
తప్పుకో బాస్
చంద్రబాబు రాజీనామాకు వైఎస్సార్‌సీపీ డిమాండ్
నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించిన పార్టీ శ్రేణులు
కదం తొక్కిన జిల్లా ప్రజలు
సబ్ కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటిచ్చారు.. తీరా ఇప్పుడు రుజువుల టేపులు దొరికితే ట్యాపింగంటున్నారు.. అవినీతి అంతుచూస్తానంటూ నీతివాక్యాలు వల్లించే మీరు అడ్డంగా దొరికిపోయినా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ రుబాబు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసిన ఓ చంద్రబాబూ.. రాష్ట్రాన్ని ఏలే అర్హత లేదు.. వెంటనే గద్దె దిగు.. అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీడీపీ అనైతిక చర్యలను నిరసిస్తూ ఆందోళనలు చేశారు.
విజయవాడ : అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదు.. తక్షణమే రాజీనామా చేసి తప్పును అంగీకరించాలి.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబే కీలక సూత్రధారి అని వెల్లడైన నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, నిరసన ర్యాలీలు నిర్వహించాయి.
సిగ్గుంటే తక్షణం వైదొలగాలి...
విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి అధ్యక్షతన ఆ పార్టీ శ్రేణులు భారీ ధర్నా చేపట్టాయి. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబుకు సిగ్గుంటే తక్షణమే పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఉన్నతస్థాయి దర్యాప్తు చేసి, సీఎం చంద్రబాబును అరెస్టు చేయాలని ఆయన కోరారు. పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ ఇలాంటి నీచ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని మండిపడ్డారు. బాబు తక్షణమే తన పదవి నుంచి తప్పుకొని ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఆధారాలతో సహా దొరికిపోయిన బాబును తక్షణమే అరెస్టు చేయాలన్నారు. దీనిని రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా మార్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు, అవినీతికి విడదీయరాని సంబంధం ఉందన్నారు. అన్ని పనులు, ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. రుజువులతో సహా దొరికినా ఇంకా చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం. శివరామకృష్ణ, కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
పామర్రులో ఉద్రిక్తత...
పామర్రులో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. అయితే వీరికి పోటీగా టీడీపీ నేతలు కూడా ర్యాలీ నిర్వహించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ కార్యకర్తలు కవ్వింపు ధోరణులకు పాల్పడినా.. స్థానిక పోలీసులు పట్టనట్లు వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆందోళన చేపట్టిన వైఎస్సార్‌సీపీ నేతలను మాత్రం ధర్నా విరమించాలని పోలీసులు పదేపదే కోరడం, అడ్డంకులు సృష్టించడంపై ఎమ్మెల్యే కల్పన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.
జిల్లాలో ఆందోళనలు ఇలా...
నూజివీడులో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు నేతృత్వంలో పట్టణంలోని ప్రధాన సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. తిరువూరులో ఎమ్మెల్యే రక్షణనిధి ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డులో ధర్నా చేపట్టారు. పెనమలూరు నియోజకవర్గంలో పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. మచిలీపట్నం నియోజకవర్గంలో పార్టీ పట్టణ కన్వీనర్ షేక్ సలార్‌దాదా నేతృత్వంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. పెడన నియోజకవర్గంలో కైకలూరు సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి ధర్నా జరిపారు. పెడన తహశీల్దార్ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బూరగడ్డ వేదవ్యాస్ ఆధ్వర్యంలోలో ధర్నా నిర్వహించారు.
మైలవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. నందిగామ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్‌మోహనరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి, మానవహారం నిర్మించారు. అనంతరం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మొండితోక అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని బస్టాండ్ సెంటర్‌లో పట్టణ మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు నేతృత్వంలో ధర్నా జరిగింది. కైకలూరులో పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు.