టీటీడీపీ దుకాణం.. ఉమ్మడి నల్లగొండలో బంద్‌! | Telangana TDP Leaders Make A Beeline To Join BJP In Nalgonda District | Sakshi
Sakshi News home page

టీటీడీపీ దుకాణం.. ఉమ్మడి నల్లగొండలో బంద్‌!

Published Thu, Aug 15 2019 9:55 AM | Last Updated on Thu, Aug 15 2019 9:55 AM

Telangana TDP Leaders Make A Beeline To Join BJP In Nalgonda District - Sakshi

రాజీనామా పత్రాన్ని చూపుతున్న టీ.టీడీపీ నాయకులు పాల్వాయి, మాదగోని తదితరులు

సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ తెలుగుదేశం (టీటీడీపీ) దుకాణం మూతపడనుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జులంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. దీంతో ఇక ఆ పార్టీకి సాధారణ కార్యకర్త కూడా కరువయ్యే దుస్థితి నెలకొంది. 2014 ఎన్నికల నాటినుంచి ఆ పార్టీ రోజు రోజుకూ దిగజారుతూ వస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను ఒక్క చోట కూడా పోటీ చేయలేక పోయింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో సరే సరి. ఇక, పంచాయతీ రాజ్‌ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో, పార్టీ రహితంగా జరిగిన గ్రామ పంచాయతీల ఎన్నికల్లో .. ఇలా ఏ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఉనికిని కాపాడుకోలేకపోయింది. 

బోర్డు తిప్పేయడమేనా..?
జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతూ వస్తోంది. ఇన్నాళ్లూ ఆ పార్టీ జిల్లా నాయకులు ఊగిసలాటలో ఉన్నారు. గడిచిన ఐదేళ్లుగా ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలకు ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఆ వెంటనే  2014లో జరిగిన ఎన్నికల తర్వాత ఆ పార్టీ మరింత అయోమయంగా తయారైంది. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఉమ్మడి జిల్లాలోని పన్నెండు స్థానాల్లో ఒక్క చోట కూడా పోటీ చేయలేక పోయింది.

కోదాడ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన బొల్లం మల్లయ్య యాదవ్‌ చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌లో చేరి విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ నాయకురాలు పాల్వాయి రజినీకుమారి టికెట్‌ ఆశించి భంగపడ్డారు. నల్లగొండ నుంచి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ సైతం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నా పొత్తులు దెబ్బకొట్టాయి. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నాయకుడికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కలేదు. ఈ పరిణామంతో పార్టీ శ్రేణులు పూర్తిగా నిరాశలో కూరుకుపోయాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే నల్లగొండ టీడీపీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఇలా గడిచిన ఐదేళ్లుగా ఆ పార్టీనుంచి ఒక్కొక్కరు జారిపోయారు. ప్రస్తుతం మిగిలి ఉన్న నాయకులంతా మూకుమ్మడిగా బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన బండ్రు శోభారాణి, నాగార్జున సాగర్‌ నియోజకవర్గం నుంచి కడారి అంజయ్యతోపాటు, పాల్వాయి రజినీ కుమారి, శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు బీజేపీలో చేరే నాయకుల జాబితాలో ఉన్నారు. బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా నేతృత్వంలో హైదరాబాద్‌ నాంపల్లి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో వీరు ఆ పార్టీలో చేరనున్నట్లు చెబుతున్నారు.

లేరు నియోజకవర్గానికే చెందిన మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరడం ఖాయమై పోయింది. అయితే, ఉమ్మడి జిల్లా నేతలతో కాకుండా ఆయన ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో కమలం కండువా కప్పుకుంటారని పేర్కొంటున్నారు. మొత్తంగా  ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరడమే మిగిలి ఉందని అంటున్నారు. ఇదే జరిగితే.. జిల్లాలో ఇక టీడీపీ దుకాణానికి తాళం పడినట్టేనని, ఆ పార్టీ బోర్డు తిప్పేసినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement