
టీఆర్ఎస్ కు 10, కాంగ్రెస్ కు 2
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక కోటా శాసన మండలి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 12 స్థానాల్లో 10 టీఆర్ఎస్ దక్కించుకుంది. 6 ఏకగ్రీవం కాగా, మరో నాలుగింటిని పోటీలో గెల్చుకుంది. నాలుగు జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలకు జరిగిన హోరాహోరీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 2 సీట్లు కైవసం చేసుకున్నాయి. ఈ నెల 27న పోలింగ్ జరగ్గా, నేడు ఓట్ల లెక్కింపు జరిగింది.
అమితాసక్తి రేపిన నల్లగొండ ఎమ్మెల్సీ సీటును కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరిత పోరులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ గెలుపొందారు.
రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు పట్నం నరేందర్ రెడ్, శంభీపూర్ రాజు విజయం సాధించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ చెరోకటి దక్కించుకున్నాయి. కసిరెడ్డి నారాయణరెడ్డి(టీఆర్ఎస్), దామోదర్ రెడ్డి(కాంగ్రెస్) గెలుపొందారు.