1బీలో తప్పుల కుప్పలు
అయోమయంలో రైతులు
నిజనిర్ధారణ కమిటీ ఎదుట ఆవేదన
ఈ-పాస్ బుక్ రద్దు చేయాలని డిమాండ్
కైకలూరు : ‘కుటుంబానికి ఏ కష్టమొచ్చినా తాతముత్తాతల నుంచి పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లు ఆదుకున్నాయి. ఇప్పుడు ఈ-పాస్ బుక్‌లు అంటూ ఆన్లైన్ వ్యవస్థను తీసుకొచ్చారు... తీరా అందులో మా పేర్లు లేవు’ అని రైతు సంఘాల నిజనిర్ధారణ కమిటీ ఎదుట కలిదిండి మండలం కొండూరు గ్రామ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో 255 జారీ చేసింది. ఈ నేపథ్యంలో రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ స్వగ్రామమైన కలిదిండి మండలం కొండూరు పంచాయతీ కార్యాలయం వద్ద రైతు సంఘాల నిజనిర్ధారణ కమిటీ ఆదివారం రైతులతో ముఖాముఖి నిర్వహించింది. ఏ రైతును కదిపినా ఆందోళనే వ్యక్తమైంది. 15 ఎకరాలకు ఏటా శిస్తు చెల్లిస్తున్నా 1బీలో ఎకరం మాత్రమే నమోదయిందని ఒక రైతు, ఒకే భూమికి ఇద్దరు శిస్తు చెల్లిస్తున్నా సరిచేయలేదని మరో రైతులు.. ఇలా అందరూ తమ సమస్యలను కమిటీకి విన్నవించారు. గ్రామంలో మొత్తం 536 రైతుల పట్టాదారు పుస్తకాలను పరిశీలించగా ఈ-పాస్ బుక్ 1బీలో 125 మంది రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం తప్పులు ఉన్నట్లు కమిటీ గుర్తించింది.
రైతు సంఘ నాయకుల పరిస్థితీ ఇంతే...
రైతు సమస్యలపై నిరంతరం పోరాడే రైతు సంఘాల నాయకుల భూములు కూడా రికార్డుల్లో నమోదు కాలేదు. యెర్నేని నాగేంద్రనాథ్ బంధువులకు చెందిన సర్వే నంబరు 320లో 15 ఎకరాల 40 సెంట్లు పట్టా భూమి ప్రభుత్వ భూమిగా నమోదయింది. యెర్నేని పుష్పవతమ్మకు చెందిన భూములు 1బీలో రుద్రరాజు బాలకుమారి పేరు మీద ఉన్నాయి. గ్రామంలో బాలకుమారి ఎవరో పెద్దలు కూడా చెప్పలేకపోతున్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డికి చెందిన 1బీ రికార్డులలో తండ్రి పేరు తప్పుగా నమోదయ్యింది. కొండూరులో భూములు కలిగిన డెల్టా ఫిష్పార్మర్స్ అసోషియేషన్ జనరల్ సెక్రటరీ రామచంద్రరాజుకు చెందిన భూమి వివరాలు తప్పుగా నమోదయ్యాయి. తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామన్య రైతుల సంగతేంటని రైతు సంఘ నాయకులు విస్మయం వ్యక్తంచేశారు.
రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే
ప్రభుత్వం విడుదల చేసిన జీవో 255 ప్రకారం 1బీలో నమోదయిన వివరాలు ఆధారంగా భూమి బదలాయింపులు, రుణాల మంజూరు జరిగితే అసలు భూమి యజమానికి తెలియకుండానే అన్యాక్రాంతమయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆన్లైన్ విధానంపై అవగాహన లేని రైతులు 1బీలో తమ పేరు ఉందా? లేదా అని తెలుసుకునేందుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని పేర్కొన్నారు. రైతాంగ సమైఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్నాగిరెడ్డి, ఏపీ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య, డెల్టా పరిరక్షణ సమితి నాయకుడు కొలనుకొండ శివాజీ, కుమారస్వామి, కొలనుకొండ శివాజీ, రాజమోహనరావు, రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ అధికారులు భయపడుతున్నారు...
ప్రభుత్వ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కారణంగా రెవెన్యూ అధికారులు సైతం భయపడుతున్నారు. లోపాలను విమర్శించే రైతు నాయకుల సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పట్టదార్ పుస్తకాలను రద్దు చేయడం తగదు. అభ్యంతరాలను వినకుండానే జీవో విడదల చేయడం మంచిదికాదు. ఈ-పాస్ బుక్ విధానాన్ని రద్దు చేయాలి. - ఎం.వి.ఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
రైతులకు నరకం
ఈ-పాస్ బుక్‌లో తమ పేర్లు లేక రైతులు నరకం అనుభవిస్తున్నారు. పాస్‌బుక్‌లో ఉన్నవి కూడా 1బీలో నమోదు కాలేదు. వారసత్వంగా సక్రమించి, మూజువాణి పద్ధతిలో అన్నదమ్ములు పంచుకున్న భూ ముల వివరాలకు అనేకచోట్ల 1బీలో నమోదు కాలేదు. వెబ్‌ల్యాండ్ ఆధారంగా భూ బదాలయింపులు, రుణాల మంజూరు విధానాన్ని రద్దు చేయాలి. కొత్త విధానంతో భూ కబ్జాలు జరిగే అవకాశం ఉంది. - యెర్నేని నాగేంద్రనాథ్, రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు