సొసైటీల మాటున స్వాహా
- సంస్థల పేరుతో మునిసిపల్ ఆస్తుల స్వాధీనం
- బోర్డులు తిప్పేసి సొంత ఆస్తులుగా మార్చేసుకున్న వైనం
- స్పందించని అధికార యంత్రాంగం.. కార్యాలయంలో కనిపించని దస్త్రాలు
హిందూపురం అర్బన్ : హిందూపురం నడిబొడ్డున రూ.కోట్ల విలువ చేసే మునిసిపల్ స్థలాలను సంస్థల పేరిట స్వాధీనపర్చుకుని సొంత ఆస్తులుగా మార్చేసుకున్నారు. తద్వారా వచ్చే రాబడిని కాజేస్తున్నారు. ఆస్తులు ఇలా అన్యాక్రాంతం అవుతున్నా మునిసిపల్ యంత్రాంగం చేష్టలుడి చూస్తోంది. పట్టణంలోని వైఎస్సార్ పరిగి బస్టాండులో రాజీవ్‌గాంధీ మెమోరియల్ ట్రస్టు పేరిట స్మారక భవనం నిర్మాణానికి 1992 మార్చిలో సర్వే నెంబరు 68లో రూ.కోట్ల విలువ చేసే ఐదు సెంట్ల స్థలం కేటాయించారు. అందులో రాజీవ్‌గాంధీ పేరిట స్మారక భవనం నిర్మించి దానిని ప్రజాసంక్షేమానికి వినియోగించాల్సి ఉంది.
కానీ అలా చేయకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. సుమారు 12కుపైగా దుకాణాలు ఏర్పాటు చేసి వారి వద్ద అడ్వాన్సులు, అద్దెల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేసుకుంటున్నారు. ఈ ట్రస్టు అధికార పార్టీ నాయకుడి ఆధీనంలో ఉండటంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అలాగే 1975 డిసెంబరులో టీఎన్ 356 ది సిండికేట్ ఫార్మర్స్ సర్వీస్ కార్పొరేషన్ సొసైటీ లిమిటెడ్ ప్రారంభించారు. దీనికి మున్సిపాల్టీ పరిధిలోని పరిగి బస్టాండులో 68/1 సర్వే నెంబరులో 1997 జూన్‌లో రైతులకు అవసరమైన ఎరువులు నిల్వ ఉంచే గోదాముల ఏర్పాటుకు 244.4 గజాల స్థలాన్ని కేటాయించారు. అయితే 2000 సంవత్సరం తర్వాత సొసైటీ నష్టాల్లో కూరుకుపోయి మూతపడింది. మున్సిపాలిటీ ఇచ్చిన స్థలంలో షాపింగ్ రూములు కట్టి అద్దెలు వసూలు చేసుకుంటున్నారు.
రాజకీయ జోక్యంతో
ఆయా సంస్థలు ఏయే లక్ష్యాలు చూపి ప్రభుత్వ స్థలాన్ని పొందుతాయో వాటి కోసం కాకుండా ఇతరత్రా పనులకు ఉపయోగిస్తే ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చనే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఆ మేరకు నిర్వీర్యమైన సంస్థలకు కేటాయించిన స్థలాలను స్వాధీనపర్చాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే రాజకీయ జోక్యంతో ఆ వ్యవహారం అంతటితో ఆగిపోయింది. కౌన్సిల్ సమావేశంలో సభ్యులు పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయా స్థలాలకు సంబంధించిన రికార్డులు కనిపించకుండా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం
మున్సిపల్ ఖాళీ స్థలాలు, అన్యాక్రాంతమైన వాటిపై విచారణ కోసం ప్రత్యేకంగా బృందం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అలాగే రాజీవ్‌ట్రస్టు, సిండికేట్ ఫార్మర్స్ సొసైటీ స్థలాలపైనా నోటీసులు జారీ చేస్తామని, ఆ స్థలాల పరిస్థితులపై సమగ్ర విచారణ చేపడతామని చెప్పారు.