడా రానివ్వరంటూ రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని బాహాటంగానే వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తో పొత్తు విషయంలో రేవంత్ నుంచి ఇలాంటి ప్రతిఘటన ఎదురుకావడం పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోయింది. తెలంగాణలో టీడీపీకి కొంత ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ పార్టీని బలోపేతం చేసే చర్యలేవీ చంద్రబాబు చేపట్టలేదన్న వాదన ఆ పార్టీ నేతల్లో ఉంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం లేదా తెలంగాణలో పార్టీని పూర్తిగా వదులుకోవడం... ఈ రెండు అంశాలకు అనుగుణంగానే చంద్రబాబు చర్యలు మొదలయ్యాయని పరిణామాలు గమనిస్తున్న రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. అందుకు రాజకీయ ఒత్తిళ్లు కావొచ్చు లేదా కేసుల వంటి వ్యక్తిగత అంశాలైనా కావొచ్చని చెబుతున్నారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తూ వచ్చారు. తెలంగాణలో టీడీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంపై ఆ తర్వాత కాలంలో చంద్రబాబు స్పందించడం మానేశారు. ఓటుకు కోట్ల కేసులో ఉన్న రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య మినహా మిగతా టీడీపీ ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ లో చేరిపోయారు. పార్టీ ఫిరాయించిన వారిపై తొలుత ఫిర్యాదులు చేస్తూ కొంత మాట్లాడినప్పటికీ ఆ తర్వాత వాటిని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. పైపెచ్చు అలా ఫిరాయించిన నేతలతోనే రాజకీయ పొత్తుల విషయం చర్చలు జరపడం గమనార్హం. ఆ రకంగా తెలంగాణలో ఒకవైపు నేతలను వదులుకుంటూ మరోవైపు పార్టీని బలహీన పరుస్తున్న నేపథ్యం రేవంత్ రెడ్డికి ఏమాత్రం మింగుడు పడనిదిగా మారింది. పైపెచ్చు తెలంగాణలో కేసులతో సతమతమవుతుంటే ఏపీలోనూ వియ్యంకుడి వ్యాపారాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం కూడా రేవంత్ గళం విప్పడానికి కారణమయ్యాయని అంటున్నారు. ఈ పరిణామాలను బాగా విశ్లేషించుకున్న తర్వాత కథ క్లైమాక్స్ కు చేరుతుందని గమనించే రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతంలో రేవంత్ రెడ్డి వియ్యంకుడి వ్యాపారాలను దెబ్బతీసే ప్రయత్నాలు కూడా జరిగాయని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వియ్యంకుడు, ఆయన బంధువులకు సంబంధించిన సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. వారి కంపెనీలకు సంబంధించిన పీఎఫ్ ఖాతాలపైనా అధికారులు సోదాలు నిర్వహించి తనిఖీలు జరిపారని చెబుతున్నారు. ఈ చర్య యాధృచ్చికంగా జరిగిందా? లేక రాజకీయ ఒత్తిళ్లతో జరిగిందా? అన్నది తేలనప్పటికీ ఒక పథకం ప్రకారమే ఈ దాడులు జరిగాయన్న అభిప్రాయం రేవంత్ రెడ్డి వర్గీయుల్లో బలంగా నాటుకుపోయింది. ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రాలోనూ కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారన్న అంశాలు కూడా రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే ప్రయత్నంగానే చోటుచేసుకున్నాయని, రాజకీయంగా రేవంత్ రెడ్డిని సొంత పార్టీ నేతలే దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మౌనం వీడకతప్పలేదన్న వాదన ఆయన సన్నిహితుల్లో వ్యక్తమవుతోంది. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జరిగిన టీటీడీపీ నేతల భేటీలోనూ ఇందుకు సంబంధించి రేవంత్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించి నేతలను నిలదీసినట్టు తెలిసింది. అలాంటివేమైనా ఉంటే అధినేతతో మాట్లాడాలే తప్ప బహిరంగ విమర్శలు ఎలా చేస్తావని సమావేశంలో ఒక నాయకుడు ప్రశ్నించగా, అధినేతతోనే తేల్చుకుంటానని రేవంత్ స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
రేవంత్ ఎఫెక్ట్.. టీటీడీపీ కీలక సమావేశం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్‌తో ఆ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ పార్టీ మారడంపై వస్తున్న వదంతులపై చర్చించేందుకు సమావేశం కావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం టీటీడీపీ పొలిట్‌బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు ఇంకా ఎవరైనా పార్టీని వీడనున్నారా అనే దానిపై ముఖ్యంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. మరోవైపు బుధవారం రేవంత్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడటం, ఏపీ మంత్రులు, నాయకులపై విమర్శలు చేయడం వంటి అంశాలను పరిశీలిస్తే.. ఆయన కాంగ్రెస్‌కు చేరువ కావడానికి మానసికంగా సిద్ధమైనట్లు కనిపిస్తోంది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న వివరాల ప్రకారం కనీసం 16 జిల్లాల టీడీపీ అధ్యక్షులు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు కూడా అదే బాటలో ఉన్నారని తెలిసింది. భూపాలపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, వికారాబాద్, మేడ్చల్, సూర్యాపేట జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ కేడర్ మారే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే దాదాపు తెలంగాణ టీడీపీ ఖాళీ అయినట్లే అని బలమైన అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేత మోత్కుపల్లి వంటి నేతలే పార్టీలో మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి. రేవంత్‌ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా చేయాలని పార్టీ శ్రేణులు చెప్పినా చంద్రబాబు ఎల్.రమణనే అధ్యక్షుడిగా ప్రకటించడంతో పార్టీలో ఆధిపత్య పోరు మొదలైంది. ఆపై పార్టీలో ఎన్నో రాజకీయ సమీకరణాలు మారడంతో చివరకు టీటీడీపీనే ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుందేమోనని పార్టీ అధిష్టానంలో కలవరం మొదలైంది. -
సీఎం వాగ్దానం ఏమైంది?: టీటీడీపీ
సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని వందరోజుల్లో తెరిచి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం ఇంత వరకు ఎందుకు అమలుకాలేదో ఎంపీ కవిత సమాధానం చెప్పాలని టీటీడీపీ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం టీటీడీపీ నాయకులు అరికెల నర్సారెడ్డి, అమర్‌నాథ్‌బాబు, ఒంటేరు ప్రతాపరెడ్డి, రాజారాంయాదవ్ విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో నిజాం షుగర్స్‌ను విక్రయానికి పెట్టే దుస్థితి ఏర్పడిందన్నా రు. ఈ ఫ్యాక్టరీ ప్రస్తుత దుస్థితికి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావులే బాధ్యులన్నారు. త్వరలో నిజాం షుగర్స్ అంశంపై ధర్నాను నిర్వహిస్తామని, దానికి నిజామాబాద్ ఎంపీ కవిత హాజరుకావాలని వారు డిమాండ్ చేశారు. నిజాం షుగర్స్ కోసం ఈ నెలాఖరులోగా రూ.400 కోట్లు విడుదల చేయాలని..లేకుంటే పదివేల మంది రైతులతో చక్కెర ఫ్యాక్టరీలను ముట్టడిస్తామని హెచ్చరించారు.