truck crash
-
ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
ఖాట్మాండ్: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు లోయలో పడిపోవడంతో 20మంది మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖాట్మాండ్ సమీపంలోని నువాకోట్ జిల్లాలో శనివారం ఈ ప్రయాదం జరిగింది. గాయపడ్డ వారిని సెంట్రల్ నేపాల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారుల సమాచారం ప్రకారం గయాంగడండా ప్రాంతంలో కొండపై నుంచి వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి 100 మీటర్ల లోయలో పడిపోవడంతో ఈప్రమాదం సంభవించింది. ఇప్పటి వరకు 20 మృత దేహాలను వెలికితీసినట్లు పోలీస్ అధికారి గయాన్‌లాల్ యాదవ్ తెలిపారు. ట్రక్కులో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే వాహనం అదుపుతప్పినట్లు అధికారులు తెలిపారు. -
దొరికినోడికి... దొరికినన్ని
అది తూర్పు చైనాలోని ఓ ఎక్స్‌ప్రెస్ హైవే. గత మంగళవారం భారీ కార్గోలారీ దూసుకెళ్తోంది. ఏమైందో ఏమో... అకస్మాత్తుగా పల్టీలు కొట్టింది. నిమిషాల్లోనే పక్కనున్న పల్లెలో అలజడి. అందరూ బుట్టలు, పెద్ద వంటపాత్రలు పట్టుకొని హైవే పైకి పరుగో పరుగు. ఎందుకంటారా? పడిపోయిన లారీలో 10 వేల కోడిపిల్లలు ఉన్నాయి మరి. కొన్ని చనిపోయాయి తప్పితే మిగతావన్నీ నిక్షేపంగా ఉన్నాయి. జనం వీటిని ఏరుకోవడానికి పోటీలుపడ్డారు. వీరిని నియంత్రించడం పోలీసుల వల్ల కూడా కాలేదట. చివరికి హైవేపై ట్రాఫిక్‌నే నిలువరించారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. చివరికి దొరికినోళ్లు దొరికినన్ని కోడిపిల్లలను పట్టుకుపోయారు. ఐదు లక్షల రూపాయల విలువైన కోడిపిల్లలు మాయమైపోయాయి. ఆపై పోలీసులు తీరిగ్గా ట్రాఫిక్ క్లియర్ చేశారట.