
ఇది ప్రజల విజయం: కోమటిరెడ్డి
నల్లగొండ: సమిష్టి కృషితోనే తాను విజయం సాధించానని ఎమ్మెల్సీగా ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. స్థానిక కోటా శాసన మండలి ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... ఇది ప్రజల విజయమని పేర్కొన్నారు. తన గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషి చేశారని, కలిసికట్టుగా ముందుగా సాగి విజయాన్ని అందుకున్నామని చెప్పారు.
పార్టీలు మారినా కొంతమంది నాయకులు కాంగ్రెస్ పై అభిమానంతో తనకు ఓటు వేశారని వెల్లడించారు. నల్లగొండలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆగడాలకు కళ్లెం వేస్తామన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి నైతిక బాధ్యత వహించి మంత్రి జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన విజయాన్ని సోనియా గాంధీకి కానుకగా ఇవ్వనున్నట్టు తెలిపారు. 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.