సాక్షి, కరీంనగర్: సీనియర్ల అలకల మధ్య పీసీసీ అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్‌రెడ్డికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి మెజారిటీ నాయకుల మద్దతు లభించింది. బుధవారం రేవంత్ పీసీసీ చీఫ్‌గా ప్రమాణం చేయబోతున్నారు. ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై జిల్లాకు చెందిన ఒకరిద్దరు సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నప్పటికీ, అండగా నిలుస్తున్న వారే అధికంగా ఉండడం గమనార్హం. వీరంతా బుధవారం గాంధీభవన్‌లో జరిగే కార్యక్రమానికి తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇప్పటివరకు కొనసాగిన కమిటీలో పనిచేసిన పొన్నం ప్రభాకర్ నూతన అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సంఘీభావం తెలిపారు.
ఈ మేరకు రేవంత్ కూడా పొన్నంను కలిసి అండగా నిలవాలని కోరారు. పార్టీలో క్రమశిక్షణ కార్యకర్తగా అధినేత్రి సోనియాగాంధీ, నాయకుడు రాహుల్‌గాంధీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని ఆయన స్పష్టం చేశారు. గాంధీభవన్‌కు తరలిరావాలంటూ ఆయన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పార్టీ నాయకులందరికీ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం పంపించారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఇతర నాయకులతో కలిసి హైదరాబాద్ తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును కలిసిన రేవంత్
పీసీసీ అధ్యక్ష పదవి రేసులో చివరి వరకు మంథని ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తనవంతు ప్రయత్నాలు చేశారు. సీఎల్‌పీ నాయకుడు భట్టి విక్రమార్క శిబిరంలో ఉన్న శ్రీధర్‌బాబు చివరి నిమిషంలో తనకు, భట్టికి కాకుంటే ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి పీసీసీ పీఠం అప్పగించాలని అధిష్టానాన్ని కోరారు. అయితే.. ఏఐసీసీ మాత్రం రేవంత్‌రెడ్డికే అవకాశం కల్పించింది. ఈ పరిణామాలతో అసంతృప్తికి గురైనప్పటికీ, ఆయన ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం రేవంత్‌రెడ్డి సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్కను కలిసిన అనంతరం శ్రీధర్‌బాబును ఆయన నివాసంలో కలుసుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు శాలువాతో రేవంత్‌రెడ్డిని సత్కరించి, పార్టీ అభ్యున్నతి కోసం పనిచేయాలని కోరారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీధర్‌బాబు పీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు, చొప్పదండి నేత మేడిపల్లి సత్యం, వేములవాడ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్, హుస్నాబాద్ నేత బొమ్మ శ్రీరామ్, ధర్మపురి ఇన్‌చార్జి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఓదెల జెడ్పీటీసీ గంట రాములు, సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, నరేందర్ తదితరులు హాజరు కానున్నట్లు సమాచారం.
జీవన్‌రెడ్డి రాక అనుమానమే!
ఉమ్మడి కరీంనగర్ నుంచి పీసీసీ రేసులో తుదివరకు ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పార్టీ తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని భావిస్తున్నట్లు సమాచారం. అత్యంత సీనియర్ నేతగా అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిగా ఉన్న జీవన్‌రెడ్డి ఈసారి పీసీసీ పీఠం తనకు ఖాయమనే భావించారు. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డిల మధ్య ఉన్న పోటీలో మధ్యేవాదంగా జీవన్‌రెడ్డికి అవకాశం లభిస్తుందని పార్టీ వర్గాలు కూడా అంచనా వేశాయి.
అయితే.. పార్టీ రేవంత్‌రెడ్డి వైపు మొగ్గడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. అదే సమయంలో అసంతృప్త నేతలు, సీనియర్లను కలుస్తూ వచ్చిన రేవంత్‌రెడ్డి జగిత్యాలలో ఉన్న జీవన్‌రెడ్డిని మాత్రం కలవలేదు. దీంతో బుధవారం ఆయన ప్రమాణస్వీకారానికి హాజరు కావడం అనుమానమే. ఈ విషయమై జీవన్‌రెడ్డితో ‘సాక్షి’ మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ‘బుధవారం మాట్లాడతాను’ అని దాటవేశారు.
Comments
Please login to add a commentAdd a comment