BJP Membership program
-
టీఆర్ఎస్ను భూస్థాపితం చేసేందుకే బీజేపీలో చేరిక
సాక్షి, నల్లగొండ: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసేందుకే బీజేపీలో చేరుతున్నట్లు టీడీపీ నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి పాల్వాయి రజినీ కుమారి పేర్కొన్నారు. బుధవారం స్థానికంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటులో దొరల పెత్తనం లేని రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్నప్పటికీ సీఎం కేసీఆర్ దొర పెత్తనంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. ఈనెల 18న హైదరాబాద్‌లో జరిగే బీజేపీ సభలో బీజేపీ అగ్రనేతలు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా, డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నియోజకవర్గ ఇన్చార్జిలంతా బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నారు. బీజేపీ, ప్రధాని మోడీ చేపడుతున్న అభివృద్ధిని చూసి దేశ వ్యాప్తంగా ప్రజలు మరోసారి ఆదరించి 330 స్థానాలు అప్పగించారన్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ వస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల తరపున తగిన గుణపాఠం చెప్తామన్నారు. టీడీపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జి మాదగోని శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని ఆంధ్రాపార్టీగా ముద్ర వేశారని, తిప్పి కొట్టడంలో నాయకత్వం విఫలమైందన్నారు. అనంతరం రాజీనామా లేఖలను విడుదల చేశారు. ఈ సమావేశంలో సాగర్, దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జి కడారి అంజయ్య, మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జి సాధినేని శ్రీనివాస్‌రావు, ఎస్టీ సెల్‌రాష్ట్ర నాయకులు బాబూరావు, వెంకటేశ్వర్రావు, పోలె రామచంద్రం, ఐతరాజు మల్లేశ్ పాల్గొన్నారు. -
టీటీడీపీ దుకాణం.. ఉమ్మడి నల్లగొండలో బంద్!
సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ తెలుగుదేశం (టీటీడీపీ) దుకాణం మూతపడనుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జులంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. దీంతో ఇక ఆ పార్టీకి సాధారణ కార్యకర్త కూడా కరువయ్యే దుస్థితి నెలకొంది. 2014 ఎన్నికల నాటినుంచి ఆ పార్టీ రోజు రోజుకూ దిగజారుతూ వస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను ఒక్క చోట కూడా పోటీ చేయలేక పోయింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో సరే సరి. ఇక, పంచాయతీ రాజ్ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో, పార్టీ రహితంగా జరిగిన గ్రామ పంచాయతీల ఎన్నికల్లో .. ఇలా ఏ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఉనికిని కాపాడుకోలేకపోయింది. బోర్డు తిప్పేయడమేనా..? జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతూ వస్తోంది. ఇన్నాళ్లూ ఆ పార్టీ జిల్లా నాయకులు ఊగిసలాటలో ఉన్నారు. గడిచిన ఐదేళ్లుగా ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలకు ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఆ వెంటనే 2014లో జరిగిన ఎన్నికల తర్వాత ఆ పార్టీ మరింత అయోమయంగా తయారైంది. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఉమ్మడి జిల్లాలోని పన్నెండు స్థానాల్లో ఒక్క చోట కూడా పోటీ చేయలేక పోయింది. కోదాడ నుంచి టికెట్ ఆశించి భంగపడిన బొల్లం మల్లయ్య యాదవ్ చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేరి విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ నాయకురాలు పాల్వాయి రజినీకుమారి టికెట్ ఆశించి భంగపడ్డారు. నల్లగొండ నుంచి మాదగోని శ్రీనివాస్‌గౌడ్ సైతం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నా పొత్తులు దెబ్బకొట్టాయి. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నాయకుడికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కలేదు. ఈ పరిణామంతో పార్టీ శ్రేణులు పూర్తిగా నిరాశలో కూరుకుపోయాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే నల్లగొండ టీడీపీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఇలా గడిచిన ఐదేళ్లుగా ఆ పార్టీనుంచి ఒక్కొక్కరు జారిపోయారు. ప్రస్తుతం మిగిలి ఉన్న నాయకులంతా మూకుమ్మడిగా బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన బండ్రు శోభారాణి, నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి కడారి అంజయ్యతోపాటు, పాల్వాయి రజినీ కుమారి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు బీజేపీలో చేరే నాయకుల జాబితాలో ఉన్నారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా నేతృత్వంలో హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో వీరు ఆ పార్టీలో చేరనున్నట్లు చెబుతున్నారు. లేరు నియోజకవర్గానికే చెందిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరడం ఖాయమై పోయింది. అయితే, ఉమ్మడి జిల్లా నేతలతో కాకుండా ఆయన ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమలం కండువా కప్పుకుంటారని పేర్కొంటున్నారు. మొత్తంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరడమే మిగిలి ఉందని అంటున్నారు. ఇదే జరిగితే.. జిల్లాలో ఇక టీడీపీ దుకాణానికి తాళం పడినట్టేనని, ఆ పార్టీ బోర్డు తిప్పేసినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఫ్యాక్టరీని విక్రయిస్తే తరిమికొడతాం
రెంజల్(బోధన్): బోధన్‌లోని చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం విక్రయిస్తే తరమికొడతామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ హెచ్చరించారు. రైతులు, కార్మికులతో ప్రతిఘటిస్తామన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదులో భాగంగా రెంజల్ మండలం నీలాక్యాంపులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని సీఎం కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. ‘కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు’ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు ఉందన్నారు. కార్మికుల బకాయిలను చెల్లించి వందలాది మందికి ఉపాధినిస్తున్న ఫ్యాక్టరీని తెరిపించాలన్నారు. రూ.360 కోట్లు చెల్లించిన కేసీఆర్ రూ.500 కోట్లతో అసెంబ్లీ భవన నిర్మాణం చేపట్టడం సిగ్గుచేటన్నారు. జిల్లా కేంద్రంలోని నడిబోడ్డున ఉన్న కలెక్టరేట్‌ను తరలించడంలో అనుమానం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి ఎంపిక చేసిన భూమి విలువ మార్కెట్లో రూ.1.50 లక్షలకు గజం ఉండగా కేవలం రూ.వందకు గజం చొప్పున ధర కట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని దేశం సరిహద్దు, అంతర్గత భద్రత విభాగాల్లో సురక్షితంగా ఉందన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత కాశ్మీర్లో ఉగ్రవాద, తీవ్రవాదం పూర్తిగా తగ్గిందన్నారు. మానవబాంబులను మోదీ నిర్వీర్యం చేశారని ఫలితంగా ప్రపంచ దేశాల్లోని ఎన్ఆర్ఐలకు గౌరవం లభిస్తుందన్నారు. సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది.. సొమ్ము కేంద్రానిదైతే రాష్ట్ర ప్రభుత్వం సోకు చేస్తుందని యెండల ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు 2014–15లో ఒక్కొక్కరికి రూ.350 ఉండగా 2018–19కు రూ. 804కు కేంద్రం పెంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూపాయి కూడా విదల్చడంలేదన్నారు. ఉపాధిహామీ మొదటి విడతలో ఇచ్చిన హామీలు నెరవేరకుండారనే రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎంపీపీ లోలపు రజిని, జెడ్పీటీసీ మేక విజయ, ఎంపీటీసీలు యోగేశ్, గడ్డం స్వప్న, జల్ల రుక్మిణి, అంతయ్య, బీజేపీ నాయకులు సంతోష్, కిషోర్, కోయా సాంబశివరావ్, డాక్టర్ శివప్ప, సుభాష్, భాస్కర్‌రెడ్డి, రాజు, వెంకటేశ్వర్రావ్, రాంచందర్, పోచయ్య, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు. -
పాలమూరుకు కేసీఆర్ చేసింది ఏమీ లేదు
కందనూలు: టీఆర్ఎస్ ఐదేళ్ల పాలనలో ఉమ్మడి పాలమూర్‌కు చేసింది ఏమీలేదని బీజేపీ నాయకుడు, మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా ప్రసిడెంట్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదుకు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఉమ్మడి పాలమూరుకు శిలాఫలకాలు తప్పా, చేసింది శూన్యం అని విమర్శించారు. ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టులను ఆగమేఘాల మీద పూర్తి చేస్తూ, దక్షిణ తెలంగాణను ప్రాజెక్టులను పూర్తి చేయకుండ నియంతలా ప్రవర్థిస్తున్నారని ఆరోపించారు. పాలమూర్ ఎత్తిపోతల పథకం కింద చేపడుతున్న రిజర్వాయర్ ముంపు బాధితులకు న్యాయమైన పరిహారం చెల్లించకుండ, పోలీసులతో హింసించడం ఎంత వరకు సమజసం అన్నారు. మల్లాన్నసాగర్ ప్రజలకు రేట్లు పెంచి పరిహారం రూ.4 లక్షల నుంచి రూ.12లక్షలకు చెల్లిస్తూ ఇక్కడి ప్రజలకు ఎందుకు ద్రోహం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాకు రావల్సిన నీళ్లు రాక పాలమూరు ఆత్మగోశిస్తుందని అన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వం వైపు చూస్తున్నారని, స్వచ్ఛందంగా వచ్చి బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు. అంతకు ముందు బీజేపీ మొదటి సభ్యత్వం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన దళితుడు మీసాల మషన్న ఇంటికి వెళ్లి ఇచ్చారు. ఆనంతరం బస్టాండ్ వద్ద ఇద్దరు ముస్లిం మహిళలకు పార్టీ సభ్యత్వం అందజేశారు. కార్యక్రమంలో కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు సుధాకర్ రావు, దిలీపాచారి, పార్లమెంట్ కన్వీనర్ సుధాకర్ రెడ్డి, నాయకులు పోల్దాస్ రాము, దుర్గాప్రసాద్, శేఖర్ రెడ్డి,కృష్ణగౌడ్,అభిలాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
8 కోట్లు దాటిన బీజేపీ సభ్యత్వం
న్యూఢిల్లీ: తమ పార్టీ సభ్యత్వం ఎనిమిది కోట్లు దాటిందని, త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవిస్తుందని ఆ పార్టీ ప్రకటించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 8.51 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. ఈ నెల 31లోపు ఈ సంఖ్యను దాటి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించాలని బీజేపీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో 8 కోట్ల మైలురాయిని దాటినందుకు కార్యకర్తలకు, సభ్యులకు అభినందనలు తెలిపారు. రాజస్థాన్‌లో 50 లక్షల సభ్యత్వం నమోదయ్యేలా కృషి చేసినందుకు ఆ రాష్ట్ర సీఎం వసుంధర రాజేను కూడా ఆయన అభినందించారు. -
మురికివాడలు, అనధికార కాలనీలపై దృష్టి
త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలదళం ముందుకుసాగుతోంది. ఇందులోభాగంగా విజయాన్ని ప్రభావితం చేసే ఓటుబ్యాంకు ప్రాంతాలైన మురికివాడలు, అనధికార కాలనీల్లో సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టింది. న్యూఢిల్లీ: ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సభ్యత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నగర పరిధిలోని మురికివాడలు, అనధికార కాలనీలపై దృష్టి సారించింది. ఈ రెండు ప్రాంతాల్లో గరిష్టస్థాయిలో సభ్యత్వాలు చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించింది. ఈ విషయమై ఆ పార్టీ నగర శాఖ ఇంచార్జి ప్రభాత్ ఝా మాట్లాడుతూ ‘బీజేపీలో మమేకం కావాలని సమాజంలోని అన్నివర్గాలకు చెందిన ప్రజలను కోరుతున్నాం. జుగ్గీజోపిడీ క్లస్టర్లు, మురికివాడలతోపాటు అనధికార కాలనీల్లో జోరుగా సభ్యత్వం చేయించాలని మా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించాం. గత కొద్ది నెలలుగా తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను కూడా వారికి వివరించాలని సూచించాం. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీనాటికి మొత్తం 15 లక్షలమందిని సభ్యులుగా చేర్చుకోవాలనేది మా లక్ష్యం’అని అన్నారు. కార్యకర్తలు, నాయకులకు ప్రోత్సాహకాలు వందకుపైగా సభ్యులను చేర్చినవారికి బీజేపీ అధిష్టానం కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించింది. వందమంది సభ్యులను చేర్చినవారిని చురుకైన కార్యకర్తల జాబితాలో చేర్చనుంది. వీరికి తగిన గుర్తింపు కూడా ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీకి చెందిన మరో నాయకుడు తెలియజేశారు. ‘వందకుపైగా సభ్యత్వాలు చేయించినవారికి చురుకైన కార్యకర్తలుగా గుర్తిస్తాం. ఇది వారికి ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది. ఇందువల్ల మిగతా కార్యకర్తలు స్ఫూర్తి పొందుతారు. మరింతమందిని సభ్యులుగా చేర్పించేందుకు యత్నిస్తారు’అని అన్నారు. అత్యధిక శాతంమంది వలసకూలీలే కాగా మురికివాడలు, అనధికార కాలనీల్లో నివసించేవారిలో అత్యధిక శాతం మంది వలస కూలీలే. వీరి ఆదాయం అంతంతగానే ఉంటుంది. ఇటువంటివారితో ‘జన్ ధన్’ బ్యాంకు ఖాతాలను తెరిపించాలని బీజేపీ బావిస్తోంది. ఇదే విషయమై ఆ పార్టీ కార్యకర్త ఒకరు మాట్లాడుతూ ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన జన్ ధన్’ బ్యాంకు ఖాతావల్ల ఎంతో లబ్ధి కలుగుతుంది. వారికి బీమా వెసులుబాటు కలుగుతుంది. వారి సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాల్లో అతి పెద్దది ఇదే. తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నవారికి వివరిస్తున్నాం’ అని అన్నారు. మురికివాడల క్రమబద్ధీకరణ పథకం ఎన్నికలు ఏ సమయంలోనైనా జరిగే అవకాశమున్న నేపథ్యంలో అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు సంబంధించి ఓ పథకాన్ని ప్రకటించాలని యోచిస్తోంది. ఈ విషయమై ఆ పార్టీకి చెందిన మరో నాయకుడు మాట్లాడుతూ ‘ఇటువంటి ఓ పథకాన్ని ప్రకటించినట్టయితే ఆప్ ఓటుబ్యాంకుకు గండిపడుతుంది. విధానసభ ఎన్నికల్లో విజయం సాధించాలంటే మురికివాడల్లో నివసించేవారి విశ్వాసాన్ని చూరగొనాల్సి ఉంటుంది. ’అని అన్నారు. ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు కేంద్రమంత్రలుగా బాధ్యతలను నిర్వహిస్తుండడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28. ఇందులో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని ఆ పార్టీ బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఢిల్లీ విధానసభను రద్దు చేసిన సంగతి విదితమే.