
నల్లగొండలో కోమటిరెడ్డి గెలుపు
నల్లగొండ: స్థానిక కోటా శాసన మండలి ఎన్నికల్లో విపక్ష కాంగ్రెస్ బోణి కొట్టింది. ఉత్కంఠభరిత పోరులో నల్లగొండ స్థానంలో విజయ కేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిపై 193 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజగోపాల్ రెడ్డికి 542, చిన్నపరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. మొత్తం 1100 ఓట్లు పోలయ్యాయి. తమ పార్టీ విజయంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పరస్పరం స్వీట్లు పంచుకుని అభినందనలు తెలుపుకున్నారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరుల సొంత జిల్లా కావడంతో ఇక్కడి ఎమ్మెల్సీ ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పక్కావ్యూహంతో టీఆర్ఎస్ కు చెక్ పెట్టి విజయం సాధించింది. మరోవైపు అధికార టీఆర్‌ఎస్ పార్టీ కూడా గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డింది. మంత్రి జగదీశ్వర్ రెడ్డి బాధ్యత అంతా తన భుజాలపై వేసుకుని ప్రచారం సాగించారు. క్యాంపు రాజకీయాలు నిర్వహించినా టీఆర్ఎస్ కు ఓటమి తప్పలేదు. అయితే క్రాస్ ఓటింగ్ కారణంగానే తమ అభ్యర్థి ఓడిపోయాడని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.