సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని వందరోజుల్లో తెరిచి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం ఇంత వరకు ఎందుకు అమలుకాలేదో ఎంపీ కవిత సమాధానం చెప్పాలని టీటీడీపీ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం టీటీడీపీ నాయకులు అరికెల నర్సారెడ్డి, అమర్‌నాథ్‌బాబు, ఒంటేరు ప్రతాపరెడ్డి, రాజారాంయాదవ్ విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పాలనలో నిజాం షుగర్స్‌ను విక్రయానికి పెట్టే దుస్థితి ఏర్పడిందన్నా రు. ఈ ఫ్యాక్టరీ ప్రస్తుత దుస్థితికి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావులే బాధ్యులన్నారు. త్వరలో నిజాం షుగర్స్ అంశంపై ధర్నాను నిర్వహిస్తామని, దానికి నిజామాబాద్ ఎంపీ కవిత హాజరుకావాలని వారు డిమాండ్ చేశారు. నిజాం షుగర్స్ కోసం ఈ నెలాఖరులోగా రూ.400 కోట్లు విడుదల చేయాలని..లేకుంటే పదివేల మంది రైతులతో చక్కెర ఫ్యాక్టరీలను ముట్టడిస్తామని హెచ్చరించారు.