
అసెంబ్లీలో మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు ప్రమేయంపై అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ నిలదీత
నామినేటెడ్ ఎమ్మెల్యేతో బాబు మాట్లాడింది నిజం కాదా?
ఓటుకు కోట్లు అంశంపై చర్చకు అనుమతించని స్పీకర్ చర్చకు పట్టుపట్టిన ప్రతిపక్షం
కేసీఆర్ ఫోన్ చేయడంతోనే జగన్ ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నాడన్న
అచ్చెన్నాయుడు... నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్న జగన్
నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేయాలని సవాల్
తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య శాసనసభ నిరవధిక వాయిదా
హైదరాబాద్: ‘‘తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టడానికి ఆయనతో ఫోన్‌లో మాట్లాడింది మీరు కాదా? ఎమ్మెల్యేను కొనడానికి రేవంత్‌రెడ్డిని బేరానికి పంపించింది మీరు కాదా? డబ్బులు ఇచ్చింది మీరు కాదా?’’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిలదీస్తూ శుక్రవారం శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంధించిన ప్రశ్నలు ఇవి. అయన అడిగిన ప్రశ్నలకు అధికారపక్షం ఠారెత్తిపోయింది. సభానేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ ఆవరణలోని తన చాంబర్‌లో ఉన్నప్పటికీ సభలో అడుగుపెట్టలేదు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ‘ఓట్లుకు కోట్లు’ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అట్టుడికింది. ఈ అంశంపై జగన్ మాట్లాడటం మొదలుపెట్టడంతోనే స్పీకర్ మైక్ కట్ చేయగా, అధికార పార్టీ సభ్యులు అడుగడుగునా అడ్డుపడ్డారు. తమ పార్టీ అధినేత ప్రమేయం ఉన్న వ్యవహారంలో ప్రతిపక్ష నేత మాట్లాడుతుండే సరికి వారు అవాంతరాలు కల్పిస్తూ ఎదురుదాడికి దిగారు.
నిరూపించకపోతే రాజీనామా చేస్తారా?
‘‘అధికార పార్టీ సభ్యులు నా మీద ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేశారు. నేను సవాల్ విసురుతున్నా. కేసీఆర్ రాత్రి నాకు ఫోన్ చేసినట్లు నిరూపించండి. నేను రాజీనామా చేస్తా. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా?’’ అని జగన్‌మోహన్‌రెడ్డి అధికార పార్టీకి సవాలు విసిరారు. జగన్‌కు రాత్రి కేసీఆర్ ఫోన్ చేసి ఓటుకుకోట్లు కేసును శాసనసభలో ప్రస్తావించమని చెప్పారని అచ్చెన్నాయుడు ఆరోపించడంతో జగన్ ఈ సవాలు విసిరారు. సభ తొలిసారి వాయిదా పడి తర్వాత సమావేశం అయిన సమయంలో ప్రతిపక్షనేతకు మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా అంతకు ముందు తెలుగుదేశం నేతలు చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘‘మీరు(టీడీపీ వాళ్లు) ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయవచ్చు. మేము వాస్తవం చెప్పినా విని హేతుబద్ధంగా ఆలోచించరు. ఏదైనా చెబితే నిజాయితీ ఉండాలి. నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడమేనా? కేసీఆర్, చంద్రబాబు ఎన్నికల్లో పొత్తుపెట్టుకొన్నారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు పత్రికల్లో వచ్చాయి ఇవిగో. (పత్రికల క్లిప్పింగ్స్ చూపించారు). దొంగతనం చేయడం తప్పు కాదట. దొంగతనం చేస్తూ పట్టుబడితే.. పట్టుకోవడం తప్పంటున్నారు చంద్రబాబు. ఓటుకు కోట్లు కేసును రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా తయారు చేస్తున్నారు. ఫోన్లో మాట్లాడిన వాయిస్ (నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన గొంతు) మీది (చంద్రబాబుది) అవునా, కాదా? బేరానికి రేవంత్‌రెడ్డికి డబ్బులిచ్చి పంపించింది మీరు కాదా? వీడియో, ఆడియో రికార్డింగ్‌లలో పట్టుబడ్డారు. ఫోరెన్సిక్ నివేదికలు చంద్రబాబు ప్రమేయాన్ని ధ్రువీకరించాయి. నేను ఇక్కడే(శాసనసభలో) ఉన్నాను. ఆయన(చంద్రబాబు)ను వచ్చి సమాధానం చెప్పమనండి.
ఆ కేసు చార్జిషీట్‌లో 22 సార్లు చంద్రబాబు పేరు ఉంది. ఈ విషయం గురించి చర్చ జరగకూడదు అని అంటున్నారు. నా గురించి మాత్రం సభలో రోజూ చర్చించవచ్చు. రోజూ నోటికి వచ్చినట్లు తిట్టొచ్చు. నన్ను తిట్టడంతో ఆగరు. చనిపోయిన మా నాన్న మీదా మాట్లాడతారు. దివంగత నేత ప్రియతమ నాయకుడు డా.వైఎస్ రాజశేఖరరెడ్డి పేరూ ప్రస్తావిస్తారు. నా గురించి ఏం మాట్లాడినా ఫర్వాలేదా? చంద్రబాబు మీద మాట్లాడితే సబ్‌జుడీస్ (కోర్టుల్లో ఉన్న వ్యవహారం) అంటున్నారు. నా గురించి మాట్లాడితే సబ్‌జుడీస్ కాదా? తప్పు చేసి తప్పించుకోవడానికి చంద్రబాబు సభను ఉపయోగించుకుంటున్నారు. చార్జిషీట్‌లో 22 సార్లు బాబు పేరుంటే సభలో ఎందుకు చర్చి ంచకూడదు? విచ్చలవిడిగా లంచాలు మేసి వాటితో ఓట్లు కొనుగోలు చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే సభలో చర్చించకూడదా?...’’ అని జగన్ ప్రసంగిస్తుండగా స్పీకర్ అడ్డుతగులుతూ అజెండాలో లేని అంశాల పై మాట్లాడటానికి కుదరదంటూ మైక్ కట్ చేశారు..
తెలుగుదేశం సభ్యుల విమర్శలు...
అధికార పార్టీ సభ్యులు కాలువ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, పల్లె రఘునాథరెడ్డి తదితరులు సభలో పరిమితులు దాటి జగన్ మీద విమర్శల వాన కురిపించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్ర ను జగన్ ఎండగడుతుండే సరికి ఆయనపై విమర్శలతో విరుచుకుపడ్డారు. అధికారపార్టీ సభ్యుల తీరుపై ప్రతిపక్షపార్టీ సభ్యులు తీవ్రనిరసన వ్యక్తం చేశారు.
ప్లకార్డుల ప్రదర్శన.. నినాదాలు హోరు...
ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో విపక్షసభ్యులు నిరసన వ్యక్తం చేశారు. చర్చ కోసం పట్టుబట్టారు. స్పీకర్ అంగీకరించకపోవడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులంతా స్పీకర్ పోడియం వద్ద నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ‘ఓటుకు కోట్లు ఎక్కడవి? చంద్రబాబు బ్రీఫ్డ్ మీ’ అని రాసున్న ప్లకార్డులు ప్రదర్శించారు. ‘ఒక ఓటు ఐదు కోట్లు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే ఆందోళనల మధ్య 9.28 గంటలకు సభ తొలిసారి వాయిదా పడింది. 10.15 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడూ ఇదే పరిస్థితి కొనసాగింది.
కాసేపు విపక్షనేత జగన్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చి అర్ధాంతరంగా మైక్ చేయడం, విపక్ష సభ్యుల నినాదాల హోరులోనే అధికార పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో ప్రతి విమర్శలు చేయడం మినహా ఏ అంశంపైనా చర్చ చేపట్టలేకపోయారు. 10.33 గంటలకు సభ రెండోసారి వాయిదా పడింది. మధ్యాహ్నం 1.05 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడూ విపక్ష సభ్యులు ఓటుకుకోట్లు కేసుపై చర్చించాలని పట్టుబట్టి స్పీకర్ పోడియం వద్ద నిలబడి నినాదాలు అందుకున్నారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య శాసనసభ వర్షాకాల సమావేశాల వివరాలను వెల్లడిస్తూ సభను స్పీకర్ నిరవధిక వాయిదా వేశారు.
అధికార పార్టీ సభ్యులు నా మీద ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేశారు. నేను సవాల్ విసురుతున్నా. నాకు కేసీఆర్ ఫోన్ చేసినట్లు నిరూపించండి. నేను రాజీనామా చేస్తా. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా? - వైఎస్ జగన్