సాక్షి, హైదరాబాద్: స్థానిక ప్రజాప్రతినిధులు పోరుబాట పట్టారు. నిధులు, విధుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. స్థానికసంస్థల కోటాలో శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో పంచాయతీరాజ్ ఫోరం ఆధ్వర్యంలో పోటీకి దిగాలని నిర్ణయిం చారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా గెలిచి రెండేళ్లు దాటినా రాష్ట్రప్రభుత్వం తమ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఎన్నికల రంగంలోకి దిగాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా అన్నిసీట్లలో పోటీ చేయ నున్నట్టు తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు రెండేసి స్థానాలున్న జిల్లాల్లో ఒక ఓటు టీఆర్‌ఎస్‌కు, మరోఓటు సంఘానికి వేయాలని అధి కార పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ సంఘాలు పిలుపునిచ్చాయి. వివిధ జిల్లాల్లోని టీఆర్‌ఎస్ అసంతృప్త ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పలువురు మద్దతు తెలిపినట్టు సమాచారం. ఉమ్మడి వరంగల్, రంగా రెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తమ బలానికితోడు బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు కూడా మద్దతు తెలిపితే ఆయాస్థానాల్లో గెలుపొందడం ఖాయమని సంఘం నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మద్దతు కోసం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలతో ప్రాథమిక చర్చలు ముగియగా సూత్రప్రాయంగా వారు అంగీకరించినట్టు చెబుతున్నారు.
విన్నవించుకున్నా ఫలితం శూన్యం
‘విధులు, నిధులు, బాధ్యతలపై ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా మా డిమాండ్లపై ప్రభు త్వం నుంచి స్పందన లేదు. ఆత్మగౌరవం చంపుకోలేకే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిర్ణయించాం. మా ఓట్లు మాకే వేయించుకొని గెలిపించుకుంటాం. ఒకవేళ గెలవకపోయినా మా నిరసన ప్రభుత్వానికి తెలపాలనే ఉద్దేశంతోనే బరిలో నిలుస్తున్నాం. అభివృద్ధికి నిధులివ్వలేదు. రూ.లక్ష కోట్ల మైనింగ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది. టీఆర్‌ఎస్ ఎంపీటీసీలు బయటకు రాకపోయినా మాకు మద్దతుగా ఉంటామని చెప్తున్నారు’ అని సాక్షికి తెలంగాణ పంజాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు సీహెచ్. సత్యనారాయణరెడ్డి తెలిపారు.
మా ఓట్లను మాకే వేసుకొని..
నేను ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామ ఎంపీటీసీ సభ్యుడిని. ఎంపీటీసీ, జెడ్పీటీసీల విధులు, నిధుల కోసం గత రెండున్నరేళ్లుగా రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో పోరాడుతున్నాం. ప్రభుత్వం స్పందించకపోవటంతో మా ఓట్లను మాకే వేసుకొని మా సమస్యలను మేమే సాధించుకోవాలని నేను ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచాయతీరాజ్ చాంబర్ పక్షాన పోటీ చేస్తున్నాను. – కొండపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఫోరం, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి
మమ్మల్ని పట్టించుకోవడం లేదు..
మేం ఎంపీటీసీలుగా గెలిచి రెండున్నరేళ్లు కావొస్తున్నా నిధులు, విధులు లేవు. ఎంపీటీసీలకు ఎలాంటి ఆత్మ గౌరవం లేదు. మా హక్కుల సాధనకు సంఘం తరఫున ఎన్నో ఉద్యమాలు చేసినా ప్రభుత్వం ఎంపీటీసీలను కనీసం పట్టించు కోలేదు. అందుకే మా సమస్యల పరిష్కారానికి మేమే పోటీచేయాలని నిర్ణయించాం. రంగారెడ్డి జిల్లాలో రెండుస్థానాలు ఉండటంతో టీఆర్‌ఎస్ ఎంపీటీసీలు సైతం ఒక ఓటు పార్టీ్టకి, మరొక ఓటు సంఘానికి వేసి మద్దతు తెలుపుతామన్నారు. – చింపుల శైలజ సత్యనారాయణరెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి
Comments
Please login to add a commentAdd a comment