ఐక్యత గెలిపించింది... విభేదాలు ఓడించింది | Congress Wins 2 MLCs in Telangana | Sakshi
Sakshi News home page

ఐక్యత గెలిపించింది... విభేదాలు ఓడించింది

Published Wed, Dec 30 2015 2:37 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

ఐక్యత గెలిపించింది... విభేదాలు ఓడించింది - Sakshi

ఐక్యత గెలిపించింది... విభేదాలు ఓడించింది

(వెబ్ ప్రత్యేకం)
ఐక్యంగా పనిచేసిన చోట కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వర్గ విభేదాలతో సతమతమవుతున్న చోట కాంగ్రెస్ ఓటమి పాలైంది. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ అంశం స్పష్టంగా రుజువైంది. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ లోని బలం, బలహీనతలు బయటపడ్డాయి.

నల్గొండలో...
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడులైనప్పటి నుంచి అందరి దృష్టి ప్రధానంగా ఈ రెండు జిల్లాల పైనే పడింది. మిగతా అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ మొదటి నుంచి తన హవా కొనసాగించినప్పటికీ ఈ రెండు జిల్లాల్లో సాధ్యపడలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీ వలసలను ప్రోత్సహించినప్పుడు నల్గొండ వాటిని నిలువరించడంలో కాంగ్రెస్ నేతలు విజయం సాధించారు. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి వర్గీయులు వాటిని అడ్డుకోవడంతో పాటు జిల్లాలోని కాంగ్రెస్ నేతలను ఒక్కతాటిపై ఉంచడంలో సక్సెస్ అయ్యారు.

నల్గొండలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి నలుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు. వారిలో కాంగ్రెస్ కు చెందిన ఒక అభ్యర్థి రెబెల్ గా రంగంలో నిలిచారు. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతలు ఒక్కతాటిపైకి తేవడంలో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల (సర్పంచు, ఎంపీటీసీ, జేడ్పీటీసీ) నుంచే కింది స్థాయి వరకు పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి రాజగోపాల్ రెడ్డి చేసిన కృషి, మొదటి నుంచి ఆయన కొనసాగించిన వ్యక్తిగత సంబంధాలు ఈ ఎన్నిక సందర్భంగా ఆయనకు కలిసొచ్చింది.

జిల్లా నేతలతో సఖ్యత
ఎన్నికల ప్రకటన వెలువడిన రోజు నుంచే రాజగోపాల్ రెడ్డి స్వయంగా పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ నేతలందరినీ ఒప్పించడంలో విజయం సాధించారు. ముఖ్యంగా ఈ జిల్లా నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి, శాసనసభలో ప్రతిపక్ష నేత కె జానారెడ్డిలతో పాటు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి ముఖ్య నేతలందరినీ కలుపుకుని పనిచేయడం రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా మారింది.

పీసీసీ అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోనే ఓటమి పాలైతే పార్టీ పరువు పోతుందన్న ఆ నేతల అభిమతం కూడా కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి దోహదం చేసింది. మరోవైపు ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం పార్టీకి చెందిన ఓటర్లందరినీ చివరి వరకు కాపాడుకోవడంలో తనదైన వ్యూహంతో ముందుకు వెళ్లడం కూడా కాంగ్రెస్ కు కలిసొచ్చింది.

అంతర్గత విబేధాలతో రంగారెడ్డిలో కాంగ్రెస్ కుదేల్
రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీఆర్ఎస్ అభ్యర్థులు పట్నం నరేందర్ రెడ్డి, శంబీపూర్ రాజు లు విజయం సాధించారు.తొలి రెండు ప్రాధాన్యతా ఓట్లలోనూ రెండో అభ్యర్థి రాజు గెలవలేకపోయారు. మూడో ప్రాధాన్యతా ఓట్లు లెక్కిస్తే తప్ప టీఆర్ఎస్ అభ్యర్థి బయటపడలేకపోయారు. కాంగ్రెస్ నేతలంతా ఒక్కతాటిపై ఉండి ఉంటే పోటీ చేసిన ఒక్క స్థానాన్ని సులభంగా గెలుచుకునేది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆ పార్టీ అభ్యర్థి గెలుచుకోగలిగినన్ని ఓట్లు కాంగ్రెస్ కు ఉన్నాయి.

జిల్లాలో ఎవరికి టికెట్ ఇచ్చినా అంతా కలిసి పనిచేయాలని అనుకున్న కాంగ్రెస్ నేతలు చివరి దశలో పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది. జిల్లాకు చెందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర నేతలు సుధీర్ రెడ్డి, కే లక్ష్మారెడ్డి (కేఎల్లార్), చంద్రశేఖర్, ప్రసాదరావు, మల్ రెడ్డి రంగారెడ్డి ఇలా నాయకులంతా ఒకరి మధ్య ఒకరికి సఖ్యత లేని కారణంగా ఎమ్మెల్సీ స్థానాన్ని చేజార్చుకున్నారు.

హైకమాండ్ ధోరణితో...
ఈ స్థానం నుంచి అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ జిల్లా నేతలను సంప్రదించకుండా, చివరి నిమిషంలో ప్రకటన చేయడం కూడా పార్టీ నేతలకు రుచించలేదు. ఈ జిల్లా నుంచి ముందు టికెట్ ఎవరికి ఇవ్వాలన్న సమస్య ఉత్పన్నమైనప్పుడు సబితా ఇంద్రారెడ్డి పేరు తొలి వరుసలో నిలిచింది. ఆ తర్వాత కేఎల్లార్ లేదా సుధీర్ రెడ్డి, ఎ.చంద్రశేఖర్ ల పేర్లు తెరమీదకొచ్చాయి. ఈ తరుణంలో ఎవరికి టికెట్ ఇచ్చినా పరస్పరం సహకరించుకోవాలని భావించారు. మొదట్లో అంగీకరించినప్పటికీ సబితా ఇంద్రారెడ్డి పోటీ చేస్తే మద్దతునిస్తానన్న కేఎల్లార్ ఉన్నట్టుండి రూటు మార్చారు. జిల్లాలో సబిత ప్రాభవం పెరుగుతుందని భావించిన కేఎల్లార్ వ్యూహాత్మకంగా చంద్రశేఖర్ అభ్యర్థిత్వం వైపు మొగ్గారు. చంద్రశేఖర్ ను నిలిపితే ఓకే అన్నారు.

చంద్రశేఖర్ అభ్యర్థిత్వం తెరమీదకు రావడంతో మరో నేత మాజీ ఎమ్మెల్యే ప్రసాదరావుకు మింగుడు పడలేదు. ఎమ్మెల్సీగా గెలిస్తే భవిష్యత్తులో తన రాజకీయ భవితవ్యానికి గండి పడుతుందన్న భావనతో చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా పావులు కదపడం మొదలుపెట్టారు. ఈ స్థానం నుంచి ఎవరిని పోటీ నిలపాలని పీసీసీ నాయకత్వం తర్జనభర్జన పడుతున్న సమయంలో కొందరు నేతలు ఢిల్లీకి వెళ్లి చక్రం తిప్పారు. ఉన్నట్టుండి హైకమాండ్ చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.

అప్పటివరకు చర్చోపచర్చల్లో మునిగితేలుతున్న పీసీసీ నాయకులకు ఎటూ పాలుపోని పరిస్థితి తలెత్తింది. హైకమాండ్ అభ్యర్థిని ఫైనల్ చేసిన రోజు నుంచి నాయకులు ఎవరికి వారే అన్న చందంగా పట్టీపట్టనట్టు వ్యవహరించారు. సొంత ఓట్లను కాపాడుకోవడానికి క్యాంపులు నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. మరీ ముఖ్యంగా ప్రసాదరావు పూర్తిగా టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
 
టీడీపీ మద్దతిచ్చినా..
జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకస్థానంలో  గెలుచుకునే ఓట్లతో పాటు టీడీపీ సైతం మద్దతునిచ్చినా కాంగ్రెస్ రెండో స్థానం గెలుచుకోలేకపోవడం విశేషం. టీడీపీకి చెందిన రెండో ప్రాధాన్యత ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థికి వేయాలని ఆ పార్టీ నిర్ణయించగా, కాంగ్రెస్ లోని కలహాలు టీడీపీని సైతం బేజారెత్తించింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనూ కాంగ్రెస్ నేతలెవరూ పెద్దగా కనిపించకపోవడం టీడీపీ నేతలకు అంతుబట్టని విషయం.

దానం జోక్యం కూడా..
జిల్లా నేతలందరూ ఎమ్మెల్సీ ఎన్నికలపై తర్జనభర్జన పడుతున్న సమయంలో హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో జోక్యం చేసుకోవడం కూడా ప్రతికూల ఫలితానికి ఒక కారణంగా మారింది. గ్రేటర్ ఎన్నికల పేరుతో దానం రంగారెడ్డి జిల్లా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై జిల్లాలోని పలువురు ముఖ్య నేతలకు ఏమాత్రం మింగుడుపడలేదు. దాంతో ఎమ్మెల్సీ ఎన్నికలను పక్కనపెట్టి ముఖ్య నేతలు మకాం ఢిల్లీకి మార్చారు. దానం జోక్యమేంటని హైకమాండ్ పెద్దలను కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న సమయంలో తమ ఓటర్లను క్యాంపులకు తరలించడం వంటి కార్యక్రమాలను వదిలేసి ఢిల్లీకి వెళ్లడంతో ఆ ఓటర్లందరినీ టీఆర్ఎస్ తనవైపు తిప్పుకోవడానికి వీలు కల్పించినట్టయింది.

కొసమెరుపు...
దానం నాగేందర్ ఇదే తరహాలో తమ జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆ ప్రభావం ఉంటుందని ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement