
ఓటు వేశాక జైలుకు రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ కోసం ఈరోజు పిటిషన్ వేయనున్నామని ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు. పోలీసులు పెట్టిన కేసు తప్పుడుదని, బెయిల్ ఇవ్వాలని కోరతామని చెప్పారు. రేవంత్ రెడ్డిని ఈ ఉదయం న్యాయమూర్తి లక్ష్మీపతి ఎదుట హాజరుపరిచారు. రేవంత్ కు జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి రేవంత్ కు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారని లాయర్లు చెప్పారు. ఓటు వేసేందుకు ఏ సమయంలో తీసుకెళ్లతారనేది పోలీసులు తమ వీలును బట్టి చేస్తారన్నారు. ఓటు వేసిన తర్వాత ఆయనను జైలుకు తరలిస్తారన్నారు. పోలీసులు తన పట్ల దురుసుగా వ్యవహరించారని జడ్జికి రేవంత్ ఫిర్యాదు చేశారని లాయర్లు వెల్లడించారు. పోలీసుల దురుసు ప్రవర్తన కారణంగా తన చేతికి గాయమైందని, వైద్యం చేయించుకునేందుకు అనుమతించాలని కోరగా న్యాయమూర్తి మౌలిక ఆదేశాలిచ్చారని న్యాయవాదులు తెలిపారు. ఏసీబీ తరపు లాయర్ రాలేదని, అధికారులు మాత్రమే వచ్చారని చెప్పారు.