మాట్లాడుతున్న పాల్వాయి రజినీ
సాక్షి, నల్లగొండ: సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీని భూస్థాపితం చేసేందుకే బీజేపీలో చేరుతున్నట్లు టీడీపీ నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి పాల్వాయి రజినీ కుమారి పేర్కొన్నారు. బుధవారం స్థానికంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటులో దొరల పెత్తనం లేని రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్నప్పటికీ సీఎం కేసీఆర్ దొర పెత్తనంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు.
ఈనెల 18న హైదరాబాద్‌లో జరిగే బీజేపీ సభలో బీజేపీ అగ్రనేతలు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా, డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జిలంతా బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నారు. బీజేపీ, ప్రధాని మోడీ చేపడుతున్న అభివృద్ధిని చూసి దేశ వ్యాప్తంగా ప్రజలు మరోసారి ఆదరించి 330 స్థానాలు అప్పగించారన్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ వస్తుందన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజల తరపున తగిన గుణపాఠం చెప్తామన్నారు. టీడీపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి మాదగోని శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని ఆంధ్రాపార్టీగా ముద్ర వేశారని, తిప్పి కొట్టడంలో నాయకత్వం విఫలమైందన్నారు. అనంతరం రాజీనామా లేఖలను విడుదల చేశారు. ఈ సమావేశంలో సాగర్, దేవరకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కడారి అంజయ్య, మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్‌చార్జి సాధినేని శ్రీనివాస్‌రావు, ఎస్టీ సెల్‌రాష్ట్ర నాయకులు బాబూరావు, వెంకటేశ్వర్‌రావు, పోలె రామచంద్రం, ఐతరాజు మల్లేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment